భారతదేశంలో పూర్వ కాలం నుంచీ జొన్నల్ని రకరకాలుగా వండుకుని తినే అలవాటు ఉంది. జొన్న రొట్టెలు, అంబలి, జొన్న అన్నం, జొన్న అటుకులు, జొన్న పేలాలు.. ఇలా రకరకాలుగా వీటిని తినేవారు. అయితే ఇప్పుడు జంక్ ఫుడ్‌లు, స్ట్రీట్ ఫుడ్‌ల ప్రభావం వల్ల సంప్రదాయ ఆహారాల వాడకం తగ్గిపోతోంది. అందువల్లనే ఇన్ని రోగాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరి ఈ జొన్నల్ని ఆహారంలో తినడం వల్ల మనకొచ్చే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధి ఉన్న వారు మాత్రమే జొన్న రొట్టెల్ని తినేందుకు ప్రయత్నిస్తున్నారు. లేదా బరువు తగ్గాలనుకునే వారు అరుదుగా ఈ ఆప్షన్‌ని ఎంచుకుంటున్నారు. తప్ప సాధారణంగా ఎవరూ జొన్నల్ని తినడం లేదు. జొన్నల్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, సూక్ష్మ పోషకాలు దండిగా ఉన్నాయి. వంద గ్రాముల జొన్నల్లో 72.6 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. 10.4 గ్రాముల ప్రొటీన్, 6.7 గ్రాముల పీచు పదార్థం, 4.1 మిల్లీ గ్రాముల ఐరన్, 13 మిల్లీ గ్రాముల కాల్షియం, 20 మిల్లీ గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇంకా ఇందులో సోడియం, జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్ లాంటి సూక్ష్మ పోషకాలూ లభిస్తాయి.