Business Ideas : సోలార్ ప్యానెల్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి?
12 March 2024, 14:00 IST
- Solar Panel Business : కొత్తగా ఏదైనా చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఏం చేయాలో అర్థంకాదు. అలాంటివారు సోలార్ ప్యానెల్ బిజినెస్ చేయవచ్చు.ే
సోలార్ ప్యానెల్ బిజినెస్
గ్రామమైనా, పట్టణమైనా ఎక్కడైనా విద్యుత్ తప్పనిసరి. కరెంటు లేకుంటే గంటసేపు ఉండడం కష్టం. వేసవిలో గ్రామాల్లో విద్యుత్ కోతలు కామన్. ఇళ్లకు అవసరమైన విద్యుత్‌ను సోలార్ ద్వారా అందించడం ద్వారా మీరు కూడా ప్రయోజనం పొందవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో కరెంటు ఉంది. ఇంట్లో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, కూలర్ తదితర విద్యుత్తుతో నడిచే వస్తువుల సంఖ్య కూడా ఎక్కువే. వాటి వినియోగం పెరిగే కొద్దీ కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది. గ్రామాల్లో వ్యవసాయ పనులకు కూడా విద్యుత్ అవసరం.
కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకునే వారు సౌరశక్తిని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సోలార్‌కు చాలా డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. మీరు ఊర్లో కూడా సోలార్ ప్యానెల్ వ్యాపారాన్ని ప్రారంభించి లాభపడవచ్చు. మీకు సోలార్ ప్యానెల్ వ్యాపారం గురించి కొంత సమాచారం ఇస్తున్నాం. చూడండి..
సోలార్ ప్యానెల్ అనేది సౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం. మీరు దీన్ని ఇంటింటికి ఇన్‌స్టాల్ చేయడం ద్వారా లేదా పరికరాలను విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. సౌర ఫలకం చతురస్రాకారంలో ఉంటుంది. ఇది సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం ద్వారా పనిచేస్తుంది. విద్యుత్తుతో నడిచే వస్తువులకు కూడా దీనిని సెట్ చేయవచ్చు. సౌరశక్తి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక మార్గం.
మీరు నగరం లేదా గ్రామంలో సోలార్ ప్యానెల్ వ్యాపారాన్ని మెుదలుపెట్టవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. దానికితోడు కరెంటు కోతలు కూడా ఉంటున్నాయి. గ్రామాల్లోనూ ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఆదాయం పొందవచ్చు.
సోలార్ ప్యానెల్ వ్యాపారంలో అనేక రకాలు ఉంటాయి. సోలార్ సిస్టమ్ అసోసియేట్, సోలార్ ప్యానెల్ రిపేర్, మెయింటెనెన్స్, సోలార్ ప్యానల్ తయారీ, సోలార్ ప్యానెల్ డిస్ట్రిబ్యూటర్, సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్, సోలార్ ఆడిటర్ మొదలైనవి మీరు ఎంచుకోవచ్చు. మీరు చేస్తున్న పని గురించి మీకు పూర్తి తెలిసి ఉండాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి.
సోలార్ ప్యానెల్ వ్యాపారంలో రిజిస్ట్రేషన్ చేయాలి. లైసెన్స్ కూడా అవసరం. GST రిజిస్ట్రేషన్ చేయాలి. సౌరశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేయవచ్చు. దీన్ని పొందడానికి మీరు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://solarrooftop.gov.in/ లో కూడా దరఖాస్తు చేయాలి. తర్వాత అక్కడ అడిగిన సమాచారాన్ని నింపి సబ్మిట్ చేసుకోవాలి.
మీరు సోలార్ ప్యానెల్‌లో ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నారనేది చాలా అవసరం. చిన్న స్థాయిలో ప్రారంభించాలని ఆలోచిస్తే.. కనీసం 1 నుండి 2 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సోలార్ ప్యానెల్ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేయాలనుకుంటే చాలా డబ్బును పెట్టుబడిగా పెట్టాలి.
సోలార్ ప్యానెల్ వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది. ఇది మీరు సర్వీస్ ఇచ్చే విధానంపై ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన సోలార్ ప్యానెల్ అందించి కస్టమర్లను ఆకట్టుకుంటే నెలకు లక్షల రూపాయలపైన సంపాదించవచ్చు. కొంత కంపెనీ ఫ్రాంచైజీని తీసుకొని కూడా ఈ బిజినెస్ మెుదలుపెట్టవచ్చు.