Lemon Upma Recipe । నిమ్మకాయ ఉప్మా.. కమ్మగా ఉంటుంది, తిని చూడండి!
01 December 2022, 7:15 IST
- ఉప్మా మీరు చాలా సార్లు తినే ఉంటారు, ఇది చాలా తేలికైనది. మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఈ ఉప్మాకి కొంత నిమ్మకాయతో ట్విస్ట్ ఇస్తే దీని రుచి మరోలా ఊంటుంది. Lemon Upma Recipe ఇక్కడ ఉంది చూడండి.
Lemon Upma Recipe
ఉదయం వేళలో అల్పాహారం రోజులో చేసే అతి ముఖ్యమైన భోజనం అని అంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉండకూడదు. రాత్రంతా తినకుండా ఉంటాం కాబట్టి, మళ్లీ మధ్యాహ్నం లంచ్ వరకు శరీరాన్ని ఎండబెట్టకూడదు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కానీ చాలా సందర్భాల్లో ఉదయం వేళ టిఫిన్ చేయకుండానే వెళ్లిపోతాం. ఎందుకంటే ఉదయం వేళ సమయం త్వరగా అయిపోతున్నట్లు అనిపిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడానికి సమయం ఉండదు. కానీ తక్కువ సమయంలోనే సులభంగా చేసుకునే అల్పాహారాలు మనకు చాలా ఉన్నాయి. అందులో ఉప్మా ఒకటి.
సాధారణంగా మనమంతా రుచికరమైన భోజనానికి తాపత్రయపడతాం. అయితే ఉప్మా ఎప్పుడూ చేసుకునేదే కదా అని దీనిపై ఆసక్తి చూపరు. అయినప్పటికీ ఉప్మాను రుచికరంగా చేసే రెసిపీలు చాలా ఉన్నాయి. మీరు ఇప్పాటివరకు టొమాటో ఉప్మా, వెజిటెబుల్ ఉప్మా తిని ఉండవచ్చు. కానీ ఎప్పుడైనా లెమన్ ఉప్మా రుచిచూశారా? మీకోసం ఇప్పుడు ఇక్కడ ఆ లెమన్ ఉప్మా రెసిపీని అందిస్తున్నాం. ఇలా ఒకసారి చేసుకొని తినండి, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
Lemon Upma Recipe కోసం కావలసినవి
- రవ్వ - 1 కప్పు
- ఉల్లిపాయ - 1
- టమోటో - 1
- నిమ్మకాయ - 1/2
- అల్లం తురుము- 1/2 tsp
- క్యారెట్ తురుము - 3 టేబుల్ స్పూన్లు
- పచ్చి బఠానీలు - 2 టేబుల్ స్పూన్లు
- తరిగిన క్యాప్సికమ్ - 3 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి - 2
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు ఒక రెమ్మ
- కొత్తిమీర
- శనగ పప్పు - 1 tsp
- మినపపప్పు - 1 tsp
- జీడిపప్పు- 7
- ఇంగువ - 1 చిటికెడు
- ఉప్పు - రుచికి తగినట్లుగా
లెమన్ ఉప్మా రెసిపీ - తయారీ విధానం
- ముందుగా పాన్‌లో నెయ్యి వేడి చేసి, అందులో రవ్వను వేయించి మంచి వాసన వచ్చిన తర్వాత ఒక గిన్నెలో పక్కకు తీసిపెట్టుకోండి.
- ఇప్పుడు ఖాళీ పాన్‌లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు వేయించాలి, అవి చిట్లడం ప్రారంభమయ్యాక పప్పులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- పప్పులు లేత గోధుమరంగు రంగులోకి వచ్చే వరకు వేయించిన తర్వాత, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి కలపాలి. ఉల్లిపాయ లేత రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
- అపై తరిగిన క్యారెట్లు, బఠానీలు, క్యాప్సికమ్, టొమాటోలు వేసి నూనెలో 2-3 నిమిషాలు ఉడికించాలి. అనంతరం పాన్‌లో ఒకటిన్నర కప్పుల నీరు వేసి మరిగించాలి.
- నీరు ఉడకబెట్టడం ప్రారంభించినప్పుడు, వేయించిన రవ్వ వేయాలి, ఆపై నిమ్మకాయ రసంను పిండాలి. ఇప్పుడు ఈ రవ్వను 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించాలి, కలుపుతూ ఉండాలి.
- ఆ తరువాత, పాన్ మూతపెట్టి, తక్కువ వేడి మీద 2-3 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేస్తే నిమ్మకాయ ఉప్మా రెడీ.
లెమన్ ఉప్మాపై కొన్ని కొత్తిమీర ఆకులు గార్నిష్ చేసుకొని తింటుంటే, నా సామిరంగా అంటారు.