తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: పిల్లల్లో సంభాషణా నైపుణ్యం పెరగాలంటే.. స్కూల్‌ నుంచి వచ్చాక ఈ ప్రశ్నలు వేయండి!

Parenting Tips: పిల్లల్లో సంభాషణా నైపుణ్యం పెరగాలంటే.. స్కూల్‌ నుంచి వచ్చాక ఈ ప్రశ్నలు వేయండి!

HT Telugu Desk HT Telugu

17 December 2023, 13:30 IST

google News
  • Parenting Tips: పిల్లలో మాట్లాడే నైపుణ్యం పెరగడానికి తల్లిదండ్రులు కొన్ని ప్రశ్నలు వేయడం చాలా మేలు చేస్తుంది. వాటివల్ల వాళ్లలో సంభాషణ సామర్థ్యం పెరుగుతుంది. 

పేరెంటింగ్ టిప్స్
పేరెంటింగ్ టిప్స్ (freepik)

పేరెంటింగ్ టిప్స్

చిన్న పిల్లలు మనం ఎలా గైడ్‌ చేస్తూ ఉంటే అలా నడుచుకుంటూ ఉంటారు. మనం వారికి ఎలా దిశా నిర్దేశం చేస్తున్నాం అన్న దాని మీద వారి నైపుణ్యాలు కొంత వరకు ఆధారపడతాయి. అలాగే వారి ఇష్టా ఇష్టాలు తెలుసుకోవాలన్నా, వారిలో సంభాషణా ప్రావీణ్యం పెరగాలన్నా తల్లిదండ్రులు కొన్ని పనులు చేయాలి. పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చాక కొన్ని ప్రశ్నలు వేయడం అలవాటుగా పెట్టుకోవాలి. అవేంటంటే..

నువ్వు ఇవాళ ఎవరి పక్కన కుర్చున్నావు?

పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇలాంటి ప్రశ్నను అడిగి చూడండి. పిల్లలు చాలా ఉత్సాహంగా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. తమ బెస్ట్‌ ఫ్రెండ్స్‌, పక్కన కూర్చున్న వారు, బాక్సులో ఏం తెచ్చుకున్నారు? లాంటి చాలా విషయాలను వారు చెప్పేందుకు ఆసక్తిగా ఉంటారు. అలా వారు చెబుతున్న వాటిని బట్టి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ వారితో సరదాగా కాసేపు సంభాషించండి. ఇలా చేయడం వల్ల పిల్లల కమ్యునికేషన్‌ స్కిల్స్‌ అభివృద్ధి చెందుతాయి.

ఇవాళ స్కూల్లో ఏం నేర్చుకున్నావు?

ఇవాళ కొత్తగా స్కూల్లో నువ్వు ఏం నేర్చుకున్నావు? అని అడగండి. అందుకు పిల్లలు ఒకసారి ఆలోచించి వారు నేర్చుకున్న వాటి గురించి చెప్పడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల దగ్గర కాబట్టి భయం లేకుండా మాట్లాడగలుగుతారు. ఇదే అలవాటుతో వారు తర్వాత బయట కూడా మాట్లాడ గలిగే నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఇలా వారు ఏ సబ్జెక్టుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారో కూడా మనకు అర్థం అవుతుంది. ఫలితంగా వారు వేటి మీద ఆసక్తిని కలిగి ఉన్నారు? భవిష్యత్తులో వీరిని ఎందులో ప్రోత్సహిస్తే బాగుంటుంది? లాంటివి అన్నీ తల్లిదండ్రులకూ అవగతం అవుతాయి.

ఇవాళ స్కూల్‌ బ్రేక్‌లో మీరంతా ఏం చేశారు?

పిల్లలు చదువుల గురించి కాకుండా ఇలాంటి సరదా సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఎక్కువగా ఇష్ట పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నల్ని వేయడం వల్ల వారు చాలా ఉత్సాహంగా స్కూల్‌ బ్రేక్‌లో ఏం జరిగిందో చెప్పేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల వారికి స్టోరీ నెరేటింగ్‌ స్టిల్స్‌, మాట్లాడే నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇలాంటివి అడిగేటప్పుడు తల్లిదండ్రులు కూడా వారితో కలిసిపోయి సరదా సరదాగా మాట్లాడండి. ఇలా ఎందుకు చేశావు? అలా ఎందుకు చేశావు? అని భయ పెడుతున్నట్లుగా ప్రశ్నించకండి. అలా చేయడం వల్ల వారు సరదాగా మాట్లాడలేరు. ఏం చెప్తే మీరు ఏం అంటారో అని ఆలోచించుకుంటూ తడబడుతూ మాట్లాడతారు. కాబట్టి వారికి ఫ్రీగా మాట్లాడే వాతావరణాన్ని కలిగించండి.

తదుపరి వ్యాసం