Anti Bucket list: మీకూ ఉండాలి ఓ యాంటీ బకెట్ లిస్ట్, మీపై మీకు స్పష్టతనిచ్చే జాబితా ఇది
26 October 2024, 12:30 IST
Anti Bucket list: ఏం పనులు చేయాలనుకుంటున్నారో చెప్పేది బకెట్ లిస్ట్. ఏ పనులు అసలు చేయకూడదు అనుకుంటున్నారో ఈ యాంటీ బకెట్ లిస్టులో ఉంటాయి. దీన్ని ఎలా తయారు చేయాలి? లాభాలేంటో చూడండి.
యాంటీ బకెట్ లిస్ట్
బకెట్ లిస్ట్ అనే పదం వినే ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులు, తీర్చుకోవాలి అనుకుంటున్న కోరికల జాబితానే బకెట్ లిస్ట్ అని చెప్పొచ్చు. కానీ రివర్స్ బకెట్ లిస్ట్ లేదా యాంటీ బకెట్ లిస్ట్ గురించి విన్నారా? అదేంటో, దానివల్ల ఉపయోగమేంటో తెల్సుకోండి.
యాంటీ బకెట్ లిస్ట్ అంటే ఏమిటి?
జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని, చెయ్యాలి అనుకోని కొన్ని పనుల జాబితానే యాంటీ బకెట్ లిస్ట్ అంటారు. ఇలా ఒక లిస్టు తయారు చేసుకోవడం వల్ల మీకు నచ్చని విషయాలేంటో స్పష్టంగా తెలుస్తాయి. మీ తర్వాతి జీవిత కాలంలో అలాంటి తప్పులు మళ్లీ చేయకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడతారు. ఒక అలవాటు మానుకోవడం వల్ల మీ జీవితం మరింత బాగుంటుంది అంటే దాన్ని ఈ లిస్టులో చేర్చండి. ఈ లిస్టులో చేర్చిన పనిని మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే దృఢ నిశ్చయం ఉండాలి. అయితేనే ఈ లిస్టు రాసుకుని ఫలితం ఉంటుంది.
యాంటీ బకెట్ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి?
బకెట్ లిస్ట్‌లో మీ కోరికలు రాసుకున్నట్లే, యాంటీ బకెట్ లిస్టులో మీరు చేయాలి అనుకోని పనుల జాబితా రాసుకోవాలి. ఉదాహరణకు మీరొకసారి బంగీ జంప్ చేస్తున్నప్పుడు మీరు ఊహించలేని, భయపడే ప్రమాదం మీకు జరిగి ఉంటే బంగీ జంప్ చేయడం మీ యాంటీ బకెట్ లిస్టులో చేరొచ్చు. అలాంటి ఉదాహరణలు కొన్ని చూద్దాం.
1. క్రెడిట్ కార్డు అప్పు:
మీరు క్రెడిట్ కార్డు తీసుకుని అనవసరమైన ఖర్చులు చేసి ఇది వరకు ఎప్పుడైనా ఇబ్బంది పాలైతే మీ యాంటీ బకెట్ లిస్టులో క్రెడిట్ కార్డును అతిగా వాడకూడదని రాసుకోవచ్చు.
2. వ్యసనాలు:
అతిగా ఫోన్ వాడటం, అతిగా ఆల్కహాల్ తాగడం, బెట్టింగ్, దూమపానం.. ఇలాంటి అలవాట్లు మీకుండి మానుకోవాలి, మార్చుకోవాలి అనుకుంటే అలాంటివి ఈ యాంటీ బకెట్ లిస్టులో చేర్చుకోండి.
3.విన్యాసాలు:
ఇది వరకు మీరు స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, ఫాస్ట్ డ్రైవింగ్ లాంటి విన్యాసాలు చేసి చాలా ఎక్కువగా భయానికి లోనై ఉండొచ్చు. ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు. వాటికోసం జీవితాన్ని రిస్క్ చేయక్కర్లేదు అనిపిస్తే.. వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోండి. అలాంటివి మీ లిస్టులో రాయండి.
4. గొడవలు:
కొంత మందికి కోపం ఆగదు. దానివల్ల చుట్టూ ఉన్నవాళ్లతో చాలా గొడవలు అవుతూనే ఉంటాయి. స్నేహితులతో, కుటుంబంతో.. అందరితో విభేదాలుంటాయి. అలా ఉండటం కన్నా మీ మిగిలిన జీవితం అంతా అందరితో కలిసిమెలిసి, హాయిగా ఉండాలనుకుంటే గొడవల జోలికి పోనని నిర్ణయం తీసుకోండి. కోపం తగ్గించుకోవాలని నిర్ణయించుకోండి.
5. ఆరోగ్య పరమైన విషయాల్లో:
రోజంతా కేవలం కదలకుండా కూర్చోవడం, పడుకోవడం, బద్దకంగా ఉండటం మాత్రమే మీకు అలవాటయి ఉంటే ఇకమీదట అది మార్చుకోవాలనే నిర్ణయం తీసుకోండి. అలా ఉండకుండా యోగా, వ్యాయామం చేయడం మొదలు పెట్టేయండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయనని మీ యాంటీ బకెట్ లిస్టులో రాసుకోండి.
యాంటీ బకెట్ లిస్ట్ అంటే మీరు ఇది వరకు చేసిన తప్పుల్ని మళ్లీ మళ్లీ చేయకుండా మీకు గుర్తు చేసే జాబితా అనుకోండి. దీంట్లో పెద్ద పెద్ద విషయాలే కాదు.. మీరు ఇక చేయకూడదు అనుకున్న ఏ పనైనా రాసుకోండి. అది ఒక పేపర్లో రాసుకుని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోండి. మీరు తప్పు చేయొద్దనే విషయాన్ని అది మీకు గుర్తు చేస్తుంది.
టాపిక్