తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soaking Mangoes: మామిడి పండ్లను నానబెట్టి తినాలా? ఎందుకు? డైటీషియన్ల మాట ఇదీ..

Soaking mangoes: మామిడి పండ్లను నానబెట్టి తినాలా? ఎందుకు? డైటీషియన్ల మాట ఇదీ..

HT Telugu Desk HT Telugu

03 April 2023, 15:25 IST

google News
    • Soaking mangoes: మామిడి పండ్లను నానబెట్టి తినాలా? డైటీషియన్లు అవునని అంటున్నారు. కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి.
మామిడి పండ్లను నానబెట్టి తినాలా?
మామిడి పండ్లను నానబెట్టి తినాలా? (Unsplash)

మామిడి పండ్లను నానబెట్టి తినాలా?

అబ్బా.. ఎండాకాలం వచ్చేసింది.. అని బాధపడే వారే ఎక్కువ. ఎండ దెబ్బలు, అధిక ఉష్ణోగ్రతలు, చెమట, ఇతర అనారోగ్యాల బారిన పడడం సర్వసాధారణం. అందుకే వేసవి అంటే చాలా మంది ఇష్టపడరు. అయితే ఒక్క విషయంలో మాత్రం చాలా సంతోషపడతారు. అదేనండీ.. మామిడి పండ్లు. పండ్లలో రారాజైన మామిడి పండుకు అంత క్రేజ్ ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడన్ని ఉంటాయి.

మామిడి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ

మామిడి పండ్లు పోషకాల గనులు. వీటిలో పోషకాలు, యాంటాక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలం. తక్షణ శక్తినిస్తాయి. అలాగే మలబద్దక సమస్య, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ సీ మీ చర్మానికి, శిరోజాలకు అద్భుతంగా మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెకు మేలు చేస్తాయని పలు అధ్యయనాలు తేల్చాయి.

మామిడి పండ్లను నానబెట్టాలా?

మార్కెట్ నుంచి తేగానే మామిడి పండ్లను చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఇంకొంతమంది వాటిని స్టోర్ చేసే ముందు నానబెడతారు. ఇలా కొన్ని గంటలు నానబెట్టడం వల్ల ఏవైనా ఉపయోగం ఉంటుందా? లేక ఇది ఉత్తి అపోహనేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూడండి.

‘మామిడి పండ్లు కేవలం రుచికరమైనవే కాకుండా బోలెడన్ని పోషకాలతో కూడి ఉంటాయి. విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటాక్సిడెంట్లు రోగ నిరోధకతను పెంచి మంచి ఆరోగ్యాన్నిస్తాయి. అయితే ఈ పండ్లను సరైన రీతిలో తినాలి. తినే ముందు వీటిని నానబెట్టడం ద్వారా పోషకాలు సరిగ్గా లభిస్తాయి. మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. పండ్లను నానబెట్టడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. సాధారణంగా ఫైటిక్ యాసిడ్ పోషక వ్యతిరేకిగా పనిచేస్తుంది. అంటే శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. మామిడి పండ్లను నానబెడితే ఫైటిక్ యాసిడ్‌ను తగ్గించే ఎంజైమ్‌లు యాక్టివ్ అవుతాయి..’ అని డైటీషియన్ ప్రియా పాలన్ వివరించారు.

‘మామిడి పండ్లను తినేముందు నానబెట్టడం పురాతన సంప్రదాయమే. దాని వెనక తగిన కారణాలు ఉన్నందునే మన పూర్వీకులు ఇలా నానబెట్టి తినేవారు. నానబెట్టడం వల్ల పోషకాలు చక్కగా అందుతాయి. అందకుండా చేసే పోషక వ్యతిరేక ప్రభావాలు తగ్గిపోతాయి. ఫైటిక్ యాసిడ్ కారణంగా ఐరన్, కాల్షియం వంటి వాటిని శరీరం శోషించుకోలేదు. 3 నుంచి 4 గంటలు మామిడి పండ్లను నానబెడితే వాటికి ఉన్న పెస్టిసైడ్స్ కూడా తొలగిపోతాయి. మామూలు ట్యాప్ వాటర్‌లో నానబెడితే సరిపోతుంది..’ అని నారాయణ హృదయాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ క్లినికల్ డైటీషియన్ శృతీ భరద్వాజ్ వివరించారు.

మామిడి పండ్లు నానబెడితే కలిగే ప్రయోజనాలు

1.ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది

‘మామిడి పండ్లు నానబెట్టినప్పుడు వాటిలో ఉండే సహజసిద్ధమైన ఫైటిక్ యాసిడ్ తగ్గిపోతుంది. ఈ ఫైటిక్ యాసిడ్ చాలా పండ్లు, కూరగాయలు, నట్స్‌లోనూ ఉంటుంది. కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టినప్పుడు ఫైటిక్ యాసిడ్ తగ్గిపోతుంది. ఫైటిక్ యాసిడ్ వల్ల పోషకాలు అందకుండా పోవడమే కాకుండా శరీరం వేడి చేస్తుంది..’ అని న్యూట్రీషనిస్ట్ సాక్షి లల్వాణీ తెలిపారు.

2. కొవ్వు కరుగుతుంది

మామిడి పండ్లలో చాలా ఫైటో కెమికల్స్ ఉంటాయి. నానబెట్టడం వల్ల వాటి శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా అవి సహజ సిద్ధంగా కొవ్వు కరిగించేవిగా మారుతాయని లల్వాణి చెప్పారు.

3. వ్యాధులు రాకుండా..

‘మామిడి పండ్లను నానబెట్టడం వల్ల వాటిపై ఉన్న పురుగు మందులు, రసాయనాలు తొలగిపోతాయి. అంతేకాకుండా దుమ్మూదూళి, మట్టి తొలగిపోతాయి. ఈ కారణంగా వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. అలాగే మామిడి పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇవి కళ్లకు, శిరోజాలకు, చర్మానికి కూడా మంచిది. ఈ ప్రయోజనాలు అన్నీ రావాలంటే వీటిని నీటిలో నానబెట్టాలి..’ అని లల్వాణి వివరించారు.

4. ఆపాన వాయువును నివారిస్తుంది

‘మామిడి పండ్లను నానబెట్టడం వల్ల ఆపాన వాయువు తగ్గుతుంది. అలాగే థర్మోజెనిక్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. అంటే శరీరంలో వేడి పెరగకుండా కాపాడుతుంది..’ అని పళన్ వివరించారు.

తదుపరి వ్యాసం