Preterm baby care: నెలలు నిండకముందే పిల్లలు పుడితే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Preterm baby care: నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల సంరక్షణ విషయంలో చాలా సందేహాలుంటాయి. ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే తప్పకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
నెలలు నిండక ముందే పుట్టడం లేదా 37 వారాలు కన్నా ముందే ప్రసవం జరిగి పుట్టిన పిల్లలను ప్రిటర్మ్, ప్రిమెచ్యూర్ బేబీ అంటారు. 35 వారాల కన్నా ముందే పుట్టిన పిల్లల విషయంలో వైద్య పర్యవేక్షణ అవసరం. అలాంటి పిల్లలను వాళ్ల బరువు, ఎదుగుదల బట్టి ఎన్.ఐ.సి.యూ (నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) లో కొన్ని వారాలు, నెలలు ఉంచుతారు. అక్కడి నుంచి డిశ్చార్జి అయ్యాక ఇంట్లో పిల్లల విషయంలో కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి.
1. కంగారూ కేర్:
కంగారు తన పిల్లలను సంచిలో దాచుకున్నట్లుగా తల్లి, శిశువును తాకేలా ఉంచడమే కంగారూ కేర్. తల్లి స్పర్శతో వెచ్చదనం వస్తుంది. తల్లి చాతీ మీద శిశువును హత్తుకుని పడుకోబెడతారు. దీనివల్ల పిల్లల ఎదుగుదల మీద ప్రభావం ఉంటుంది. అలాగే వాతావరణం ఎప్పుడు వెచ్చగా ఉండేలా బట్టలు వేయాలి.
2. పాలు పట్టడం:
వీళ్లలో పాలు తాగడంలో ఇబ్బంది ఉంటుంది. పూర్తిగా ఎదుగుదల అవ్వకముందే పుట్టడం వల్ల ఆ సమస్య ఉంటుంది. ఆకలి అయినా కూడా ఏడవడమో, ఇంకేదైనా సూచన ఇవ్వడమో చేయలేరు. కాబట్టి తప్పకుండా రెండు మూడు గంటలకోసారి పాలిస్తూ ఉండాలి. చురుగ్గా ఉండటం, మూత్రం పోయడం, బరువు పెరగడం.. ఇవన్నీ సరిపడా పాలు తాగుతున్నారనడానికి గుర్తులు.
3. పరిశుభ్రత:
నెలలు నిండక ముందే పుట్టిన శిశువుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు తొందరగా సోకుతాయి. కొన్ని నెలల దాకా వాళ్లని తాకేముందు, డైపర్ మార్చేటప్పుడు ప్రతిసారి చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి.
4. స్నానం:
వాళ్ల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి రసాయనాలున్న సబ్బులు, షాంపూలు వాడకూడదు. మరీ వేడిగా ఉన్న నీళ్లు వాడకండి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించండి. ఎక్కువ సేపు స్నానం పోయకూడదు. స్నానం తర్వాత రసాయనాలు తక్కువుండే మాయిశ్చరైజర్ రాయాలి. లేదంటే కొబ్బరి నూనె వాడొచ్చు.
5. బయటి వాతావరణం:
పిల్లలు పుట్టగానే చూడ్డానికి ఇరుగూ పొరుగు, చుట్టాలు వస్తుంటారు. ఈ విషయంలో జాగ్రత్త పడండి. వీలైనంత తక్కువ మంది లేదంటే ఎవరూ రాకుండా చూస్కోండి. వాళ్ల నుంచి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని నెలలు బయటికి కూడా ఎక్కువగా తీసుకెళ్లకూడదు.
6. ఇవి గమనించండి:
పాలు తాగకపోవడం, జ్వరం, నీళ్ల విరేచనాలు, ఎక్కువగా వాంతులు అవ్వడం, మూత్రం పోయకపోవడం, చర్మం మీద ర్యాషెస్.. ఇలాంటివి ఏవి అనిపించినా గమనించండి. వెంటనే వైద్యులని సంప్రదించండి.