తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Take Loan Against Gold And Conditions

Gold Loan | గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి? ఏవైనా కండిషన్స్ ఉంటాయా?

29 January 2022, 18:02 IST

    • Gold Loan | గోల్డ్ లోన్ : అత్యవసర సమయాల్లో, భారీ అవసరాలు ఉన్న సందర్భాల్లో సులువుగా రుణం పొందే మార్గం గోల్డ్ లోన్. మన వద్ద ఉన్న నగలు, గోల్డ్ కాయిన్స్ ష్యూరిటీగా పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. గోల్డ్ లోన్ తీసుకోవడంలో ఉండే ప్రక్రియ, అవసరమైన పత్రాలు, వడ్డీ రేట్లు వంటి వివరాలు చూద్దామా?
అత్యవసర సమయాల్లో గోల్డ్ లోన్ పొందడం సులభం
అత్యవసర సమయాల్లో గోల్డ్ లోన్ పొందడం సులభం (unsplash)

అత్యవసర సమయాల్లో గోల్డ్ లోన్ పొందడం సులభం

గోల్డ్ లోన్ తీసుకునే ప్రక్రియ గోల్డ్ లోన్ అప్లికేషన్ సమర్పణతో మొదలవుతుంది. ఇది ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే బ్యాంకు, ఆర్థిక సంస్థను బట్టి ఆన్‌లైన్ సౌకర్యం ఉంటే ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆఫ్‌లైన్ అయితే సమీప బ్యాంకును సంప్రదించాలి.  తదుపరి మీరు మీ వద్ద ఉన్న నగలు లేదా బాంగారు కాయిన్స్ లేదా గోల్డ్ బార్ తీసుకుని సదరు బ్యాంకు లేదా రుణ సంస్థ కార్యాలయానికి వెళ్లాలి. ఆయా నగలు సమర్పించగానే సదరు సంస్థ వద్ద ఉండే గోల్డ్ అప్రయిజర్ వాటి నాణ్యతను పరిశీలిస్తారు. తదుపరి ఆ బంగారం విలువ లెక్కకడతారు. మొత్తం విలువలో 80 శాతం వరకు లోన్ ఇస్తారు. ఆ బంగారాన్ని వారు ష్యూరిటీగా పెట్టుకుంటారు. 

ఏయే పత్రాలు కావాలి?

మీ వద్ద ఉన్న నగలును ష్యూరిటీగా పెడుతున్నందున ఈ గోల్డ్ లోన్‌కు పెద్దగా డాక్యుమెంట్స్ అవసరం లేదు. ముఖ్యంగా మీ గుర్తింపు కార్డు, మీ చిరునామా ధ్రువీకరణ, ఇటీవల దిగిన ఫోటోలు, మీ బంగారం విలువకు సంబంధించి బ్యాంకు ఇచ్చిన ధ్రువీకరణ లేదా రశీదు పత్రాలను లోన్ మంజూరు చేసే ముందు సమర్పించాలి. ఆయా పత్రాల తనిఖీ పూర్తయిన వెంటనే కొద్ది గంటల వ్యవధిలో మీ బ్యాంకు ఖాతాలో రుణ మొత్తం జమ అవుతుంది.

ఏ నగలకైనా గోల్డ్ లోన్ ఇస్తారా?

మీ వద్ద ఉన్న 18 కేరట్ల బంగారు నగలు, 22 కేరట్ల బంగారు నగలపై రుణ సంస్థలు రుణాలు ఇస్తాయి. అలాగే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో తీసుకున్న గోల్డ్ కాయిన్స్‌పైన కూడా రుణాలు ఇస్తాయి. ఇవి సాధారణంగా 24 కేరట్ గోల్డ్ అయి ఉంటుంది. అలాగే 22 కేరట్ గోల్డ్ బిస్కెట్స్‌పై కూడా లోన్ మంజూరు చేస్తారు. అలాగే డిజిటల్ గోల్డ్‌పై కూడా గోల్డ్ లోన్ పొందవచ్చు. డిజిటల్ గోల్డ్ అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌బీజీ), ఈటీఎఫ్‌ వంటి డిజిటల్ అసెట్స్‌పై కూడా గోల్డ్ లోన్ మంజూరు చేస్తారు.

గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?

సాధారణంగా షెడ్యూలు బ్యాంకులు, ప్రయివేటు బ్యాంకుల్లో గోల్డ్ లోన్‌పై వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7.75 శాతం నుంచి 8.50 శాతం మధ్య ఉంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.90 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంది. ప్రయివేటు గోల్డ్ ఫైనాన్స్ సంస్థల వద్ద 14 శాతం నుంచి 25 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.

టాపిక్