తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fasting Blood Sugars: ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉందా? తగ్గించేందుకు 3 టిప్స్

Fasting blood sugars: ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉందా? తగ్గించేందుకు 3 టిప్స్

HT Telugu Desk HT Telugu

27 January 2023, 10:00 IST

    • Fasting blood sugars: ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉందా? అయితే న్యూట్రిషనిస్ట్ చెబుతున్న ఈ 3 టిప్స్‌తో తగ్గించుకోండి.
షుగర్ అదుపులో ఉంచేందుకు 3 మార్గాలు
షుగర్ అదుపులో ఉంచేందుకు 3 మార్గాలు (Unsplash)

షుగర్ అదుపులో ఉంచేందుకు 3 మార్గాలు

డయాబెటిస్ ఉందని నిర్ధారణ అయినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతాం. నిజానికి మీ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలని శరీరం సంకేతం ఇస్తుందని మాత్రమే అర్థం చేసుకుంటే మీకు టెన్షనే ఉండదు. ఎందుకంటే మీరు సరైన రీతిలో జీవన శైలి మార్చుకుంటే డయాబెటిస్ భయం పోవడమే కాకుండా, ఇతర వ్యాధులూ మీ చుట్టుముట్టవు.

డయాబెటిస్ నిర్ధారణకు ఒక సర్వసాధారణ రక్త పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం ఏమీ తినకముందు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ముందు 10 నుంచి 12 గంటలు ఏమీ తినకూడదు. కనీసం 8 గంటలైనా గ్యాప్ ఉంటేనే చేయించుకోవాలి. దీనర్థం ఏంటంటే కనీసం 8 గంటల పాటు ఆహారం తీసుకోని ఒక వ్యక్తి రక్తంలో షుగర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం అన్నమాట.

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మల్ రేంజ్

మీకు ప్రిడయాబెటిస్ ఉందా లేక డయాబెటిస్ స్టేజ్‌కు వచ్చారా? లేదా జెస్టేషనల్ డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? వంటి స్పష్టత కోసం డయాబెటాలజిస్ట్ పరీక్షలు సిఫారసు చేస్తారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ 100 ఎంజీ/డీఎల్ లేదా అంతకంటే తక్కువగా ఉంటే మీకు డయాబెటిస్ లేదని అర్థం. 100 నుంచి 125 మధ్య ఉంటే మీరు ప్రిడయాబెటిస్ (బార్డర్‌లైన్) తో బాధపడుతున్నారని అర్థం. 126 ఎంజీ/డీఎల్ ఉంటే మీకు డయాబెటిస్ నిర్ధారణ అయినట్టు లెక్క.

‘మీ రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చతగ్గులకు చాలా కారకాలు ప్రభావితం చేస్తాయి. కొన్ని మీ చేతుల్లో ఉండవు. ఉదాహరణకు కొన్ని రకలా ఆరోగ్య సమస్యల వల్ల అధిక చక్కెర స్థాయి (హైపర్‌గ్లైసీమియా) ఉంటుంది. జన్యుపరంగా (వంశపారంపర్యంగా) కూడా ఉండొచ్చు. అయితే మీరు తగిన పోషకాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, బరువు అదుపులో ఉంచుకోవడం వంటివి చేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉన్నా, ప్రిడయాబెటిస్ ఉన్నా, లేక బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులు ఉన్నా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకునేందుకు ఏం చేయాలో అన్న విషయం మాత్రమే. అంతకుమించి కంగారు అవసరం లేదు.

సరైన జీవనశైలిని అనుసరించి బ్లడ్‌ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉంచుకున్నట్టయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే డయాబెటిస్ వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. విభిన్న జీవనశైలి మార్పులు మీలో గ్లూకోజ్ స్థాయి తగ్గించుకోవడానికి, నార్మల్ రేంజ్‌కు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయని న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. ఉదయం పూట బ్లడ్ షుగర్ లెవెల్స్ (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్) మేనేజ్ చేసేందుకు 3 టిప్స్ సూచించారు.

Exercise regularly: క్రమం తప్పకుండా వ్యాయామం

చాలా మంది డయాబెటిస్ పేషెంట్లు ఫెయిలయ్యేది ఇక్కడే. డయాబెటిస్ వల్ల కొత్తలో అనారోగ్య లక్షణాలేవీ కనిపించవు. అంతా బాగానే ఉంది కదా అని వారి వ్యసనాలను కొనసాగిస్తారు. వాటిని తక్షణం మానేసి క్రమం తప్పకుండా వ్యాయాం చేయాలి. అలా చేస్తే శరీర కణాలు గ్లూకోజ్‌ను మెరుగ్గా వినియోగించుకోవడానికి వీలవుతుంది.

High protein snacks: ప్రొటీన్ స్నాక్స్ ఎక్కువగా తీసుకోవాలి

ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు లివర్ గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. సాయంకాలం డిన్నర్ తరువాత కార్బొహైడ్రేట్స్‌తో పాటు, ప్రొటీన్ ఉన్న స్నాక్స్ తీసుకుంటే ఉదయం పూట ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.

Manage your stress: ఒత్తిడి తగ్గించుకోండి

స్ట్రెస్ హార్మోన్లయిన కార్టిసాల్, అడ్రినలిన్ ఇన్సులిన్ సక్రమంగా పనిచేసుకోవడంలో అడ్డుపడుతాయి. ఉదయం పూట ఈ హార్మోన్లు ఇంకా ఎక్కవ ప్రభావం చూపుతాయి. అప్పుడు మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి.

తదుపరి వ్యాసం