Check list for parents: పిల్లలను స్కూలు పంపడంలో టెన్షన్? ఈ 5 టిప్స్ మీకోసమే
Check list for parents: పిల్లలను స్కూలుకు పంపడంలో నానా హైరానా పడే పేరెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన, పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి.
Parenting: పిల్లలను స్కూల్‌కు పంపడంలో టెన్షన్ పడుతున్నారా? చాలా తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యే ఇది. చివరకు ఆలస్యం అవుతుందని వారు అల్పాహారం కూడా తినని పరిస్థితి తల్లిదండ్రులను బాధిస్తుంది. ముఖ్యంగా ప్రైమరీ తరగతుల్లో ఉన్న వారైతే ఈ కష్టం ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్లాన్ చేసుకుంటే ఎలాంటి సమస్య, ఒత్తిడి లేకుండా ఉండడంతో పాటు పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులోనూ వారికి చక్కటి ప్రణాళిక అలవడుతుంది. జీవితంపై సానుకూల ప్రభావం పడుతుంది.
స్కూల్‌కు సమయానికి పంపడంలో ఉండాల్సిన ప్లాన్ ఇదే..
1. చెక్ లిస్ట్ రాసుకోండి
పదే పదే మీరు పిల్లలను ఆలస్యంగా పంపడం, లేదా సరిగ్గా సమయానికి స్కూలుకు చేరుకోవడంలో ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతున్నట్టయితే ఏయే విషయాలు ఆలస్యమవుతున్నాయో గుర్తించండి. ఇందుకు ముందుగా అసలు స్కూలుకు రెడీ చేయించేందుకు ఏయే అవసరాలు ఉన్నాయో ఒక చెక్ లిస్ట్ రాసుకోండి. పిల్లలు పాఠశాల నుంచి రాగానే తగిన విశ్రాంతి వారికి ఉండేలా చేసి ఆ తరువాత ఇక చెక్ లిస్ట్ అమలయ్యేలా చూడడమే మన బాధ్యత.
2. చెక్ లిస్ట్ ఇలా రెడీ చేయడం
హోం వర్క్ చేయించడం, టెస్ట్‌లు ఉంటే వాటికి సిద్ధం చేయించడం, అల్పాహారానికి ప్రిపరేషన్ (ఇడ్లీ, వడ, దోశ బ్యాటర్ తయారీకి), షూ పాలిష్, యూనిఫారమ్ ఐరన్ చేసి పెట్టుకోవడం, స్కూల్ బ్యాగ్ రెడీ చేసి పెట్టుకోవడం వంటి మీ చెక్ లిస్ట్‌లోని అంశాలు ముందు రోజే కంప్లీట్ చేసుకోవాలి. ఇక ఉదయం లేచాక ఒకవైపు అల్పాహారం సిద్ధం చేయాలి. స్నాక్ బాక్స్ సిద్ధం చేయాలి. లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి. ఇవి పూర్తయ్యే దశలో ఇక పిల్లలను సిద్ధం చేయడం ప్రారంభించాలి. బ్రష్ చేయించడం, పాలు తాగించడం, కాలకృత్యాలు, స్నానం, అల్పాహారం, యూనిఫారమ్, షూస్ ఇలా వన్ బై వన్ సాగిపోతూ ఉండాలి. వాటర్ బాటిల్ పెట్టారా? మాస్క్ ఇచ్చారా? ఐడీ కార్డ్ ఇచ్చారా? స్వెటర్ ఇచ్చారా? ఇవన్నీ మీ చెక్ లిస్ట్‌లో భాగమవ్వాలి. లేదంటే చివరి నిమిషంలో వారిని ఒత్తిడికి గురిచేసిన వారవుతారు.
3. టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్
మీరు చెక్ లిస్ట్ రాసిపెట్టుకుని అందులో కొన్ని ముందు రోజు, మరికొన్ని ఉదయం పూట పూర్తి చేస్తూ పోతారు. కానీ ఇవన్నీ మీ స్కూల్ టైమింగ్‌కు తగినట్టుగా లేకపోతే కష్టం కదా.. అందువల్ల స్కూలుకు 10 నిమిషాలు ముందుగానే చేరుకునేలా రెడీ అయితే మీకు, మీ పిల్లలకు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి ఉండదు. దీనికి కావాల్సిందల్లా మీరు ముందు రోజు రాత్రి 8 - 9 లోపు పిల్లలను పడుకోబెట్టడమే. చిన్న పిల్లలైతే కనీసం 9 గంటలు, ప్రైమరీ దాటిన వారైతే 8 గంటల నిద్ర తప్పనిసరి. అంటే ఉదయం 6 గంటలకు లేవాలంటే 9 కల్లా పడక ఎక్కాల్సిందే. ఇలా జరగలేదంటే మీరు ఫెయిలవుతున్నట్టే. ఈ టైమింగ్స్ కూడా చెక్ లిస్ట్‌లో చేర్చండి మరి.
4. అలవాటు చేసేది మీరే..
పిల్లలకు ఆప్షన్లు ఇవ్వడం, క్రమశిక్షణ లేకుండా చేయడంలో పేరెంట్స్‌దే కీలకపాత్ర. బేబీ నువు ఇడ్లీ తింటావా? దోశ తింటావా? బేబీ నీకు ఇది ఇష్టమా? అదిష్టమా.. ఇలా ఆప్షన్లు ఇస్తూ వెళుతుంటే వారు సమయానికి అల్పాహారం తీసుకోవడం మానేసి ఆప్షన్లు వెతుకుతూ ఉంటారు. అదీ లేదు.. ఇదీ లేదనే పాట అందుకుంటారు. అందువల్ల చిన్నప్పటి నుంచి ఏ ఆహార పదార్థం ఇచ్చినా ఆప్షన్లు ఇవ్వకుండా, అందులో ఉండే పోషకాల గురించి, అవి చేసే మేలు గురించి వివరించండి. అలాగే సెలవు దినాల్లో వారిని బద్దకంగా తయారు చేయకండి. రోజూ లేచే సమయానికే లేపండి. రోజూ పడుకునే సమయానికే పడుకోనివ్వండి. లేదంటే దినచర్య పాటించడంలో విఫలమవుతుంటారు. ముఖ్యంగా రాత్రి 9 లోపు పడక ఎక్కలేదంటే అది కచ్చితంగా తల్లిదండ్రుల వైఫల్యమే అవుతుంది.
5. మీ ప్రవర్తనను బట్టే వారి ప్రవర్తన..
పిల్లలను రెడీ చేయడంలో మీరు ఒక ప్లాన్ లేకుండా ప్రవర్తిస్తే అది వారి జీవితంపై ప్రభావం చూపుతుంది. మీకు ప్లాన్ లేకుండా వారిపై అరవడం, మీరు టెన్షన్ పడడం ఎంతమాత్రం సబబు కాదు. నిన్న చేయాల్సిన పనులన్నీ వదిలేసి ఉదయాన్నే వారిపై అరవడం వల్ల మీకు, వారికి ప్రయోజనం లేకపోవగా, ఒత్తిడిలో వారు అల్పాహారం కూడా తినడం మానేస్తారు. అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే ఇతరులపై అరవడం వల్లే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు భావించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మీ ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులనే వారు అనుసరిస్తారని గుర్తించండి.