Early age anxiety: పిల్లల్లో యాంగ్జైటీ గమనించారా? కారణాలు, లక్షణాలు, చికిత్స ఇవే
20 January 2023, 14:14 IST
- పిల్లల్లో యాంగ్జైటీ తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తుంది. వారిలో ఎదురయ్యే యాంగ్జైటీ రకాలు, కారణాలు, లక్షణాలు వంటి అంశాలపై నిపుణుల సలహాలు ఇవే.
Early age anxiety: Types, causes, symptoms and cure
ఆందోళన ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంది. ఆందోళన ఒక భావోద్వేగం అయినప్పటికీ భౌతిక లక్షణంగా కూడా కనిపిస్తుంది. బయటి నుంచి ఉండే ముప్పుపై మీకు కంట్రోల్ ఉండకపోవచ్చు. కానీ నేర్చుకోవడం ద్వారా మేనేజ్ చేయగలిగే అంతర్గత స్థితి ఇది. మీరు ఉత్తమ నాయకుడిగా ఎదగడానికి మీ యాంగ్జైటీనే నమ్మకమైన భాగస్వామిగా భావించవచ్చు. అయితే యాంగ్జైటీకి అనుబంధంగా చాలా లక్షణాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ ఆందోళనను అనుభవించే ఉంటారు. ఏదో అపాయం, భయం, ప్రమాదం లేదా ముప్పు ముంచుకురావడం వంటి విషయాల కారణంగా యాంగ్జైటీకి లోనవుతారు. కొన్నిసార్లు ఇది శృతి తప్పి అనారోగ్యానికి దారితీస్తుంది. చాలా మంది పిల్లల్లో భయాలు ఉంటాయి. విచారంగా కనిపిస్తారు. నమ్మకం లేని వారుగా కనిపిస్తారు. ఎదుగుదల సమయంలోనే వారు భయాలు ఎదుర్కొంటుండొచ్చు.
భయాలు, ఆందోళనలు పిల్లల్లో సహజమే అయినప్పటికీ, నిరంతరమైన, తీవ్రమైన రూపాల్లో భయాలు ఉన్నప్పుడు అది ఆందోళనగా, డిప్రెషన్‌గా గుర్తించాల్సి ఉంటుంది. కొన్సిసార్లు అవి అంతర్గత రుగ్మతలుగా భావించాల్సి వస్తుంది. చిన్న వయస్సులోనే యాంగ్జైటీకి అనేక కారణాలు ఉండొచ్చు. కోవిడ్ మహమ్మారి అనంతర కాలంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వీరంతా తోటి పిల్లలతో ఆడుకోకుండా ఏకాంతంగా గడపడం కారణమై ఉండొచ్చు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం కారణమై ఉండొచ్చు.
ఈ పిల్లలకు వారి వయస్సు పిల్లలతో సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం, ఇంటి లోపల్లే మగ్గిపోవడం, మొబైల్స్, స్క్రీన్స్‌కు అతుక్కుపోవడం వారి నైపుణ్యాభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది. ప్రిస్కూల్ అటెండ్ అవడం, సోషల్ ఇంటరాక్షన్ ఉండేలా చూడడం, వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యేలా చూడడం అవసరం.
చిన్నారులు, టీనేజర్లలో యాంగ్జైటీ గురించి..
యాంగ్జైటీ రకాలు
హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ డీవై పాటిల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ సుప్రకాష్ చౌదరి ఈ అంశాలపై మాట్లాడారు. జన్యుపరమైన కారణాలు, జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి వల్ల యాంగ్జైటీ కనిపించవచ్చు. సమస్య తీవ్రంగా, నిరంతరంగా ఉంటే దానికి డయగ్నోసిస్ అవసరం. ఇందుకు చైల్డ్ సైక్రియాటిస్ట్, సైక్రియాట్రిస్ట్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. యాంగ్జైటీ రకాలు ఇక్కడ చూడొచ్చు..
సపరేషన్ యాంగ్జైటీ: ఒక వ్యక్తి నుంచి గానీ, ఒక ప్లేస్ నుంచి గానీ ఎడబాటు, విడిపోవడం వల్ల తీవ్రస్థాయిలో యాంగ్జైటీ కనిపిస్తుంది. ఆ వ్యక్తి లేదా ఆ ప్రాంతం వారికి భద్రత, సంరక్షణ, ప్రేమ, ఆప్యాయత వంటివి కనిపించి వారి ఎడబాటుతో ఈ సపరేషన్ యాంగ్జైటీ మొదలవుతుంది.
