Back Pain with wallets: పర్సు వెనక జేబులో పెడుతున్నారా? నడుం నొప్పికి కారణమేమో..
Back Pain with wallets: పర్సులు వెనక జేబులో, హ్యాండ్ బ్యాగ్ ఒక చేతిలో.. వీటివల్ల నడుం నొప్పి పెరగే ప్రమాదం ఉందట. వాటిని సరైన పద్దతిలో ఎలా పట్టుకోవాలో చూడండి.
ఈ మధ్య కాలంలో నడుం నొప్పి, మెడనొప్పి, ఆర్థరైటిస్ లాంటి వాటితో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. రోజంతా ఆఫీసులో కూర్చుని పనులు చేసే వారిలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోవడం, ఎముకలు బలహీనంగా ఉండటం, పోషకాహార లోపాలు తదితరాల వల్లే సాధారణంగా నడుం నొప్పి వస్తుందని అంతా అనుకుంటారు. అయితే స్త్రీలు మోసే హ్యాండ్ బ్యాగులు, పురుషులు ప్యాంటు వెనుక జేబులో పెట్టుకునే పర్సుల వల్లా నడుం నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాలెట్‌ని వెనక జేబులో పెట్టుకుంటున్నారా?
వెనక జేబులో పెట్టుకునే వ్యాలెట్ కూడా నడుం నొప్పి సమస్యలకు కారణం అవుతుంది. అవునండీ మీరు వింటున్నది నిజమే. వెనక జేబులో పర్సును పెట్టుకుని కూర్చోవడం వల్ల అది మన కూర్చునే భంగిమను దెబ్బతీస్తుంది. దాని వల్ల ఒక సమానంగా కూర్చోవడం కుదరదు. దీంతో శరీర బరువు తుంటి భాగంలో కంటే ఎక్కువ తొడల భాగంలో పడుతుంది. అలాగే పర్సు ఉన్న వైపు కాకుండా రెండో వైపు ఎక్కువగా పడుతుంది. దీని వల్ల వెన్నెముక సరైన ఆకృతిలో ఉండటానికి వీలు కాదు. ఫలితంగా నొప్పి మొదలవుతుంది. అది క్రమ క్రమంగా పెరిగి ఎక్కువ అవుతుంది. దీర్ఘకాలిక నడుం నొప్పిగా మారుతుంది.
హ్యాండ్ బ్యాగుల్ని మోస్తున్నప్పుడు పక్కకు వంగుతున్నారా?
ముఖ్యంగా మహిళలు ఎక్కువగా హ్యాండ్ బ్యాగులను వేసుకుంటారు. కొంత మంది పురుషులు కూడా ల్యాప్ టాప్ బ్యాగుల్లాంటి వాటిని ఒక వైపు భుజానికి తగిలించుకుంటారు. ఇలా తగిలించుకున్నప్పుడు దానికున్న బరువు వల్ల సహజంగానే వారు రెండో వైపుకు కాస్త వంగి నడుస్తారు. మీరూ ఇలా చేస్తున్నారేమో తప్పకుండా ఓ సారి గమనించుకోండి. ఇలా పక్కకు వంగి నడవడం వల్ల నడుం నొప్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇలా చేయడం వల్ల మన వెన్నెముక నిదానంగా లేకుండా పక్కకు ఎక్కువ సేపు వంగి ఉంటుంది. దీంతో నడుముపై ఒత్తిడి పడుతుంది. బరువు అంతా ఒక వైపే వెన్నెముకపై పడుతుంది. రెండు వైపులకూ డిస్ట్రిబ్యూట్ కాదు. అందువల్ల నడుం నొప్పి సమస్యలు తలెత్తుతాయి.
ఏం చేయాలి?
కూర్చున్నప్పుడు బ్యాక్ పాకెట్లలో వ్యాలెట్లను తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెండు భుజాలకూ తగిలించుకునే బ్యాగుల్ని ఎంచుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడూ కూడా శరీర బరువు రెండు వైపులకూ సమానంగా పడుతుంది. నడిచే, కూర్చునే భంగిమల వల్ల నడుం నొప్పులు రాకుండా ఉంటాయి.
టాపిక్