తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Papaya: ఖాళీపొట్టతో ప్రతిరోజూ ఉదయం బొప్పాయి ముక్కలను తినండి చాలు, చర్మం మెరవడం ఖాయం

Papaya: ఖాళీపొట్టతో ప్రతిరోజూ ఉదయం బొప్పాయి ముక్కలను తినండి చాలు, చర్మం మెరవడం ఖాయం

Haritha Chappa HT Telugu

04 April 2024, 13:58 IST

google News
    • Papaya: బొప్పాయి పండును ఎక్కువమంది తినేందుకు ఇష్టపడరు. కానీ ఇది చేసే మేలు ఎంతో. ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయిని తిని చూడండి. కొన్ని రోజులకే మీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి.
బొప్పాయి
బొప్పాయి (Pixabay)

బొప్పాయి

Papaya: పేదవాడి పండు బొప్పాయి. ఇది తక్కువ రేటుకే లభిస్తుంది. బొప్పాయిని ప్రతిరోజు ఖాళీ పొట్టతో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు ఒక నెల రోజులు పాటు తిని చూడండి. మీలో వచ్చే మార్పులు మీకు ప్రత్యక్షంగా తెలుస్తాయి. ఇది చర్మాన్ని మెరిపించడమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

పరగడుపునే బొప్పాయిని తినడం వల్ల అందులో ఉండే పాపైన్ వంటి ఎంజైమ్‌లు జీర్ణ క్రియకు ఆ రోజంతా సహాయపడతాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు జీర్ణమయ్యేందుకు ఈ ఎంజైమ్‌లు చాలా అవసరం. ఖాళీ పొట్టతో బొప్పాయిని తినడం వల్ల ఈ ఎంజైములు మరింత ప్రభావం వంతంగా పనిచేస్తాయి. ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.

బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలంగా మారుస్తుంది. ఖాళీపొట్టతో బొప్పాయిని తినడం వల్ల ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలతో పోరాడడానికి అవసరమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి మంచి ఆహారం. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. బొప్పాయిని ఖాళీ పొట్టతో తింటే ఆరోజు ఇతర ఆహారాలను తక్కువగా తింటారు. దీని వల్ల క్యాలరీలను కూడా బర్న్ చేయవచ్చు.

చర్మానికి మెరుపు

చర్మాన్ని మెరిపించుకోవాలనుకుంటే ప్రతిరోజూ బొప్పాయిని పరగడుపున తినడం అలవాటు చేసుకోండి. దీనిలో విటమిన్ సి, బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనవంతంగా చేస్తాయి. చర్మం ఛాయ మెరుగుపడడమే కాదు, చర్మ కణాలలో మెరుపు వస్తుంది.

మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ బొప్పాయిని తినడం అలవాటు చేసుకోవాలి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. పేగు కదలికలను కూడా ఉత్తేజ పరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి

భవిష్యత్తులో గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ రోజు నుంచే పరగడుపున బొప్పాయిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. హృదయనాళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

బొప్పాయితో మీ రోజును ప్రారంభించడం వల్ల జీవశక్తి పుష్కలంగా అందుతుంది. విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కె... వంటివన్నీ శరీరానికి అందుతాయి. కాబట్టి మీరు నీరసం లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

బొప్పాయిలో బీటా కెరాటిన్ అధికంగా ఉంటుంది. ఈ బీటా కెరాటిన్ శరీరంలో చేరాక విటమిన్ ఏగా మారుతుంది. విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. బొప్పాయిని ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బొప్పాయిలోని సహజ చక్కెర్లు వెంటనే శక్తిని అందిస్తాయి. బొప్పాయి తిన్న కాసేపటికే మీరు ఉత్సాహవంతంగా చురుగ్గా మారుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం