Fever Home Remedies: ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉంటే.. ఇలా చేసి చూడండి..
Fever Home Remedies: జ్వరంతో బాధపడుతుంటే మందులతో పాటూ కొన్ని ఇంటి చిట్కాలను పాటించి చూడండి. వెంటనే కాస్త ఫలితం ఉంటుంది.
వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే కాలాల్లో సహజంగానే వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తుంటాయి. పిల్లలు వీటికి తేలికగా ప్రభావితం అవుతుంటారు. వికారం, ఒళ్లు నొప్పులు, ముఖం ఉబ్బినట్లు కావడం, చర్మం పొడిబారి వేడిగా ఉండటం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, ముదురు రంగులో మూత్రం, మూత్రం రాకపోవడం, శ్వాస పీల్చడంలో ఇబ్బంది, గుండెల్లో లేదా పొట్టలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులు దాన్ని వైరల్ ఫీవర్‌గా పరిగణిస్తారు. ఈ వైరల్ ఫీవర్లు యాంటీ బయోటిక్స్‌కి త్వరగా రెస్పాండ్ కావు. జ్వరం మందులు వాడుకుంటూ ఉంటే మూడు రోజుల నుంచి వారం రోజుల వ్యవధిలో ఇన్‌ఫెక్షన్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దానిపై ఎంత సమర్థవంతంగా పని చేస్తే అంత తొందరగా ఇన్‌ఫెక్షన్ తగ్గి జ్వరమూ తగ్గుతుంది. వైద్యులు సిఫార్సు చేసిన మందులను వాడుకుంటూనే ఇంట్లో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సమస్య మరింత తొందరగా తగ్గే అవకాశాలుంటాయి. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి.
వైరల్ ఫివర్ కోసం ఇంటి చిట్కాలు:
- ఆయుర్వేదంలో జ్వరాలకు ధనియాలు మంచి మందులా పని చేస్తాయని చెబుతారు. ధనియాలను నీటిలో వేసుకుని మరిగించి ఆ నీటిని తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. నేరుగా ఇలా తాగలేని వారు కాస్త చెరుకు రసం చేర్చుకుని తాగడం లాభం ఉంటుంది.
- వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్న వారు ఎంత వీలైతే అంత ఎక్కువ ద్రవాలను తీసుకోవడం మంచిది. గోరు వెచ్చని నీళ్లు, కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, సూపులు, రకరకాల టీలను విరివిగా తాగుతూ ఉండాలి. చిన్న పిల్లలకు ఎలక్ట్రోలైట్లు ఇవ్వడం మంచిది. ఈ జ్వరాల వేడికి శరీరం డీ హైడ్రేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వ్యాధి కారక క్రిములు శరీరం నుంచి బయటకి వెళ్లిపోవాలన్నా ఈ ద్రవాలు ఉపయోగపడతాయి.
- పాతతరం వారు జ్వరం తగిలితే గంజి కాచుకుని దాన్ని మాత్రమే తాగేవారు. ఈ చిట్కా ఇప్పటికీ చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. గంజి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు నెట్టివేయడంలో ఎంతో సహకరిస్తుంది.
- గిన్నెలో రెండు కప్పులు నీటిని తీసుకోండి. అందులో ఐదు లవంగాలు, ఐదు తులసి ఆకుల్ని వేసి సగానికి మరిగించండి. తర్వాత ఆ నీటిని వడగట్టి గోరు వెచ్చగా తాగండి. తులసిలో యాంటీ బయోటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కవగా ఉంటాయి. ఇవి రెండూ కలిసి లోపలికి వెళ్లినప్పుడు అవి వైరల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి.
- వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు కొంత మందికి శ్వాస సరిగ్గా ఆడదు. దగ్గుతోనూ ఇబ్బంది పడుతుంటారు. అల్లం రసాన్ని తీసి అందులో కొంత తేనె కలుపుకుని తాగడం వల్ల వీరికి ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం, తేనెలు రెండింటిలోనూ వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రయత్నించవచ్చు.
టాపిక్