పసి పిల్లలు సర్వ సాధారణంగా పక్కను తడిపేస్తూ ఉంటారు. అందుకనే తల్లిదండ్రులు వారికి డైపర్లను వేస్తూ ఉంటారు. అయితే ఐదేళ్లు దాటి దగ్గర నుంచి చాలా మంది పిల్లల్లో ఈ అలవాటు క్రమంగా తగ్గిపోతుంది. బాగా ఊహ తెలిసిన వయసు అంటే ఏడేళ్లు తర్వాత ఇక పిల్లలు ఈ అలవాటును పూర్తిగా మానుకుంటారు. అయితే కొంత మంది పిల్లలు మాత్రం ఎనిమిది, తొమ్మిదేళ్లు వచ్చినా సరే ఇంకా పక్కను తడుపుతూనే ఉంటారు. అందులో అంతగా భయపడాల్సిన పనేం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలేంటో? ఈ అలవాటును ఎలా నియంత్రించవచ్చో వివరిస్తున్నారిక్కడ.
ఇలాంటి అలవాటు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు తిట్టడం, భయపెట్టడం లాంటివి చేస్తుంటారు. అలా చేయడానికి బదులుగా సానుకూల వాతావరణంలో వారిని సముదాయించండి. మూత్రం వచ్చినప్పుడు లేచే ప్రయత్నం చేయమని సూచిస్తూ ఉండండి. సాయంత్రం నుంచి ఎక్కువగా మంచి నీటిని తాగించకండి. ఉదయం పూట మూత్రం వెళ్లాల్సి వచ్చినప్పుడు వారికి కాసేపు వేచి ఉండమని చెప్పండి. అందువల్ల వారి మూత్రాశయ నరాలు బలోపేతం అవుతాయి. దీంతో వారికి మూత్రాన్ని ఆపుకునే సామర్థ్యం మెల్లిమెల్లిగా పెరుగుతుంది.