Vidya Lakshmi | విద్యాలక్ష్మి.. ఉన్నత విద్య కోసం ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషన్ లోన్
24 January 2022, 17:27 IST
- vidya lakshmi portal: విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యా రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉన్నత విద్య కోసం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యా రుణాలు (ప్రతీకాత్మక చిత్రం)
ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే అప్లికేషన్ విభిన్న బ్యాంకులకు చేరుతుంది. మీ అప్లికేషన్ అప్రూవ్ అయితే ఆన్‌లైన్‌లోనే తెలిసిపోతుంది.
ఏమిటీ విద్యాలక్ష్మి పోర్టల్?
2015–16 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాన మంత్రి విద్యా లక్ష్మి కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనిలో భాగంగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యా రుణాలు, విద్యాసారథి పోర్టల్ ద్వారా స్కాలర్‌షిప్పుల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యాలక్ష్మి పోర్టల్‌ను ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌ఎస్‌డీఎల్ ఈ–గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా ఉన్నత విద్య కోసం రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్‌ను ట్రాక్ చేయొచ్చు.
విద్యాలక్ష్మి రుణాల కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
విద్యాలక్ష్మి పోర్టల్‌లో ముందుగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత లాగిన్ అవ్వాలి. ఇప్పుడు కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్(సీఈఎల్‌ఈఎఫ్) నింపాలి. ఈ ఫామ్ నింపాక మీకు తగిన విద్యా రుణాన్ని వెతికి దానికి దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంకులు దాదాపుగా 130 రకాల విద్యా రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. వాటి నుంచి మీకు తగిన స్కీమ్‌ను ఎంచుకోవచ్చు.
పోర్టల్‌లో 39 బ్యాంకులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే దరఖాస్తుదారుడు గరిష్టంగా మూడు బ్యాంకుల వరకు అప్లై చేసుకోవచ్చు.
గరిష్టంగా 15 రోజుల్లోనే మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. బ్యాంక్ అప్రూవ్ చేస్తే మీకు ఆన్‌లైన్‌లోనే స్టేటస్ తెలుస్తుంది.
ఒకవేళ బ్యాంకుకు మరింత సమాచారం అవసరమైతే మీ అప్లికేషన్ ఫామ్‌ను హోల్డ్ స్టేటస్‌లో చూపిస్తుంది. అక్కడ రిమార్క్స్ కాలమ్‌లో సంబంధిత విషయాన్ని తెలియపరుస్తుంది.
ప్రస్తుతం విదేశీ విద్య అభ్యసించే వారి సంఖ్య పెరిగిపోతున్నందున విద్యా రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వెంటనే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఆయా రుణాలు తీసుకునేందుకు తల్లిదండ్రులు కూడా ధైర్యం చేస్తున్నారు.
పైగా విదేశీ విద్యతో అక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తుండడంతో ఏటేటా విదేశీ విద్యపై మోజు పెరుగుతోంది.