Tulsi Water : రోజూ తులసి నీళ్లు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు
Tulsi Water : ఆయుర్వేదంలో తులసి మెుక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయుర్వేద మందులలో దీనిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. అయితే తులసి నీటిని రోజూ తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఆయుర్వేదం ప్రకారం తులసి ఆకులు వివిధ వ్యాధులను ఎదుర్కోవడంలో ఉపయోగపడతాయి. తులసి ఆకులే కాదు, గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ, పొట్ట సమస్యలు, ఒత్తిడిని తగ్గించేందుకు తులసి మెుక్క పనికి వస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే తులసిని మూలికల రాణి అంటారు.
తులసి టీ ఆరోగ్యకరమైన పానీయంగా బాగా ప్రాచుర్యం పొందింది. నీటిలో తులసి ఆకులను వేసి కూడా తాగవచ్చు. తులసి నీరు శరీరం, మనస్సు రెండింటికీ మేలు చేస్తుంది. తులసి నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.
తులసిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ స్థాయిలను నియంత్రిస్తాయి. తద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, కణాల డ్యామేజ్‌ను నివారిస్తుంది.
తులసితో శరీరంలోని రోగ నిరోధక శక్తి సమతుల్యంగా ఉంటుంది. తులసి కలిపిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధులను దూరం చేస్తుంది.
తులసిలోని కార్మినేటివ్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గ్యాస్, అసిడిటీ, అపానవాయువును తగ్గిస్తుంది. తులసి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సంబంధ వ్యాధులు దూరంగా ఉంటాయి.
దగ్గు, కఫం, జలుబు, ఉబ్బసం వంటి సమస్యలకు తులసిని ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తులసి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి.
తులసిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది వివిధ నోటి ఇన్ఫెక్షన్లలో బాగా పనిచేస్తుంది. తులసి నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి, నోటి దుర్వాసన తగ్గుతుంది.