తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Clever Storage Ideas: చిన్నగా ఉన్న ఇంటికి అద్దిరిపోయే 5 స్టోరేజ్‌ ఐడియాలు

Clever Storage Ideas: చిన్నగా ఉన్న ఇంటికి అద్దిరిపోయే 5 స్టోరేజ్‌ ఐడియాలు

12 December 2023, 16:15 IST

google News
  • Clever Storage Ideas: చిన్న ఇళ్లయినా సరే కొన్ని స్టోరేజీ టిప్స్ పాటిస్తే సామాన్లన్నీ చక్కగా సర్దుకోవచ్చు. కొన్ని ట్రెండిగ్, ఉపయోగకరమైన స్టోరేజీ ఐడియాలు చూసేయండి.

స్టోరేజీ ఐడియాలు
స్టోరేజీ ఐడియాలు (freepik)

స్టోరేజీ ఐడియాలు

చిన్న ఇల్లయినా పరవాలేదు.. సొంత ఇల్లు ఉంటే చాలు.. అనుకునే వారు బోలెడు మంది ఉంటారు. అద్దె ఇళ్లలో ఉండే ఇబ్బందుల్ని పడలేక.. ఎంత చోటు ఉన్నా ఫర్వాలేదు ఓ ఇంటిని ఏర్పరుచుకోవాలని చూస్తుంటారు. అయితే ఎక్కువ చోటు ఉండే వారు స్టోరేజ్‌ని ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకో గలుగుతారు. కానీ చిన్న ఇళ్లల్లో అయితే ఎంత ఎక్కువ స్టోరేజ్‌ ఉంటే అంత సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇళ్లను తీర్చి దిద్దుకునే విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇలాంటి వారికి అదిరిపోయే స్టోరేజ్‌ ఐడియాలను ఇంటీరియర్‌ డిజైనర్లు సూచిస్తున్నారు.

చిన్న ఇంటికి స్టోరేజీ ఐడియాలు:

1. కొంత మందికి చిన్న ఇల్లు ఉన్నా పైకి వెళ్లడానికి ఇంట్లోంచే మెట్లు ఉంటాయి. అలా మెట్లు ఉన్నప్పుడు ప్రతి మెట్టుకూ ఒక సొరుగును చేయించుకోవచ్చు. అంటే ఎన్ని మెట్లు ఉంటే అన్ని సొరుగులు వస్తాయి. చిన్న చిన్న సామాన్లు చాలా వాటిల్లో పట్టేస్తాయి.

2. ఇంటి మూలల్లో ఉండే స్థలం సాధారణంగా పెద్దగా ఉపయోగపడదు. అందుకనే అక్కడ కార్నర్‌ ర్యాక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఇళ్లల్లో కిటికీల దగ్గర కొంత చోటు వస్తుంటుంది. అలాంటి చోట్ల రీడింగ్‌ స్పేస్‌ని ఏర్పాటు చేసుకోవడం, సిటింగ్‌ స్పేస్‌ని పెట్టుకోవడం చేయవచ్చు.

3. హాల్‌, డైనింగ్‌ హాల్‌.. లాంటి చోట్ల కుర్చోవడానికి చాలా మంది కుర్చీలను వాడుతుంటారు కదా. అలా అయితే అవి కేవలం కూర్చోడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వాటికి బదులుగా లోపల స్టోరేజ్‌ ఉండే ఓటోమన్‌లు, చెక్క బల్లల్లాంటి వాటికి పైన మంచి కుషన్‌ వేయించండి. కింద స్టోరేజ్‌ ఉండేలా చూసుకోండి. భోజనాల టేబుల్‌ దగ్గరా ఈ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే హాల్లో సోఫాలు వేసుకుంటుంటే గనుక.. కచ్చితంగా లోపల స్టోరేజ్‌ ఉండే వాటిని ఎంచుకోండి. అవి సోఫా కం బెడ్‌లు అయి ఉంటే ఇంకా మంచిది. అటు స్టోరేజ్‌ కోసం, ఇటు కూర్చోవడానికి, పడుకోవడానికీ కూడా వాడేసుకోవచ్చు.

4. చిన్న ఇంటి చోటు ఉన్న వారు షెల్ఫుల్ని ఎక్కువగా కింద నుంచీ పెట్టుకుంటూ వెళితే ఇరుకుగా ఉన్న భావన కలుగుతుంది. అందుకనే మనిషి ఎత్తు కంటే పైన వరుసలో ఇల్లంతా ఎక్కడైనా షెల్ఫుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల కింద ఖాళీగా అనిపిస్తుంది. పైన వస్తువులు పట్టేస్తాయి.

5. గోడలకు తగిలించుకునే పెగ్‌ బోర్డులు దొరుకుతాయి. వాటిలో మన అవసరాలకు తగినట్లుగా రకరకాల ఆర్గనైజర్లను తగిలించుకునే వీలు ఉంటుంది. గరిటెలు, డబ్బాలు, మొక్కలు, నేప్‌కిన్‌లు.. ఇలా వేటినైనా సరే ఈ పెగ్‌ బోర్డులపై ఒద్దికగా సర్దుకోవచ్చు. వీటితో చిందర వందరగా ఉండే చాలా సామాన్లు ఓ కొలిక్కి వచ్చేస్తాయి. నచ్చితే ఈ ఐడియాలను ప్రయత్నించి చూడండి.

తదుపరి వ్యాసం