తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jowar Idli: జొన్నలతో ఇలా ఇడ్లీ చేయండి, కొబ్బరిచట్నీతో తింటే వెరీ టేస్టీ

Jowar Idli: జొన్నలతో ఇలా ఇడ్లీ చేయండి, కొబ్బరిచట్నీతో తింటే వెరీ టేస్టీ

Haritha Chappa HT Telugu

17 March 2024, 6:00 IST

google News
    • Jowar Idli: సాధారణ ఇడ్లీ తిని బోర్ కొడితే, ఒకసారి జొన్నలతో ఇలా ఇడ్లీ చేయండి. ఈ ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
జొన్న ఇడ్లీ రెసిపీ
జొన్న ఇడ్లీ రెసిపీ (Youtube)

జొన్న ఇడ్లీ రెసిపీ

Jowar Idli: కరోనా వచ్చి తగ్గాక ఆరోగ్యకరమైన ఆహారంపై ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను ఆహార మెనూలో భాగం చేసుకుంటున్నారు. జొన్నలతో మెత్తని దూది లాంటి ఇడ్లీలను తయారు చేయొచ్చు. సాధారణ ఇడ్లీలు తిని బోర్ గా అనిపిస్తే ఒకసారి జొన్నలతో ఇడ్లీ చేసుకొని తినండి. ఇవి కూడా మెత్తగా, టేస్టీగా వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి జొన్న ఇడ్లీలు మంచి ఎంపిక. ఇవి రుచిగానూ ఉంటాయి.

జొన్న ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు

జొన్న రవ్వ - మూడు కప్పులు

మినప్పప్పు - ఒక కప్పు

నీరు - సరిపడినన్ని

ఉప్పు - రుచికి సరిపడా

జొన్న ఇడ్లీ రెసిపీ

1. మినప్పప్పును శుభ్రంగా కడిగి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే జొన్న రవ్వను కూడా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి.

2. మినప్పప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

3. ఆ పిండిని జొన్న రవ్వలో వేసి బాగా కలపాలి.

4. జొన్న రవ్వ, మినప పిండిని బాగా కలిపి రాత్రంతా వదిలేయాలి.

5. ఇది పులిసి ఇడ్లీలు చక్కగా వస్తాయి.

6. ఉదయం లేచాక ఈ పిండిలో ఉప్పు కలుపుకోవాలి.

7. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో జొన్న ఇడ్లీలను పెట్టుకోవాలి.

8. పావుగంటలో జొన్న ఇడ్లీలు రెడీ అయిపోతాయి.

9. వీటిని ఏ చట్నీతో తిన్నా టేస్టీగా ఉంటాయి.

10. ముఖ్యంగా టమోటో చట్నీ, కొబ్బరి చట్నీ మంచి రుచిని అందిస్తాయి.

తప్పకుండా తినాల్సిన చిరుధాన్యాలలో జొన్నలు ఒకటి. జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రోజంతా మనుషులు చురుగ్గా ఉంటారు. బలహీనం కాకుండా ఉంటారు. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. జొన్నల్లో ఇనుము, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి, కాపర్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఎముకల ఆరోగ్యానికి అవసరమైనవే.

పిల్లలకు ఎప్పుడూ సాధారణ ఇడ్లీనే పెట్టకుండా ఇలా జొన్నలతో చేసిన ఇడ్లిని కూడా పెట్టడం అలవాటు చేయండి. దీనివల్ల వారు బలంగా తయారవుతారు. జొన్నల్లో ఫైబర్ ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లలు, పెద్దలు కూడా జొన్న ఇడ్లీలను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. దీని వల్ల గుండెకు ఎలాంటి సమస్య రాదు.

జొన్నలతో అనేక రకాల వంటకాలు వండుకోవచ్చు, కానీ చాలామంది జొన్నలను పక్కన పెడతారు. జొన్న రొట్టె, జొన్న చపాతి, జొన్న ఉప్మా ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే.

టాపిక్

తదుపరి వ్యాసం