తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Karivepaku Karam Podi: కరివేపాకు కారంపొడి, ఒకసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలలు తినొచ్చు

Karivepaku Karam Podi: కరివేపాకు కారంపొడి, ఒకసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలలు తినొచ్చు

Haritha Chappa HT Telugu

30 December 2023, 17:30 IST

google News
    • Karivepaku Karam Podi: కరివేపాకు కారంపొడి అన్నంలోకే కాదు, ఇడ్లీ దోసెలతో కూడా టేస్టీగా ఉంటుంది.
కరివేపాకు కారం పొడి
కరివేపాకు కారం పొడి (manachef/youtube)

కరివేపాకు కారం పొడి

Karivepaku Karam Podi: కరివేపాకుతో చేసే ఏ వంటకాలైనా ఆరోగ్యానికి మంచివే. కరివేపాకు కారంపొడిని ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలల పాటు వాడుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. వేడివేడి అన్నంలోనే కాదు, ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటితో ఇది రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో కరివేపాకు కారంపొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే రుచి సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. కరివేపాకు కారంపొడి రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

కరివేపాకు కారంపొడి కావలసిన పదార్థాలు

కరివేపాకులు - మూడు కప్పులు

ఎండుమిర్చి - 20

చింతపండు - నిమ్మకాయ సైజులో

వెల్లుల్లి రెబ్బలు - ఆరు

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

సెనగపప్పు - రెండు స్పూన్లు

మినప్పప్పు - మూడు స్పూన్లు

ధనియాలు - నాలుగు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

కరివేపాకు కారం పొడి రెసిపీ

1. కరివేపాకులను నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక వస్త్రం పై విడివిడిగా ఆకులను పరిచి నీడలోనే ఆరబెట్టాలి.

2. కరివేపాకులోని చెమ్మ అంతా ఆరిపోయేదాకా ఉండాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. అందులో మినప్పప్పు, శెనగపప్పు వేసి వేయించాలి.

5. తర్వాత ధనియాలు, ఎండుమిర్చిని వేసి వేయించాలి.

6. దింపే ముందు జీలకర్రను, కరివేపాకులను వేయాలి.

7. ఇప్పుడు మిక్సీ జార్లో కరివేపాకుల మిశ్రమాన్ని వేసి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపును కూడా జోడించి మెత్తగా పొడి కొట్టాలి.

8. కరివేపాకు కారంపొడి రెడీ అయినట్టే.

9. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేస్తే 6 నెలల వరకు తాజాగా ఉంటుంది.

10. ఎప్పటికప్పుడు చేసుకోవాలనుకునే వారు నెల రోజులకు ఒకసారి చేసుకుంటే రుచి బాగుంటుంది.

కరివేపాకులు తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను అదుపులో పెట్టే శక్తి కరివేపాకులకు ఉంది. కరివేపాకులు తరచూ తింటూ ఉంటే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపే శక్తి కరివేపాకులకు ఉంది. బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకుతో వండిన ఆహారాలను తరుచూ తింటూ ఉండాలి. గర్భిణీలకు మార్నింగ్ సిక్‌నెస్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అలాగే వికారంగా అనిపిస్తుంది. వారు తెల్లవారుజామునే కరివేపాకు నీటిని తాగడం ద్వారా వాటి నుంచి తప్పించుకోవచ్చు. లేదా కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి వంటివి తినడం ద్వారా మార్నింగ్ సిక్‌నెస్, వికారం నుండి బయటపడవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి బారిన పడుతున్న వారు కరివేపాకులను తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

తదుపరి వ్యాసం