Kidney Stones : కిడ్నీలో రాళ్లు తగ్గించుకోవాలంటే ఇవి తాగాల్సిందే..
07 July 2022, 10:47 IST
- Kidney Stones : బాబు నాలుగు రాళ్లు వెనకేసుకున్నావా అంటే.. హా వేసుకున్న కిడ్నీలో అని చెప్పే రోజుల్లో ఉన్నాము. కిడ్నీలో రాళ్లు అనేది ఈ కాలంలో చాలా సాధారణ సమస్య అయిపోయింది. అయితే కిడ్నీ స్టోన్స్‌ని శరీరం నుంచి పంపించకపోతే.. సమస్యలు అధికమై.. మొదటికే మోసం వస్తుంది. కాబట్టి వాటిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
కిడ్నీ రాళ్లు ఇలా తగ్గించుకోండి..
Kidney Stones : కిడ్నీరాళ్ల సమస్య అనేది ఈరోజుల్లో సర్వసాధారణం. మూత్రంలోని రసాయనాల నుంచి తయారయ్యే గట్టి వస్తువులనే కిడ్నీలో రాళ్లు అంటాము. కిడ్నీలో రాళ్లు నాలుగు రకాలు ఉంటాయి. అవి కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్, సిస్టీన్. మీ రక్తంలో చాలా వ్యర్థాలు ఉన్నప్పుడు.. మీ శరీరం తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయదు. ఆ వ్యర్థాలు మూత్రపిండాలలో చేరి.. స్ఫటికాలుగా మారుతాయి. ఈ స్ఫటికాలు ఇతర వ్యర్థాలు, రసాయనాలను ఆకర్షించి ఘన వస్తువు (మూత్రపిండాల రాయి)గా మారుతాయి.
అయితే కిడ్నీలో రాళ్ల వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి వైద్యుని కచ్చితంగా సంప్రదించాలి. అంతేకాకుండా కొన్ని పానీయాలు తరచుగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం ద్వారా మూత్రం నుంచి ఆ రాళ్లు తొలిగిపోయే అవకాశముంటుంది.
నీరు
శరీరంలోని ప్రతి అవయవానికి నీరు చాలా అవసరం. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. మూత్రపిండాలు శరీరానికి ఫిల్టరింగ్ మెకానిజమని అందరికీ తెలుసు. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించినట్లయితే.. ఆ వ్యక్తి సాధారణంగా 8 గ్లాసుల కంటే రోజుకు 12 గ్లాసుల నీటిని తాగాలి. తద్వారా మూత్రపిండాలు శరీరంలోని అదనపు వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా తొలగించగలవు.
నిమ్మరసం
మీరు కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతుంటే.. తరచుగా మీ నీటిలో తాజాగా పిండిన నిమ్మకాయ రసాన్ని తీసుకోండి. నిమ్మకాయలో సిట్రేట్ ఉంటుంది. ఇది కాల్షియం రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజు నాలుగు స్పూన్ల నిమ్మరసాన్ని రెండు లీటర్ల నీటిలో కలిపి తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం నెమ్మదిస్తుంది.
దానిమ్మ రసం
మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి దానిమ్మ రసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది అల్సర్లు, విరేచనాలతో సహా పలు వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కాల్షియం ఆక్సలేట్‌ను తగ్గిస్తుంది. పైగా దీనిలో యాంటీఆక్సిడెంట్‌లు సమృద్ధిగా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించే ఎసిడిటీ స్థాయిలను తగ్గించడంలో.. ఇది మీకు సహాయపడుతుంది.
గోధుమ గడ్డి రసం
ఈ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. దీనిని తక్కువ మొత్తంతో తీసుకోవడం ప్రారంభించి.. క్రమంగా 8 ఔన్సుల వరకు తీసుకోవచ్చు. ఇది కిడ్నీలో రాళ్లను బయటకు పంపడానికి, మూత్ర ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ మీ కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కిడ్నీలు ఎక్కువ కాలం పని చేయడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. మూత్రవిసర్జన నుంచి రాళ్లు సులభంగా తొలగించడంలో గ్రీన్ టీ సహాయం చేస్తుంది.
టాపిక్