Kitchen organizing: కిచెన్ ఫర్నిచర్‌లో ఇవి ఉండేలా చూసుకోండి.. చాలా స్థలం ఆదా అవుతుంది..-expert approved decor tips to use small kitchen space effectively ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Organizing: కిచెన్ ఫర్నిచర్‌లో ఇవి ఉండేలా చూసుకోండి.. చాలా స్థలం ఆదా అవుతుంది..

Kitchen organizing: కిచెన్ ఫర్నిచర్‌లో ఇవి ఉండేలా చూసుకోండి.. చాలా స్థలం ఆదా అవుతుంది..

HT Telugu Desk HT Telugu
Jul 09, 2023 12:34 PM IST

Kitchen organizing: కిచెన్ చిన్నగా ఉన్నా కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే స్థలం మిగలడంతో పాటూ స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది. అవేంటో చూడండి.

కిచెన్ స్టోరేజీ ఐడియాలు
కిచెన్ స్టోరేజీ ఐడియాలు (Unsplash)

ఉదయం టీ నుంచి మొదలుకొని డిన్నర్ దాకా చాలా సమయం కిచెన్ లోనే గడుపుతాం. కిచెన్‌లో శుభ్రతతో పాటూ దాన్ని కాస్త అందంగా ముస్తాబు చేయడమూ అవసరమే. దానికోసం కిచెన్ లో వస్తువులను కాస్త సృజనాత్మకంగా సర్దాలి. లేదా వాటిని సర్దడానికి కొన్ని ఆర్గనైజర్లు వాడొచ్చు. అలాగే చిన్న స్థలాన్ని కూడా కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే చూడటానికి ఇంపుగా మార్చేయొచ్చు. ఆ కిటుకులేంటో తెలుసుకోండి.

1. పాకెట్ డూర్స్:

చిన్న కిచెన్ ఉంటే పాకెట్ డూర్స్ చాలా మంచి మార్గం. వీటివల్ల స్టోరేజీ పెరుగుతుంది. స్థలమూ మిగులుతుంది. ఇవి గోడ నుంచి బయటకు రాకుండా అందులోనే చేరిపోతాయి. స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. వంట సరుకులు, ఓవెన్ లాంటి వస్తువులు, కాఫీ మెషీన్ లాంటి వాటికి ఈ పాకెట్ డూర్స్ ఎంచుకుంటే చక్కగా గోడలోనే ఇమిడిపోతాయి. అదనపు స్థలం అవసరం లేదు. ఇవి వాడుకలో లేనప్పుడు క్లోజ్ చేసుకుంటే ఎలాంటి గందరగోళం ఉండదు.

2. టర్న్ ఎలిమెంట్స్:

రొటేటింగ్ ఆర్గనైజర్లు చాలా మంచి ఎంపిక. కొన్ని నాలుగు మూలలా స్టోరేజీ కలిగిఉంటే, కొన్ని గుండ్రంగా తిప్పే వీలుతో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. ఒకే చిన్న అమరికలో చాలా వస్తువులు పట్టేస్తాయి. షెల్ఫులో లాగా వెనక వరసలో పెట్టిన వస్తువులకోసం తరచూ వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ రొటేటింగ్ ఆర్గనైజర్లలో ఆ ఇబ్బంది ఉండదు. వీటిని గోడకు కూడా ఫిక్స్ చేసేయొచ్చు. లేదా కిచెన్ స్లాబ్ మీద పెట్టుకోవచ్చు. స్థలం ఆదా చేయడంతో పాటే కిచెన్‌ను అందంగా మార్చేస్తాయివి.

3. ఎక్స్పాండబుల్ టేబుల్:

ఎక్స్పాండబుల్ డైనింగ్ టేబుల్ కిచెన్ చిన్నగా ఉన్నప్పుడు తప్పకుండా ఎంచుకోవాల్సిందే. అవసరానికి తగ్గట్లు దీన్ని పెద్దగా చిన్నగా మార్చుకోవచ్చు. అవసరం లేనప్పుడు గోడకు అతుక్కునేలా పెట్టేయొచ్చు. దీనివల్ల చాలా స్థలం ఆదా అవుతుంది.

4. వర్టికల్ క్యాబినెట్లు:

పుల్ డౌన్ వర్టికల్ క్యాబెనెట్లు చాలా స్థలాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు కనిపిస్తాయి. మనకు అందని ఎత్తులో వస్తువులు పెట్టుకోలేమని ఆ స్థలాన్ని అలాగే వదిలేస్తాం. ఈ పుల్ డౌన్ క్యాబెనెట్ల వల్ల వాటిని పైనుంచి కింది వరకు లాగి అందులో ఉన్న వస్తువులు తీసుకోవచ్చు. మన కళ్లకు అన్ని వస్తువులు కనిపిస్తాయి. ఇలా ఎత్తులో ఉన్న స్థలాల్లో పుల్ డౌన్ క్యాబెనెట్లు వాడటం వల్ల చాలా స్థలం మిగులుతుంది.

5. ఫ్లెక్సిబుల్ షెల్ఫులు:

ఒకే దగ్గర ఫిక్స్‌డ్ గా ఉండే షెల్ఫుల కన్నా అవసరానికి తగ్గట్లు ఎక్కడైనా అమర్చుకునే ఫ్లెక్సిబుల్ షెల్పులు వాడొచ్చు. ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్. కిచెన్ స్తాబ్ కింద, తలుపుల వెనకాల.. ఇలా అవసరమున్న చోట వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కిచెన్ ను అందంగా కనిపించేలా చేసే మంచి మార్గాలు.

Whats_app_banner