చలికాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడారంటే ఎక్కువ కాలం గ్యాస్ వస్తుంది, చిట్కాలు తెలుసుకోండి
18 December 2024, 16:30 IST
శీతాకాలంలో ఆహారం, పాలు లేదా నీటిని తరచుగా వేడి చేయాల్సి ఉంటుంది, దీని వల్ల గ్యాస్ వినియోగం చాలా పెరుగుతుంది. అయితే, కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా, మీరు మీ గ్యాస్ సిలిండర్ను మరింత ఎక్కువసేపు నడపవచ్చు.
గ్యాస్ ఎక్కువకాలం వచ్చేందుకు చిట్కాలు
చలికాలంలో ఆహారాలు, పానీయాలన్నీ వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. టీ నుంచి అన్నం వరకు అన్నింటినీ వరుసగా వండుతూనే ఉంటారు. అలాగే తాగేందుకు వేడినీళ్లు కూడా పెట్టుకుంటారు. కొంతమంది స్నానానికి నీళ్లు కూడా గ్యాస్ స్టవ్ మీదే వేడి చేస్తూ ఉంటారు. ఇలా చాలాసార్లు ఇంటి పనుల కోసం గ్యాస్ ను వినియోగిస్తూనే ఉంటాము. అందుకే చలికాలంలో త్వరగా గ్యాస్ అయిపోతుంది. అందుకే చలికాలంలో గ్యాస్ ఆదా చేయడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలను మీరు తెలుసుకోవాలి.
ప్రెషర్ కుక్కర్ పై
ఇప్పుడు ప్రతి ఇంట్లోను ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. పప్పులు, అన్నం వండాలన్నా, బంగాళాదుంపలు ఉడకబెట్టాలన్నా చాలా మంది ఈ పనులన్నింటికీ ప్రెషర్ కుక్కర్లను ఉపయోగిస్తుంటారు. ఇందులో వంట చేయడం చాలా సులభం, అలాగే తక్కువ సమయం పడుతుంది. మీరు శీతాకాలంలో గ్యాస్ ఆదా చేయాలనుకుంటే, ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగించి ఎక్కువ వంటలు వండేందుకు ప్రయత్నించండి.
పలుచటి గిన్నెల్లో
వంటకు ఉపయోగించే గిన్నెలు మరీ మందంగా లేకుండా చూసుకోండి. అడుగు భాగం మందంగా ఉంటే అది వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చువుతుంది. ముఖ్యంగా చలికాలంలో గాలిలో తేమ ఉన్నప్పుడు ఏ పాత్ర అయినా ఎక్కువ సేపు వేడెక్కడం వల్ల గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మీరు శీతాకాలంలో గ్యాస్‌ను ఆదా చేయాలనుకుంటే, వంట కోసం ఎల్లప్పుడూ పలుచటి అడుగున్న పాత్రలను ఉపయోగించడం ఉత్తమం.
మీరు వంట చేసేటప్పుడు గ్యాస్ వాడకాన్ని తగ్గించాలనుకుంటే, వంట చేస్తున్నప్పుడు పైన మూతపెట్టి ఉడికించండి. మూత పెట్టకుండా ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. మూత పెడితే త్వరగా ఉడికేస్తుంది.
గ్యాస్ ఆదా చేయడం కోసం ఎప్పటికప్పుడు బర్నర్ కట్టి ఉన్నాయో లేవో, పైపుల లీకేజీలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. పైపు నుండి తేలికపాటి వాయువు లీక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే పైపు లీకేజీని ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. స్టవ్ బర్నర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. బర్నర్ మురికిగా ఉన్నప్పుడు, గ్యాస్ సరిగ్గా బయటకు రాదు, దీని వల్ల దాని మంట తగ్గుతుంది. ఈ కారణంగా, ఆహారాన్ని వండడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్ కూడా వేగంగా ఖర్చు అవుతుంది. కాబట్టి బర్నర్ నుంచి ఎరుపు లేదా పసుపు రంగు మంట బయటకు వచ్చిన వెంటనే శుభ్రం చేసుకోవాలి.
గ్యాస్ వాడిన తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయడం మర్చిపోవడం వంటివి ఎంతో మంది చేస్తారు. ఈ అలవాటును మార్చుకోండి. రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోతే మీకు తెలియకుండానే గ్యాస్ తక్కువ పరిమాణంలో లీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.