సోషల్ యాంగ్జైటీ: ఇతరులు తమగురించి ప్రతికూలంగా అనుకుంటారేమోనన్న భయమే సోషల్ యాంగ్జైటీ.
నిర్ధిష్ట ప్రాంతాల్లో మౌనం: కొన్ని నిర్ధిష్ట ప్రదేశాలు, సందర్భాల్లో పిల్లలు మాట్లాడలేకపోతుంటారు. తెలిసిన వారి వద్ద బాగా మాట్లాడే పిల్లలు కూడా స్కూల్, ఇతర ప్రదేశాల్లో వారు మాట్లాడలేకపోవచ్చు.
ఫోబియా: ఒక నిర్ధిష్ట సందర్భం, వస్తువు వల్ల ఎదురయ్యే హేతుబద్ధత లేని భయం. ఫోబియా ఇతర యాంగ్జైటీ రుగ్మతల్లా కాదు. అది కేవలం ఒక నిర్ధిష్ట కారణానికి సంబంధించింది.
ప్యానిక్ డిజార్డర్: అకస్మాత్తుగా కొన్ని విషయాల్లో పదేపదే తీవ్రమైన యాంగ్జైటీకి గురవడం. దడ, చెమట, వణుకు, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఎదురవ్వొచ్చు.
యాంగ్జైటీకి కారణాలు
మాక్స్ మల్టీ స్పెషాలిటీ సెంటర్‌కు చెందిన మెంటల్ హెల్త్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సమీర్ మల్హోత్రా ఆయా అంశాలపై మాట్లాడారు. ‘యాంగ్జైటీకి విభిన్న అంశాలు కారణమవ్వొచ్చు. జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో ఒత్తిడితో కూడిన వాతావరణం, మద్యంపై ఆధారపడడం, కుటుంబంలో అసహనం, కుటుంబంలో భావోద్వేగాల పెరుగుదల, తల్లిదండ్రుల నుంచి అసమ్మతి ఎదుర్కోవడం వంటివి కారణమై ఉండొచ్చు. అలాగే మానసిక గాయాలు, సపోర్ట్ నెట్‌వర్క్ కోల్పోవడం, ఎక్కువ అంచనాలు, అతిగా మొబైల్ వినియోగం, నిద్ర వేళలు పాటించడకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ అతిగా తినడం, శారీరక వ్యాయామం లేకపోవడం, టెక్నాలజీ మీద అతిగా ఆధారపడడం, సహనం లేకపోవడం కారణమై ఉండొచ్చు..’ అని వివరించారు.
యాంగ్జైటీ లక్షణాలు:
యాంగ్జైటీ లక్షణాలను డాక్టర్ సుప్రకాష్ చౌదరి ఇలా వివరించారు.
1. ఉద్రేకం, కదలకుండా కూర్చోలేక పోవడం.
2. పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లడం.
3. ఏకాగ్రత లేకపోవడం
4. నిద్రపోవడంలో ఇబ్బంది.
5. తరచుగా పీడకలలు
6. తిండి సక్రమంగా తినకపోవడం
7. చిన్న విషయానికే కోపం కలిగి ఉండటం.
8. తరచుగా కన్నీళ్లు రావడం
9. కడుపు నొప్పి గురించి తరచుగా ఫిర్యాదు చేయడం
చైల్డ్ సైకాలజిస్ట్, బిహేవియర్ అనలిస్ట్ అరుణా అగర్వాల్ యాంగ్జైటీ లక్షణాలను ఇలా వివరించారు.
- బిగ్గరగా ఏడ్వడం: తోటి వయస్సు పిల్లలకు, సోషల్ గ్రూప్స్‌కు దూరంగా ఉంటూ వేడుకలు, సమావేశాల్లో పిల్లలు బిగ్గరగా ఏడ్వడం
- మాటల్లో ఆలస్యం: పిల్లలు ఏడ్వడం, కొట్టడం, స్నేహపూరితంగా ఉండకపోవడం వంటివి కూడా యాంగ్జైటీ ప్రవర్తన లక్షణాలు. పిల్లలు తమ భావాలను వ్యక్తపరచడంలో ఆలస్యమవడం కూడా ఒక లక్షణమే.
