Kawasaki W175 Launch Date | అపాచే, పల్సర్ బైక్‌లకు పోటీగా సరికొత్త కవాసకి బైక్..
29 August 2022, 18:29 IST
- కవాసకి నుంచి త్వరలో Kawasaki W175 అనే మోటార్ సైకిల్ భారత మార్కెట్లో విడుదలవుతోంది. కవాసకి నుంచి వచ్చే అత్యంత సరసమైన మోటార్‌సైకిల్. దీని విశేషాలు ఇక్కడ చదవండి.
Kawasaki W175
జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ కవాసకి మోటార్స్ సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ బైక్ మోడల్ పేరు ఇంకా బయటకు రాలేదు కానీ Kawasaki W175 పేరుతో ప్రచారం జరుగుతోంది. ఈ బైక్ సెప్టెంబర్ 25న లాంచ్ కాబోతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది కవాసకి నుంచి వస్తున్న ఎంట్రీలెవల్ మోటార్‌సైకిల్. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన Kawasaki Ninja 300 కంటే తక్కువ సామర్థ్యం కలిగినది. Kawasaki W175లో దాదాపు 180సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్ ఉంటుంది. విడుదల తర్వాత ఈ బైక్ భారత రోడ్లపై Apache RTR 180 వంటి బైక్ లతో పోటీ పడుతుంది.
కవాసకి తమ W175 మోటార్‌సైకిల్‌ను భారత రహదారులపై చాలా రోజుల నుంచి పరీక్షిస్తుంది. ఇది రెట్రో స్టైల్ మోటార్‌సైకిల్. దీని డిజైన్ పరిశీలిస్తే రౌండ్ హెడ్‌ల్యాంప్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, విభజనలేని సింగిల్ ప్యాడెడ్ సీటు, వెనకవైపు పాత తరం టెయిల్ లైట్, ఇండికేటర్‌లు ఉన్నాయి. అలాగే ఈ బైక్ సన్నని వైర్-స్పోక్డ్ వీల్స్‌పై నడుస్తుంది.
Kawasaki W175 ఇంజన్ సామర్థ్యం, ధర అంచనాలు
Kawasaki W175లో 177 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. దీనిని 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. ఇది BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంధనం-ఇంజెక్ట్ చేస్తుంది. ఈ ఇంజన్ 13.05 HP శక్తిని అలాగే 13.2 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో సింగిల్ ఛానెల్ ABS ఉంటుంది. ముందు వైపున 220 mm డిస్క్ బ్రేక్, వెనుక 110 mm డ్రమ్ సెటప్‌ను కలిగి ఉంది.
ఈ రెట్రో మోటార్‌సైకిల్ ధర భారత మార్కెట్లో రూ. 1.80 లక్షల లోపు ఉండవచ్చు. KB100 వంటి పాతకాలపు జపనీస్ మోటార్ సైకిల్ వాడాలనుకునే వారికి ఈ బైక్ కచ్చితంగా ఆకర్షిస్తుంది.