Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ అంశాలు తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి
24 January 2022, 21:27 IST
- నిధులు సమకూర్చుకోవడం కోసం అర్హతగల వారెవరైనా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. ఇందుకోసం రుణాలు ఇచ్చే సంస్థలు సదరు వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్, వయస్సు, ఉద్యోగ చరిత్ర లాంటి ప్రమాణాల ఆధారంగా రుణగ్రహీతల ప్రొఫైల్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అందుకు తగినట్లుగా రుణాన్ని మంజూరు చేస్తాయి.
Personal Loan (Representational Image)
ప్రజలు ఎన్నో కలలు కంటారు. ఒకరికి సొంత ఇల్లు కట్టుకోవాలనే కల, ఇంకొకరు తమ కూతురు పెళ్లి వైభవంగా చేయాలనే కల, పిల్లల్ని ఉన్నత విద్యకోసం విదేశాలకు పంపాలనే కల, లేదా ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలనే కల ఇలా ఒక్కేటిమిటి ఎన్నో కోరికలు వారి మదిలో ఉంటాయి. కానీ తమ స్వప్నాల్ని సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురవ్వవచ్చు. ముఖ్యంగా ఆర్థికపరమైన అటంకాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. చాలా వరకు ప్రజలు కనే కలలకు పెద్దమొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది, కొన్నిసార్లు సొమ్ము కోసం అత్యవసర పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఇలాంటి సమయాల్లో మనల్ని ఆదుకునే ఒక సులభమైన ఆప్షన్ బ్యాంక్ లోన్. బ్యాంక్ మన తక్షణ ఆర్థిక అవసరాలను పర్సనల్ లోన్ రూపంలో పరిష్కరిస్తుంది.
ఎవ్వరైనా రుణం పొందవచ్చు..
అనేకానేక కారణాల వల్ల నిధులు సమకూర్చుకోవడం కోసం అర్హతగల వారెవరైనా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. ఇందుకోసం రుణాలు ఇచ్చే సంస్థలు సదరు వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్, వయస్సు, ఉద్యోగ చరిత్ర లాంటి ప్రమాణాల ఆధారంగా రుణగ్రహీతల ప్రొఫైల్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అందుకు తగినట్లుగా రుణాన్ని మంజూరు చేస్తాయి. రుణం పొందేందుకు పర్సనల్ లోన్ మాత్రమే ఏకైక ఆప్షన్ కానప్పటికీ క్రెడిట్ కార్డులోన్ పర్సనల్ లోన్ కంటే ఖరీదైనది, అలాగే తాకట్టు ద్వారా ఇతరత్రా లోన్లు పొందేందుకు సమయం ఎక్కువ పడుతుంది.
ఇక ఈ వ్యక్తిగత రుణాన్ని సాధారణంగా రెండు నుండి ఐదు సంవత్సరాల కాలపరిమితితో సమానమైన నెలవారీ వాయిదాలలో (EMI) తిరిగి చెల్లించవచ్చు. మరి వ్యక్తిగత రుణం పొందేముందు రుణ గ్రహీత ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో ఇక్కడ వివరించాం, ఇవి కచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి.
రుణ మొత్తం, కాలపరిమితి:
పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు, మీరు ఎంత మొత్తంలో రుణం తీసుకోవాలో తెలుసుకోవడం అత్యంత కీలకమైన అంశం. మీకు వాస్తవానికి ఎంత మొత్తంలో రుణం అవసరం? మీరు దానిని ఎన్ని వాయిదాలలో సులభంగా తిరిగి చెల్లించగలుగుతారో పోల్చుకోవాలి. EMI ఆబ్లిగేషన్‌ను లెక్కించేందుకు ప్రతిపాదిత రుణ మొత్తంతో వివిధ కాలపరిమితులలో చెల్లించాల్సిన వాయిదాలు మీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోవడం తెలివైన ఎంపిక. ఎక్కువ కాలవ్యవధితో కూడిన రుణం అంటే నెలవారీగా చెల్లించే EMI తక్కువే ఉంటుంది కానీ వడ్డీ ఎక్కువ అవుతుందని గ్రహించాలి.
వడ్డీ రేటు, ఇతర ఛార్జీలు:
మీరు ఎంత మొత్తంలో రుణం తీసుకోవాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, మీ లోన్ మొత్తం నికర ఖర్చును నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం - వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటు మీ ఆదాయం, మీ క్రెడిట్ యోగ్యత, మీరు పని చేసే కంపెనీ మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. 0.5 శాతం వడ్డీ రేటు పెరిగితే కూడా అది దీర్ఘకాలంలో మీ మొత్తం ఖర్చును గణనీయంగా పెంచుతుందని గుర్తుంచుకోవాలి. తక్కువ EMIలకు వడ్డీరేట్లు ఎలా ఉన్నాయి, EMIలు పెరిగితే వడ్డీ రేట్లు ఏంటి? అదనంగా ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య చెల్లింపు లేదా డిఫాల్ట్‌పై వర్తించే జరిమానాలు, ఇతరత్రా ఫీజులు మొత్తం కలిపితే ఎంతవుతుందో తెలుసుకోవాలి.
