తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kangaroo Care: తల్లి స్పర్శతో శిశువు ఆరోగ్యం పెంచే కంగారూ కేర్.. ఈ తప్పులు అస్సలు వద్దు..

Kangaroo care: తల్లి స్పర్శతో శిశువు ఆరోగ్యం పెంచే కంగారూ కేర్.. ఈ తప్పులు అస్సలు వద్దు..

12 July 2024, 12:30 IST

google News
  • Kangaroo care: నెలల వయసున్న పిల్లల ఆరోగ్యం, బరువు మెరుగు పర్చడానికి కంగారూ కేర్ అనుసరిస్తారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెల్సుకోండి. 

కంగారూ కేర్
కంగారూ కేర్ (freepik)

కంగారూ కేర్

నెలలు నిండక ముందే పుట్టే పిల్లల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలా పుట్టిన పిల్లలను ప్రి మెచ్యూర్ బేబీ లేదా ప్రిటర్మ్ బేబీ అంటారు. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఈ సమయంలో తల్లిదండ్రులను పిల్లలను కలిపి ఉంచే కంగారూ కేర్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది పిల్లల ఎదుగుదలలో సాయపడుతుంది. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెల్సుకోండి.

కంగారూ కేర్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. శిశువును తీసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవాలి. శిశువును మీ చాతీపైన ఉంచుకోవాలి. బిడ్డ తలను కాస్త పక్కకు వచ్చేలా చూడాలి. దీంతో వాళ్లకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. ప్రశాతంగా కూర్చోవాలి. ఎంతసేపు కూర్చున్నా ఒకరి చర్మం స్పర్శ మరొకరికి తగలడం మాత్రం చాలా ముఖ్యం. దీనివల్ల ఒకరి హృదయ స్పందన మరొకరికి తెలుస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ మధ్య బంధం పెరుగుతుంది.

2. కంగారూ కేర్ సమయంలో కనీసం 45 నిమిషాల పాటూ ఉండాలి. శిశువును ఎత్తుకునే ముందు మీరు పరిశుభ్రత పాటించాలి. స్నానం చేయాలి. లేదంటే శుభ్రంగా చాతీ దగ్గర తుడుచుకోవాలి. చాతీ మీద ఎలాంటి ర్యాషెస్, గాయాలు లేవని నిర్దారించుకోవాలి. తల్లిదండ్రులకు చర్మ ఇన్ఫెక్షన్లుంటే కంగారూ కేర్ విషయంలో వైద్య సలహా అవసరం.

3. చర్మానికి పర్ఫ్యూమ్, క్రీములు, ఇంకేవైనా రసాయనాలున్న ఉత్పత్తులు వాడకూడదు.

4. తల్లిపాలను పూర్తిగా పంప్ చేశాక శిశువును చాతీపై పడుకోబెట్టుకోవాలి. లేదంటే అసౌకర్యం ఉండొచ్చు.

5. శిశువుకు కేవలం డైపర్ ఉంచాలి. మీమీద కూడా పై భాగంలో ఎలాంటి వస్త్రాలు లేకుండా చూసుకోవాలి. శిశువు శరీరం పూర్తిగా చాతీ దగ్గర మీ చర్మానికి మీకు తగలాలి. హత్తుకోవాలి. ఆ అనుభూతిని పొందాలి.

6. తండ్రి కంగారూ కేర్ చేస్తుంటే చాతీమీద ఏ దుస్తులు ఉండకూడదు. శిశువును చాతీమీద పడుకోబెట్టి మీద బ్లాంకెట్ లాంటిది కప్పేయాలి. తర్వాత చొక్కా బటన్స్ పెట్టేసుకుంటే వెచ్చగా ఉంటుంది.

కంగారూ కేర్ అంటే?

బరువు తక్కువున్న పిల్లలను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచుతారు. తల్లి దండ్రుల స్పర్శకు వాళ్లు దూరమవుతారు. అందుకే ప్రతిరోజూ కాసేపు తల్లిదండ్రులను తాకి ఉండి వాళ్ల స్పర్శను అనుభూతి చెందేలా ఈ కంగారు కేర్ చేస్తారు. తల్లి లేదా తండ్రి చాతీపై శిశువును పడుకోబెడతారు. ఒకరి చర్మం ఒకరికి తగిలేలా, కంగారు తన శిశువును ఎలా మోస్తుందో అలాగన్న మాట. దీనివల్ల ప్రిటర్మ్ బేబీలకు చాలా మేలు.

కంగారూ కేర్ లాభాలు:

కంగారూ కేర్ శిశువు హృదయ స్పందన రేటును, ఉష్ణోగ్రతను, శ్వాస తీరును నియంత్రణలోకి తెస్తుంది. తల్లిదండ్రుల స్పర్శ వల్ల ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఇది శిశువుకు మీకూ మధ్య బంధాన్ని పెంచుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. తల్లి కడుపులో ఉన్న వెచ్చని అనుభూతి ఇస్తుంది. వాళ్ల బరువును పెంచడంలోనూ సాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెంచి తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. తల్లిదండ్రుల చర్మాన్ని తాకి ఉండటమే దీనికి కారణం.

కంగారూ కేర్ వల్ల పిల్లల్లోనే కాక తల్లిదండ్రుల్లోనూ ఆక్సిటోసిన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన తగ్గుతుంది. తల్లుల్లో పిల్లల సంరక్షణ విషయంలో నమ్మకం పెరుగుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం