Kids Mental Health: ఈ లక్షణాలు కనిపిస్తే మీ పిల్లల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం
23 May 2024, 7:00 IST
- Kids Mental Health: తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. వారి ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవాలి. వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి.
పిల్లల ఆరోగ్యం
పిల్లలు… పెద్దల్లాగా తమ బాధలు, సమస్యలు చక్కగా చెప్పలేరు. తమలో తామే నలిగిపోతూ ఉంటారు. లేదా వారు కమ్యూనికేట్ చేసే విధానం భిన్నంగా ఉండవచ్చు. వారు తమ బాధను చెప్పుకోవడానికి వాడాల్సిన పదాలు తెలియకపోవచ్చు. దీని వల్ల వారి మానసిక ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. పిల్లలు తరచూ చిరాకు పడడం, తమక నచ్చిన పనులు కూడా చేయకపోవడం, ఏకాగ్రత సమస్యలు, కడుపు నొప్పి అని చెప్పడం, తలనొప్పి వంటి సమస్యల బారిన వారు పడుతూ ఉంటే పెద్దవారు పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
తల్లిదండ్రులు తమ పిల్లల మనసులతో కనెక్ట్ అవ్వాలి. మానసిక ఆరోగ్య సమస్యల లక్షణాలను "అల్లరి" అని తోసిపుచ్చకూడదు. పిల్లలతో మాట్లాడటానికి సమయం కేటాయించాలి. ఏ సమయంలోనైనా వారి భావోద్వేగాలు, భావాలను బహిరంగంగా వ్యక్తీకరించే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి.
మానసిక ఆరోగ్యం చాలా కీలకమైనది. అయితే పిల్లలలో మానసిక ఆరోగ్య సమస్యల సంకేతాలు స్పష్టంగా ఒక్కోసారి కనిపిస్తాయి. వాటిని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పిల్లల్లో మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కనిపించే లక్షణాలపై వారు అవగాహన పెంచుకోవాలి.
ఇవే లక్షణాలు
1. ప్రవర్తనలో మార్పులు: పిల్లల్లో చిరాకు పెరగడం, సామాజికంగా నలుగురిలో కలవకపోవడం వంటివి మీ పిల్లల ప్రవర్తనలో ఆకస్మికంగా కనిపిస్తే వెంటనే మానసిక వైద్యులు వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులు అంతర్లీన భావోద్వేగ క్షోభ లేదా మానసిక ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి. వారి భావాలు, అనుభవాలను అర్థం చేసుకోవడానికి మీ పిల్లలతో స్వేచ్ఛగా, స్నేహితుడిలా మాట్లాడడం చాలా అవసరం. తమ అనుభవాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వారిని ప్రోత్సహించండి.
2. ఏకాగ్రతలో ఇబ్బంది: మీ పిల్లవాడు ఇంతకు ముందు బాగా చేసిన పనులు కూడా ఇప్పుడు చేయలేకపోవడం, ఏకాగ్రత చూపించడానికి కష్టపడడం వంటివి చేస్తే అతని మనసుకు దెబ్బతగిలిందని అర్థం చేసుకోవాలి. ఏకాగ్రత లోపించడం అనేది మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. దీనిని పరిష్కరించడానికి, మీరు మీ బిడ్డకు చాలా సహకరించాలి. ఒత్తిడిని తగ్గించాలి.
3. నిద్ర విధానాలలో మార్పులు: నిద్రపోవడంలో ఇబ్బంది, తరచుగా పీడకలలు రావడం, అధిక నిద్ర వంటివి అకస్మాత్తుగా మీ పిల్లల్లో కలిగితే ఆ మార్పులపై శ్రద్ధ వహించండి. నిద్ర పట్టకపోవడం లేదా అతిగా పట్టడం అనేవి వారిలోని అంతర్లీన భావోద్వేగ కల్లోలాన్ని సూచిస్తుంది. వారికి స్థిరమైన నిద్రా దినచర్యను ఏర్పాటు చేయండి. మీ పిల్లల కోసం ప్రశాంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించండి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి.
4. శారీరక లక్షణాలు: తలనొప్పి, కడుపు నొప్పి, అలసట వంటి శారీరక లక్షణాలు కనిపిస్తే వెంటనే వారితో మాట్లాడండి. ఈ లక్షణాలు వారిలోని అంతర్లీన మానసిక ఆరోగ్య సమస్యల సంకేతాలుగా భావించవచ్చు. అదే సమయంలో, మీ పిల్లల అనుభవాలు, భావోద్వేగాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
5. చదువులో మార్పులు: చదవడానికి ఇష్టపడకపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటివి కూడా మంచి లక్షణాలు కాదు. అంతర్లీన ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్ వంటివి కూడా వారిలో మానసిక ఆరోగ్యానికి సంకేతం కావచ్చు. ఈ మార్పులు మీ పిల్లల్లో కనిపిస్తే వారి ఉపాధ్యాయులతో మాట్లాడడం మంచిది.
టాపిక్