తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Sweet: మైసూర్ పాక్‌లాగే కోకోనట్ పాక్ ఇలా చేసేయండి, ఇది సింపుల్ స్వీట్ రెసిపీ

Coconut Sweet: మైసూర్ పాక్‌లాగే కోకోనట్ పాక్ ఇలా చేసేయండి, ఇది సింపుల్ స్వీట్ రెసిపీ

Haritha Chappa HT Telugu

04 December 2024, 15:30 IST

google News
    • Coconut Sweet: మైసూర్ పాక్ అంటే ఎంతో మందికి ఇష్టం. ప్రతిసారి మైసూర్ పాకే కాదు.. దానిలాగే ఉండే కోకోనట్ పాక్‌ను ప్రయత్నించండి. ఇది సింపుల్ స్వీట్ రెసిపీ.
కొబ్బరి స్వీట్ రెసిపీ
కొబ్బరి స్వీట్ రెసిపీ

కొబ్బరి స్వీట్ రెసిపీ

మైసూర్ పాక్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. వారానికి ఒక్కసారైనా మైసూర్ పాక్ తినేవారు ఎంతోమంది. ప్రతిసారీ మైసూర్ పాకే కాదు కాస్త కొత్తగా ఇంట్లోనే కోకోనట్ పాక్ తయారు చేసి చూడండి. అంటే కొబ్బరితో చేసే మైసూర్ పాక్ లాంటి స్వీట్ ఇది. దీనిలో పంచదార, పాలు, కోవా, కొబ్బరి వంటివన్నీ వేసి చేస్తాము. అలాగే పైన డ్రై ఫ్రూట్స్ తరుగును కూడా చల్లుతాము. కాబట్టి ఇది టేస్టీగా ఉంటుంది. తినాలన్న కోరికను పెంచుతుంది.

కొబ్బరితో మైసూర్ పాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

తాజా కొబ్బరి ముక్కలు - రెండు కప్పులు

పాలు - ముప్పావు కప్పు

పంచదార - ఒక కప్పు

కోవా - పావు కప్పు

కుంకుమ రేకులు - అర స్పూను

వేడి నీళ్లు - ఒక స్పూను

యాలకుల పొడి - అర స్పూను

బాదం తరుగు - గుప్పెడు

పిస్తా తరుగు - గుప్పెడు

కొబ్బరితో మైసూర్ పాక్ స్వీట్ రెసిపీ

1. తాజా కొబ్బరిని ఈ స్వీట్ తయారీ కోసం ఎంచుకోవాలి.

2. ఆ కొబ్బరిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేసి మరిగించాలి.

4. ఆ పాలలోనే పంచదారని కూడా వేసి బాగా కలపాలి.

5. ఇప్పుడు కొబ్బరి తరుగును కూడా వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి.

6. అడుగుకు అతుక్కుపోకుండా తరచూ కలుపుతూ ఉండాలి.

7. ఇప్పుడు ఈ మిశ్రమంలో పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు రేకులను కూడా పాలతో సహా వేసేయాలి.

8. అలాగే కోవాను, యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపాలి.

9. చిన్న మంట మీద పది నిమిషాలు పాటు ఉడికించాలి.

10. ఈ మిశ్రమంలోనే రుబ్బుకున్న కొబ్బరి పేస్టును కూడా వేసి బాగా కలపాలి.

11. ఈ మిశ్రమం అంతా గట్టిగా దగ్గరగా అయ్యేవరకు ఉంచాలి.

12. ఇప్పుడు ఒక ట్రేకు నెయ్యి రాసి దానిపై ఈ వేడి వేడి స్వీట్ మిశ్రమాన్ని పరచాలి.

13. అది కొంచెం చల్లారాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

14. అంతే టేస్టీ కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే. వీటిపై బాదం తరుగు, పిస్తా తరుగును చల్లుకుంటే చూస్తుంటేనే తినేయాలనిపించేలా ఉంటాయి. ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీని ప్రయత్నించి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.

ప్రతిసారి మైసూర్ పాక్ తినే కన్నా ఇలా కొబ్బరితో చేసిన మైసూర్ పాక్ రెసిపీని ప్రయత్నించండి. సాధారణ మైసూర్ పాక్ కన్నా ఈ కొబ్బరి మైసూర్ పాక్ లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎందుకంటే దీనిలో మనం కొబ్బరిని, పాలను, కోవాను ఎక్కువగా వినియోగించాము. ఇందులో ఉండే పోషకాలు కూడా శరీరంలో చేరి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వీలైనంత వరకు ఈ కొబ్బరిపాకును చేసుకొని తినడానికే ప్రయత్నించండి. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది.

తదుపరి వ్యాసం