Itching: చెమట పట్టిన చోట విపరీతమైన దురద.. ఎలా పోగొట్టాలి?
19 November 2024, 8:30 IST
- Itching: ఒక్కోసారి చెమట పట్టిన చోట దురద విపరీతంగా వస్తుంది. ఆ ప్రాంతాల్లో గోకాలని అనిపిస్తుంది. అలా చేసినప్పుడు చర్మంపై గాట్లు, మచ్చలు పడతాయి. దురదను సహజంలా ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ చూడండి.
Itching: చెమట పట్టిన చోట విపరీమైన దురద.. ఎలా పోగొట్టాలి?
చెమట ఎక్కువగా పడితే కాస్త చిరాకు వస్తుంది. అయితే, చెమట పెద్ద సమస్య కాకపోయినా ఒక్కోసారి అది పట్టిన చోట విపరీతమైన దురద వస్తుంది. దీంతో శరీరంలో దురద పెట్టిన చోట గోకితే హాయిగా అనిపిస్తుంది. అయితే, దురద కొనసాగితేనే పెద్ద సమస్య ఎదురవుతుంది. ఎక్కువగా ఆ ప్రాంతంలో గోకితే ఛారలు, మచ్చలు, దద్దుర్లు వస్తాయి. చర్మం పాడవుతుంది. దురద మరింత ఎక్కువ అవుతుంది. అందుకే చెమట వల్ల వచ్చిన దురద, ర్యాషెస్ తగ్గేందుకు కొన్ని సహజమైన మార్గాలు ఉన్నాయి. ఇంట్లో వీటిని పాటించవచ్చు.
ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టి చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ప్రయోజనాలను అందిస్తుంది. చెమట పట్టిన చోట దురద తగ్గేందుకు కూడా ముల్తానీ మట్టిని ఉపయోగించవచ్చు. చర్మపు రంధ్రాలు ఓపెన్ అయ్యేందుకు, చర్మం మృధువుగా అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. దాన్ని దురదగా ఉన్న చోట రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల దురద రాకుండా ఉపశమనం కలుగుతుంది. దురద వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయినా ఇది రాస్తే తగ్గేందుకు ఉపకరిస్తుంది.
గంధం పొడి
గంధం పొడి కూడా చర్మానికి ఎంతో మంచి చేస్తుంది. చల్లదనం అందించండంతో పాటు చాలా చర్మ సమస్యలను తగ్గించే గుణాలు ఉంటాయి. దురద కూడా గంధం పొడిగా బాగా పని చేస్తుంది. గంధం పొడిని రోజ్ వాటర్‌తో కలిపి మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని దురద వస్తున్న చోట రాసుకోవాలి. ఆరే వరకు అలాగే ఉండాలి. ఆరిన తర్వాత చల్లనీటితో కడిగేసుకోవాలి. గంధం పొడిలో యాంటీబ్యాక్టీరియల్, అనల్జెసిక్, యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. దురదను ప్రభావంతంగా పోగొట్టడంతో పాటు ర్యాషెస్, మచ్చలను తగ్గించగలుగుతుంది.
బంగాళదుంప
చర్మంపై ఇరిటేషన్ తగ్గేందుకు బంగాళదుంప కూడా ఉపయోగపడుతుంది. దురద నుంచి త్వరగా.. సులువుగా ఉపశమనం పొందే మార్గం ఇది. ఇందుకోసం ముందుగా బంగాళదుంప నుంచి ఓ స్లైస్ కట్ చేసుకోవాలి. ఆ స్లైస్‍ను ఫ్రిజ్‍ల పెట్టి కాసేపు బాగా కూల్ కానివ్వాలి. చల్లగా ఉన్న బంగాళదుంప స్లైస్‍ను దురద పెడుతున్న చోట పెట్టాలి. అలాగే సుమారు 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత స్లైస్ తీసేసి కడిగేసుకోవాలి. దురత తీవ్రంగా ఉండే రోజులో రెండుసార్లు ఇలా చేస్తే తగ్గిపోతుంది.
కార్న్ స్టార్చ్
కార్న్ స్టార్చ్ కూడా దురదతో పాటు గోకడం వల్ల ఏర్పడే ఛారలను తగ్గించగలదు. ముందుగా కార్న్ స్టార్చ్ లోన నీరు పోసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని దురద పెట్టిన చోట రాసుకొని ఆరనివ్వాలి. అనంతరం నీటితో కడిగేసి పొడిగా తుడుచుకోవాలి. రోజులో ఓసారి ఇలా చేయవచ్చు.
ఓట్‍మీల్
చర్మంపై మంట, ర్యాష్‍ను ఓట్‍మీల్ తగ్గించగలదు. పొడిగా చేసిన ఓట్‍మీల్‍ను నీటిలో కలపాలి. దురద వల్ల ప్రభావితమైన భాగాన్ని ఈ నీటిలో ముంచాలి. సుమారు అరగంట పాటు ఇలా నీటిలోనే ఉంచాలి. ఆ తర్వాత పొడిగా తుడుచుకోవాలి. చర్మం పొడిదనాన్ని, దురదను ఇది తగ్గించలదు. చర్మానికి ఇబ్బందులు తరచూ వస్తుంటే వారంలో మూడుసార్లు ఇది పాటించండి.
ఒకవేళ దురద మరీ ఎక్కువైతే సంబంధిత నిపుణులను సంప్రదించాలి. ఎఫెక్ట్ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి.