Living Room Hacks : ఈ టిప్స్ పాటిస్తే.. చిన్న హాల్‌ కూడా పెద్దగా కనిపిస్తుంది-living room hacks to make hall look bigger and spacious ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Living Room Hacks : ఈ టిప్స్ పాటిస్తే.. చిన్న హాల్‌ కూడా పెద్దగా కనిపిస్తుంది

Living Room Hacks : ఈ టిప్స్ పాటిస్తే.. చిన్న హాల్‌ కూడా పెద్దగా కనిపిస్తుంది

HT Telugu Desk HT Telugu
Sep 03, 2023 04:00 PM IST

Living Room Hacks : ఇంట్లో హాల్ చిన్నగా ఉంటే.. కొన్ని చిట్కాలు పాటించి దాన్ని పెద్దగా, విశాలంగా కనిపించేలా చేయొచ్చు. అదెలాగో చూసేయండి.

లీవింగ్ రూం టిప్స్
లీవింగ్ రూం టిప్స్ (pexels)

ప్రతి ఒక్కరూ తమ ఇల్లు అందంగా విశాలంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్ని ఇళ్లల్లో మాత్రం లివింగ్‌ రూం చిన్నగా వస్తుంటుంది. అలాంటప్పుడు డిజైనింగ్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా చిన్న హాల్‌ అయినా పెద్దగా కనిపించేలా చేయొచ్చని ఇంటీరియర్ డిజైనర్లు సలహాలిస్తున్నారు. మన ఇంట్లో ఏఏ మార్పులు చేయడం ద్వారా హాల్‌ని విశాలంగా కనిపించేలా చేయవచ్చో సలహా ఇస్తున్నారు.

రంగుల విషయంలో:

చిన్న హాల్‌ ఉందనుకున్నప్పుడు రంగులు వేయించే విషయంలో జాగ్రత్త పడాలి. అన్ని గోడలకు, పైన సీలింగ్‌కి ఒకటే లైట్‌ కలర్‌ని వేయాలి. ఒక్కో గోడకు ఒక్కో రంగు వాడితే గది మరింత చిన్నగా, విభజించినట్లు కనిపిస్తుంది. ముదురు రంగులు వేయడం వల్ల గదిలో లైటింగ్ తగ్గినట్లు కావడమే కాకుండా చిన్నగా ఉన్న ఫీల్‌ కలుగుతుంది.

ఫ్లూర్ కనిపించేలా:

లివింగ్‌ ఏరియా చిన్నగా ఉన్నప్పుడు ఫ్లోర్‌ని ఎలివేట్‌ చేయడం మంచిది. ఆ గదిలో పెట్టుకునే క్యాబినేట్‌ల లెగ్స్‌ కూడా ఎత్తుగా ఫ్లోర్‌ కనిపించేలా ఉండాలి. కింద పెట్టినట్లుగా ఉండకూడదు.

అద్దాలు:

గదిలోకి ఎవరైనా వచ్చిన వెంటనే ఎక్కువగా, ముందుగా కనిపించే గోడ ఏదైతే ఉందో దానికి కాస్త పెద్ద అద్దాన్ని పెట్టేందుకు ప్రయత్నించండి. అద్దం మిగిలిన గదిని అంతటినీ ప్రతిబింబిస్తూ ఆ స్థలం మరింత పెద్దగా అనిపించేలా చేస్తుంది.

కిటికీలు:

హాల్‌ చిన్నగా వస్తోంది అనుకున్నప్పుడు కిటికీలు పెద్ద సైజులో వచ్చేలా చూసుకోండి. వాటికి కూడా కర్టెన్‌లు వేసి ఎప్పుడూ మూసి ఉంచొద్దు. పెద్ద కిటికీలు ఉండి గాలి, వెలుతురు బాగా వస్తూ ఉంటే గది చిన్నగా ఉన్నట్లు అనిపించదు.

ఫర్నిచర్:

గదిలో ఉన్న స్థలాన్ని బట్టి వేసుకునే సోఫాలు, ఫర్నిచర్‌ లాంటివి ఏ ఆకారంలో ఉండాలో నిర్ణయించుకోండి. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేవి కాకుండా చిన్న సోఫాలకు ప్రాధాన్యత ఇవ్వండి. సోఫాల్లాంటివి మల్టీ ఫంక్షనల్‌గా ఉండేలా చూసుకోవాలి. బెడ్‌ కం సోఫా లాంటివి ప్రయత్నించడం ద్వారా రెండు రకాలుగానూ దాన్ని వాడుకునేందుకు వీలుపడుతుంది. సోఫాతో వచ్చే సెంటర్‌ టేబుల్‌ని గది మధ్యలో కాకుండా పక్కగా వచ్చేలా సర్దుకోవాలి.

  • ఉన్న గోడలకంతా షెల్ఫులు పెట్టేయకుండా కార్నర్‌ షెల్ఫ్‌ల్లాంటి వాటిని అవసరం ఉన్నంత మేరకే పెట్టుకోవాలి.
  • గోడలపైన ఫొటోలు, వాల్‌‌పేపర్లలాంటి వాటిని ఎక్కువగా పెట్టేయకూడదు. అవి గది గోడల్ని కప్పేసి చిన్నగా కనిపించేలా చేస్తాయి. ఏదైనా ఒక వైపు ఉన్న గోడను మాత్రమే రెండు, మూడు ఫోటో ఫ్రేమ్‌లతో ఎలివేట్ చేస్తే మంచి డీసెంట్ లుక్‌ వస్తుంది.

Whats_app_banner