Juices for Glowing Skin | ఎండలో మాడిన మొఖాలకు కొత్త కాంతులు పంచే జ్యూస్‌లు ఇవి!
11 April 2022, 12:42 IST
- వేసవి కాలంలో ఆరుబయట తిరిగితే మన చర్మం కూడా మాడి మసి బొగ్గు అవుతుంది. కాబట్టి తగిన చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
Juices for healthy and glowing skin: Expert shares tips
మండే ఎండల్లో ఆరుబయట తిరిగితే మన చర్మం కూడా మాడి మసి బొగ్గు అవుతుంది. అదే మొఖంతో తిరిగి మన స్నేహితులెవరినైనా కలిస్తే.. ఎవరు మీరు.. నేను మీకు తెలుసా? అని మిమ్మల్ని విచిత్ర ప్రశ్నలు అడిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగిన చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
వేసవి కాలంలో కఠినమైన ఎండ, వడగాల్పులు, చెమట ఇతరత్రా కారకాలతో మొఖం, చర్మం సహజ మెరుగును కోల్పోతుంది. డీహైడ్రేషన్ కారణంగా నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి అందుకు తగిన పోషణ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక చేసిన జ్యూస్‌లను తాగటం వలన శరీరం నుంచి హానికర టాక్సిన్లు తొలగిపోవడమే కాకుండా వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి, చర్మం కాంతివంతంగా మెరుస్తుందని అంటున్నారు. ఇందుకోసం పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ పలు రకాల జ్యూస్‌లను సూచిస్తున్నారు. అవేంటనేవి కింద ఇచ్చాము, గమనించండి.. ఇంట్లో చేసుకొని ప్రతిరోజూ తాగండి.
పసుపు జ్యూస్
ఐదు అంగుళాలు ఉండే తాజా పచ్చి పసుపును దంచి ఒక గ్లాసు పాలల్లో గాని, నీళ్లల్లో గానీ వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగాలని సూచిస్తున్నారు. ఇది అత్యంత శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్. శరీరానికి మంచి కూలింగ్ ఏజెంట్ లాగా పనివ్చేస్తుంది. మేని ఛాయను ప్రకాశించేలా చేయడంతో పాటు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రక్తంలోని టాక్సిన్లను తొలగించి శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది.
టొమాటో, క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్
వీటితో కూరలు మాత్రమే కాదు రుచికరమైన (తాగుతూపోతే) జ్యూస్‌లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జ్యూస్ కలర్‌ఫుల్‌గా ఉండటమే కాదు, దీనిని తాగడం ద్వారా పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.శరీరానికి సహజమైన హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్ లభిస్తుంది. దీంతో చర్మం సహజమైన మెరుపును పొందుతుంది. అంతేకాదు కాలేయం, రక్తనాళాలు శుభ్రమవుతాయి. గుండె జబ్బులు నివారించవచ్చునని చెబుతున్నారు. టొమాటో, క్యారెట్, బీట్‌రూట్ అన్ని సమపాళ్లలో తీసుకొని కొద్దిగా తాజా అల్లం వేసుకొని మిక్స్ చేసుకొని జ్యూస్ చేయాలి.
ఉసిరి రసం
ఉసిరిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. ఉసిరి రసం తాగితే అందులోని పోషకాలు చర్మాన్ని కాంతివంతం చేయడంలో, టోనింగ్ చేయడం, చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్‌లోని విటమిన్ సి కంటెంట్ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. 2 ఉసిరికాయలను రసం చేసి నీటితో కలుపుకొని రోజూ తాగాలి.
అలోవెరా జ్యూస్
కలబంద మీ మొఖంలో కొత్త కళను తీసుకువస్తుంది. కలబంద జ్యూస్ తాగితే అందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొఖంపై ముడతలను తగ్గించి, చర్మాన్ని శాంతపరుస్తుంది. ఇన్ఫెక్షన్, మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్‌ని రోజూ తీసుకోవడం వల్ల ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.