Cure Spine Problems: వెన్ను సమస్యల నుంచి విముక్తి పొందండిలా..!
14 November 2023, 17:00 IST
Cure Spine Problems: వెన్ను నొప్పి దీర్ఘకాలంగా వేధిస్తుందా? అయితే కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. వాటివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. అవేంటో తెలుసుకుని పాటించేయండి.
వెన్నెముక తగ్గించే టిప్స్
నడుం నొప్పి సమస్యలు మనలో చాలా మందిని వేధిస్తుంటాయి. కాస్త ఎక్కువ పనులు చేసినా.. ఒత్తిడితో కూడిన పనులు చేసినా వెంటనే నడుం నొప్పులు వచ్చేస్తుంటాయి. ఎక్కువ సేపు అదేపనిగా కూర్చుని ఉండటం, ఊబకాయం, వెన్ను పూసల్లో పగుళ్లు రావడం, ఆర్థరైటిస్ లాంటి ఎన్నో కారణాల వల్ల మనకు ఈ ఇబ్బంది ఉంటుంది. చాలా సార్లు తక్కువ నొప్పి అనిపిస్తుంది. కానీ ఉన్నట్లుండి అది మరీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి సమస్యను పరిష్కరించుకోవడం ఎలా?
విశ్రాంతి తీసుకోండి :
ఎలాంటి మందులూ వాడకుండా కొన్ని రోజుల పాటు విశ్రాంతిగా పడుకుని ఉండటం వల్ల నడుం నొప్పి తగ్గుముఖం పడుతుంది. అలాగని పూర్తిగా వ్యాయామాలు అన్నీ మానేసుకోమని కాదు. వైద్యులు చెప్పిన వ్యాయామలను చక్కగా చేసుకుంటూనే విశ్రాంతిగా ఉండండి. అందువల్ల వెన్నుపై ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర పోయేటప్పుడు చాలా మంది సరైన భంగిమలో నిద్రించరు. వెన్ను నొప్పి సమస్యలతో బాధలు పడేవారు వెల్లకిలా పడుకుంటే మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలి. అలాగే బాగా మెత్తగా లేదా గట్టిగా ఉండే పరుపుల్ని వాడకూడదు. మధ్యస్థంగా ఉండే వాటిని మాత్రమే ఎంచుకోవాలి.
డిస్కుల్ని జాగ్రత్తగా చూసుకోండి :
మన వెన్నెముకలో ఒక్కో ఎముక మధ్య ఒక్కో డిస్క్ ఉంటుంది. వెన్నెముకలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. మెడ, వీపు, నడుము.. ఏదైనా ఒత్తిడి పడినప్పుడు ఈ భాగాల మధ్యన ఉండే డిస్క్‌లపై భారం పడుతుంది. అయితే మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా తర్వాత అది తగ్గిపోతుంది. ఎక్కువ కాలం ఉండదు. అయితే ఎముకల మధ్య రాపిడి ఎక్కువ అయినప్పుడు డిస్కులు అరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎముకలతో పోలిస్తే మృదువుగా ఉంటాయి. దీంతో వెన్ను కదిలిన ప్రతిసారీ ఇవి కొంచెం అరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో ఇబ్బంది మొదలవుతుంది. కాబట్టి డిస్కుల్ని బలోపేతం చేసుకునేందుకు వైద్యుల సూచనతో వ్యాయామాలు చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి.
ఆఫీసుల్లో ఇలా చేయకండి :
కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి పనులు చేసే వారు మెడను ఎక్కువగా వంచుతున్నారా? వెన్నెముకపై ఒత్తిడి కలిగేలా కూర్చుంటున్నారా? లాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. మొబైల్‌ని చూడ్డానికి మెడను ఎక్కువ సేపు వంచి ఉంచుతున్నారేమో కూడా కాస్త దృష్టి పెట్టి ఉండండి. ఇవన్నీ మీ డిస్కు సమస్యల్ని పెంచుతాయి. వెన్ను నొప్పి పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి రోజూ పనుల్లో వీటిపైనా దృష్టి ఉంచండి. సరైన భంగిమలో కూర్చునే ప్రయత్నం చేయండి.