తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sepsis In Diabetes Patients: డయాబెటిస్ పేషెంట్లకు హెచ్చరిక.. సెప్సిస్ ముప్పుంది జాగ్రత్త

Sepsis in diabetes patients: డయాబెటిస్ పేషెంట్లకు హెచ్చరిక.. సెప్సిస్ ముప్పుంది జాగ్రత్త

HT Telugu Desk HT Telugu

25 January 2023, 16:36 IST

google News
    • Sepsis in diabetes patients: డయాబెటిస్ పేషెంట్లకు సెప్సిస్ ముప్పు పొంచి ఉంది. దీని నుంచి రక్షణకు మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంచుకోక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. సెప్సిస్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డయాబెటిస్ పేషెంట్లకు సెప్సిస్ ముప్పు
డయాబెటిస్ పేషెంట్లకు సెప్సిస్ ముప్పు (Photo by Twitter/Endocrinology21)

డయాబెటిస్ పేషెంట్లకు సెప్సిస్ ముప్పు

సెప్సిస్ అంటే ఒక ఇన్ఫెక్షన్‌కు మానవ శరీరం అనియంత్రిత స్పందన. అది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు ఒక్కొక్క శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. వారి వారి రోగ నిరోధక శక్తి, ఆ శరీరానికి అందుతున్న పోషకాలు, కీలక అవయవాల పనితీరు వంటి అంశాల ఆధారంగా స్పందిస్తుంది. బలమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న శరీరాలు ఇన్ఫెక్షన్లపై వేగంగా స్పందిస్తాయి. ఇన్ఫెక్షన్లపై పోరాటం చేస్తాయి.

హిందూజా హాస్పిటల్, మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లోని క్రిటికల్ కేర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ భరేష్ డేదియా ఈ అంశంపై హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. డయాబెటిస్ పేషెంట్లకు సెప్సిస్ నుంచి అధిక ముప్పు ఉందా? అన్న అంశంపై వివరించారు.

‘డయాబెటిస్ ఉన్న పేషెంట్లు ఇన్ఫెక్షన్ల బారిన పడేందుకు అధిక ముప్పు కలిగి ఉంటారు. ఇది సెప్సిస్‌కు కారణమవ్వొచ్చు. ఇమ్యూనిటీ బలహీనంగా మారడం వల్ల ఇది సాధ్యపడవచ్చు. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, ఇన్ఫెక్షన్లపై దాని స్పందన.. ముఖ్యంగా యూటీఐ, న్యుమోనియా, డయాబెటిక్ ఫుట్ వంటి వాటికి స్పందన అసమానంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ల పరంపర కొనసాగుతుంది. ఒక అవయవం నుంచి మరొక అవయవానికి సోకుతుంది. శరీరం తగిన రీతిలో స్పందించకపోవడం వల్ల సెప్సిస్ వస్తుంది..’ అని వివరించారు.

Risk factors of Sepsis in Diabetes: డయాబెటిస్‌లో సెప్సిస్ ముప్పు కారకాలు

ఇమ్యూనిటీ బలహీనంగా ఉండడమే సెప్సిస్ ముప్పుకు ప్రధాన కారణాల్లో ఒకటని అహ్మదాబాద్‌లోని కేడీ హాస్పిటల్ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ మాన్సి దండ్‌నాయక్ పేర్కొన్నారు.‘టైప్ 1 డయాబెటిస్ పేషెంట్లు, షుగర్ స్థాయి కంట్రోల్‌లో లేని టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు సెప్సిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అవయవాలు దెబ్బతిన్న వారు, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఉన్న వారు కూడా సెప్సిస్ బారిన పడుతారు. కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు ఉన్న డయాబెటిస్ పేషెంట్లు అంతిమంగా సెప్సిస్ బారిన పడే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో లేకపోతే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది..’ అని వివరించారు.

Precautions and treatment for Sepsis: నివారణ చర్యలు, చికిత్స

సెప్సిస్‌కు డాక్టర్ మాన్సి దండ్‌నాయక్ కొన్ని సూచనలు ఇచ్చారు. ‘షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడం, షుగర్ లెవెల్స్ పర్యవేక్షించుకోవడం అత్యవసరం. ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందన మెరుగ్గా ఉండాలంటే షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. ఇమ్యూనిటీ కూడా బలంగా ఉండాలంటే షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. మీ శరీరంలో జీర్ణ క్రియ ఆరోగ్యం బాగోలేనప్పుడు, ఆకలి పెరిగినప్పుడు, మూత్ర విసర్జన తరచూ చేయాల్సి వస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ ఫిజిషియన్‌ను సంప్రదించాలి. డయాబెటిస్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే డయాబెటిస్ నిర్ధారణ అయిన వారు తమలో కనిపించే లక్షణాలను ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా, అంటే ఉదాహరణకు కంటి ఇన్ఫెక్షన్‌, యూటీఐ, చిన్న చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయరాదు..’ అని వివరించారు.

‘తీవ్రత ఆధారంగా వైద్య నిపుణులు ఇన్ఫెక్షన్లకు చికిత్సగా యాంటీమైక్రోబయల్ థెరపీ లేదా యాంటీబయోటిక్స్ ఇస్తారు. విభిన్న రకాలు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి అపరిమితంగా అత్యున్నత స్థాయి యాంటీబయోటిక్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే యాంటీబయోటిక్స్ అధిక వినియోగం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. అందువల్ల పేషెంట్ షుగర్ లెవెల్స్ ఆధారంగా డాక్టర్లు తగిన యాంటీబయోటిక్స్, ఐవీ ఫ్లూయడ్స్ ఇస్తారు. కనిపించే లక్షణాలు, అవస్థను అనుసరించి చికిత్స అందిస్తారు..’ అని వివరించారు.

Sepsis symptoms: సెప్సిస్ లక్షణాలు ఇవే

  1. చలిగా ఉండడం, జ్వరం రావడం
  2. కన్ప్యూజన్
  3. శ్వాస ఆడకపోవడం
  4. బ్లడ్ ప్రెజర్ పడిపోవడం
  5. గుండె వేగంగా కొట్టుకోవడం
  6. చర్మం రంగు మారడం
  7. మానసిక సామర్థ్యంలో మార్పులు
  8. స్పృహ కోల్పోవడం
  9. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం

టాపిక్

తదుపరి వ్యాసం