క్రెడిట్ స్కోర్:
పైన పేర్కొన్న విధంగా, మీ క్రెడిట్ స్కోరే మీ లోన్ అర్హతను నిర్ణయించే ప్రధాన అంశం. క్రెడిట్ స్కోర్ లేదా CIBIL స్కోర్ అనేది 300 నుండి 900 వరకు ఉండే ఒక 3-అంకెల సంఖ్య. ఇది రుణగ్రహీత క్రెడిట్ యోగ్యతను తెలియజేస్తుంది. ఇది మీకు వచ్చే మొత్తం ఆదాయం, అందులో ఇప్పటికే ఉన్న రుణాలు, ఆపైన రుణం తీసుకోవడాలు, తిరిగి చెల్లించే గుణం/చరిత్ర ఆధారంగా రుణగ్రహీత ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మీ CIBIL స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, పర్సనల్ లోన్ ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. లోన్ నిబంధనలు, షరతులు కూడా అదే విధంగా ఉంటాయి. సాధారణంగా 750 కంటే పైబడి ఉన్న CIBIL స్కోర్ అనుకూలమైన నిబంధనలతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి అద్భుతమైనదిగా పరిగణిస్తారు.
ప్రీ-/పార్ట్-పేమెంట్ సదుపాయం, ఛార్జీలు:
మీ వద్ద తక్షణమే డబ్బు లేకపోవచ్చు, కానీ త్వరలో మీకు వేరే చోట నుంచి ఆదాయం వస్తుందని మీకు తెలుసు. కానీ తక్షణ అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకునే అవసరం ఏర్పడింది అనుకుంటే. అలాంటపుడు మీ లోన్ కాలపరిమితి ప్రారంభంలోనే ప్రీ-పేమెంట్ పూర్తిగా చెల్లించగలిగితే, మీరు వడ్డీపై చాలా వరకు ఆదా చేయవచ్చు. ఏదైనా పర్సనల్ లోన్ సాధారణంగా లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది, ఆ తర్వాత మాత్రమే, మొత్తం బకాయి మొత్తాన్ని నామమాత్రపు ఛార్జీతో ప్రీపెయిడ్ చేయవచ్చు.
ఒకవేళ ప్రీ-పేమెంట్ చేయడానికి మీ వద్ద తగినంత డబ్బు లేకుంటే, కొంత మొత్తం చెల్లించవచ్చు. ఇది పార్ట్-పేమెంట్ సమయంలో పని చేస్తుంది ఎందుకంటే ఇది మీ లోన్ ప్రధాన మొత్తాన్ని తగ్గిస్తుంది, తద్వారా వడ్డీి తగ్గుతుంది. మీ నెలవారీ EMI మొత్తాన్ని కూడా తగ్గించగలదు.
నెలవారీ రాబడి, ఖర్చులు:
మీరు తీసుకున్న లోన్ మొత్తాన్నినెలవారీ ప్రాతిపదికన EMI రూపంలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి, పర్సనల్ లోన్ తీసుకునే ముందు మీరు నెలవారీ ఆదాయం, ఖర్చులు విశ్లేషించుకోవాలి. మీరు చెల్లించే EMIలు మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేయకుండా ఉండాలి. మరింత సరళంగా చెప్పాలంటే, మీకు నెలకు వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి మీ EMIలు ఉండకూడదు.
చివరగా చెప్పేదేంటంటే..
పర్సనల్ లోన్ తీసుకునేటపుడు పైవిషయాలు తప్పకుండా పరిగణలోకి తీసుకోవడమే కాకుండా ఎవరి వద్ద తీసుకుంటున్నారు అనేది కూడా అత్యంత ప్రధానమైంది. తక్కువ వడ్డీ రేట్లకే లోన్ ఆఫర్‌లను ఇచ్చే మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై నిండా మునగొద్దు. ప్రభుత్వం గుర్తించిన విశ్వసనీయ ఆర్థిక భాగస్వామితోనే ముందుకు సాగుతున్నారని నిర్ధారించుకోవాలి. సమయానుసారంగా EMIల చెల్లింపులు, కాలపరిమితి కంటే ముందే లోన్‌ని తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తే ఎలాంటి అదనపు ఛార్జీల భారం ఉందదు.