- తల్లిదండ్రుల అటెన్షన్ కోరడం: పేరెంట్ ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినప్పుడు పిల్లలు వికృతమైన పనులు చేస్తుంటారు. దేని గురించో పట్టుబట్టడం, ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలే.
డాక్టర్ సమీర్ మల్హోత్రా ఈ లక్షణాలను వివరిస్తూ ‘అరచేతులు చమట పట్టడం, ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, చంచలత్వం, ఎక్కువగా ఆతురుతలో ఉండటం, చాలా వేగంగా మాట్లాడటం, కొన్నిసార్లు తడబడటం వంటివి చేస్తారు. ఎత్తులు, విమానాలు, క్లోజ్డ్ ఛాంబర్‌లు, చీకటి, పరీక్షల ఆందోళన, నిద్రలేమి, అలసటగా, నిస్సహాయంగా లేదా కొన్నిసార్లు చిరాకుగా అనిపించడం కూడా యాంగ్జైటీ లక్షణాలే..’ అని వివరించారు.
యాంగ్జైటీ చికిత్స:
డాక్టర్ సుప్రకాష్ చౌదరి యాంగ్జైటీకి చికిత్స గురించి వివరించారు. ‘సైకోథెరపీ, బిహేవియరల్ థెరపీ, మెడికేషన్ కలగలిపిన చికిత్స ఉంటుంది. మద్యంపై ఆధారపడడం, డిప్రెషన్, ఇతర పరిస్థితులు కొన్నిసార్లు వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అంతర్గతంగా ఉన్న పరిస్థితులు నియంత్రణలోకి వచ్చాక యాంగ్జైటీ రుగ్మతను నయం చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం అవసరం. పిల్లల సమస్యల గురించి వారితో తరచూ మాట్లాడాలి. వాటిని వారి ముందు తేలిగ్గా తీసిపారేయరాదు. పాఠశాల వద్ద వారి సమస్యలేం ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. టీచర్ల వల్ల భయం కావొచ్చు. లేదా ఇతర సిబ్బంది వల్ల భయం కావొచ్చు. తోటి విద్యార్థుల వల్ల భయం కావొచ్చు.. అవన్నీ తెలుసుకోవాలి..’ అని వివరించారు.
కొన్ని కేసులను ఇంటి వద్దే హాండిల్ చేయొచ్చని చైల్డ్ సైకాలజిస్ట్ అరుణ అగర్వాల్ వివరించారు. చిన్న చిన్న పరిష్కారాలు సరిపోతాయని చెప్పారు. చైల్డ్ సైకాలజిస్ట్‌ను గానీ, పిల్లల వైద్య నిపుణులను గానీ సంప్రదించాలని సూచించారు. తోటి పిల్లల సమూహాలలో చేర్చడం, పొరుగింట్లో ఉన్న పిల్లాడితో ఆడుకోనివ్వడం చేసినా కొన్ని కేసుల్లో సరిపోతుందని వివరించారు. పిల్లలు తమ భావాలను వ్యక్తపరిచేలా ప్రోత్సహించాలని, చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేయాలని సూచించారు. తరచుగా పిల్లలను సమీప బంధువులు, స్నేహితుల ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.
యాంగ్జైటీని నియంత్రించేందుకు డాక్టర్ సమీర్ మల్హోత్రా సూచనలు
సమతుల ఆహారం ఇవ్వడం, షెడ్యూలు ప్రకారం నిద్ర పోయేలా చేయడం, శారీరక శ్రమ ఉండేలా.. అంటే ఆటల్లో పాల్గొనేలా చేయడం, యోగా నేర్పడం చేయాలి. నిర్మాణాత్మక హాబీల్లో నిమగ్నమయ్యేలా చూడాలి. అనారోగ్యకరమైన పోలికలు, పోటీ లేకుండా చూడాలి. మొబైల్, ఇంటర్నెట్ వినియోగం నియంత్రించాలి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు, కండరాలు రిలాక్సయ్యే ఎక్సర్‌సైజులు చేయించాల్సి ఉంటుంది.
పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు ఏవైనా ఉన్నాయో చెక్ చేయించాలి. అవసరమైతే బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పించాలి. ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం అవసరమైతే ఔషధాలు ఇప్పించాలి.