తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spice And Salt Tips: కూరలో ఉప్పు, కారాలు ఎక్కువైతే చెఫ్‌లు ఏం చేస్తారో తెలుసా? మీరూ ప్రయత్నించండి!

Spice and Salt Tips: కూరలో ఉప్పు, కారాలు ఎక్కువైతే చెఫ్‌లు ఏం చేస్తారో తెలుసా? మీరూ ప్రయత్నించండి!

17 December 2023, 10:20 IST

  • Spice and Salt Tips: కూరల్లో ఉప్పు, కారం, మసాలా ఎక్కువైతే కొన్ని కిటుకులతో సులభంగా సరిచేసేయొచ్చు. వంటను రుచిగా మార్చేయొచ్చు. దానికోసం చెఫ్స్ పాటించే టిప్స్ చూసేయండి.

ఉప్పు, కారం తగ్గించే టిప్స్
ఉప్పు, కారం తగ్గించే టిప్స్ (pexels)

ఉప్పు, కారం తగ్గించే టిప్స్

మనం రోజూ రకరకాల కూరల్ని వండుకుంటాం. పొరపాటున ఒక్కోసారి ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా అలా అయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. సర్దుకుని అలాగే తినయాల్సిన పనీ లేదు. చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం ద్వారా కూరను సరి చేసుకోవచ్చు. ఉప్పు కారాలను తగ్గించుకోవచ్చు. అందుకు ప్రముఖ వంటవారే కొన్ని చిట్కాలను పాటిస్తుంటారు. అవేంటో మీరూ తెల్సుకోండి..

టమాటా:

గ్రేవీ కూరల్లో ఉప్పు, కారాలు మరీ ఎక్కువ అయ్యాయి అనిపించినప్పుడు ఇలా చేసి చూడండి. టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోయండి. బాణలిలో వేసి ఉడికించండి. అవి మెత్తగా అయిన తర్వాత ఆ గుజ్జును తీసుకెళ్లి కూరలో కలపండి. ఇలా చేయడం వల్ల ఉప్పు బ్యాలెన్స్‌ కావడంతోపాటుగా కూరకు అదనంగా రుచి కూడా వస్తుంది. ప్రయత్నించి చూడండి.

బంగాళ దుంప:

మసాలా కూరలు, గ్రేవీ కూరల్లో ఉప్పు ఎక్కువైంది అనుకుంటే.. బంగాళ దుంపను మెత్తగా ఉడికించి కలిపి చూడండి. సాధారణంగా ఆలూకి ఎక్కవ ఫ్లేవర్‌ ఉండదు. ఎలాంటి ఆహారంతో అయినా సరే చక్కగా కలిసిపోయి రుచిని ఇచ్చే గుణం దీనికి ఉంటుంది. అందుకనే ఇలాంటి సందర్భాల్లో కచ్చితంగా బంగాళ దుంప పని చేస్తుంది. ఉప్పు సరిపోయిందనుకున్న తర్వాత అందుకు తగినట్లుగా కారం, మసాలాను కూడా అవసరం అనుకుంటే కాస్త చేర్చుకోవచ్చు. అలాగే బాగుంది అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. వేపుడు కూరల్లో కూడా దీన్ని ప్రయత్నించ వచ్చు. ఫ్లేవర్‌లో ఎక్కువ మార్పు ఏమీ ఉండదు.

నిమ్మ రసం:

కారం, మసాలాలు ఎక్కువైన సందర్భంలో ఆలుగడ్డను ప్రయత్నిండానికి బదులుగా మరో పని కూడా చేయవచ్చు. అందుకు నిమ్మ రసం సహకరిస్తుంది. మనం బిరియానీల్లాంటివి, చికెన్‌ కూరల్లాంటివీ తిన్నప్పుడు నిమ్మ కాయ రసాన్ని పిండుకుంటూ ఉంటాం. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. దీనిలో ఉండే పులుపు మసాలా ఘాటును ఎక్కువ మనకు తెలియనీయదు. నిమ్మకాయ పులుపు కూరకు నప్పుతుందనుకుంటే ఈ టిప్ పాటించొచ్చు. లేదంటే రైతాను చేర్చుకుని తినే వీలున్న కూరలైతే అలాక్కూడా సర్వ్ చేయవచ్చు.

పాలు :

కూరలో కొద్ది మొత్తంలో మాత్రమే ఉప్పు ఎక్కువ అయ్యింది అనుకున్నప్పుడు పాలు పోయడం, తీపి లేకుండా ఉండే ఫ్రెష్‌ క్రీంని వేయడం లాంటివి చేయవచ్చు. ఇవి వేయడం వల్ల కూరకు అదనపు రుచి కూడా వచ్చి చేరుతుంది. ఇంకా క్యారట్‌, మునక్కాడ లాంటి కొన్ని రకాల కూరగాయ ముక్కల్ని వేసి ఉడికించి కూడా ఉప్పును సరి చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం