Hanamkonda News : కన్నారం గ్రామం ఏ మండలంలోకి? ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
Hanamkonda News : హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని కన్నారం గ్రామాన్ని--వేరే మండలంలో మార్పు గ్రామస్థుల మధ్య చిచ్చుపెట్టింది. బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ రచ్చగా మారింది.
Hanamkonda News : హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని కన్నారం గ్రామాన్ని ఏ మండలంలో కొనసాగించాలనే దానిపై శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామాన్ని ఇదివరకున్న వేలేరు మండలంలోనే కొనసాగించాలంటూ కాంగ్రెస్ నేతలు, అక్కన్నపేట మండలంలోకి మార్చాలంటూ బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఆ తరువాత ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారు.
హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని కన్నారం గ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. దీంతో గ్రామం ఒక జిల్లాలో ఉండి, నియోజకవర్గం మరో జిల్లాలో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే తమ గ్రామాన్ని నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే కలపాలని పలుమార్లు అధికారులను కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి కేటీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనగా.. అదే సభా ప్రాంగణంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అక్కన్నపేట మండలానికి మార్చాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అది గమనించిన కేటీఆర్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, మెజారిటీ గ్రామస్థుల అభిప్రాయం మేరకు కన్నారం గ్రామాన్ని ఏ మండలంలో కొనసాగించాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఇష్టం మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. ఆ తరువాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎలక్షన్ పూర్తయిన అనంతరం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం వేలేరు తహసీల్దార్ కొమి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు నిర్ణయించారు.
పురుగుల మందు డబ్బాతో నిరసన
ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన గ్రామస్థుల్లో ఎక్కువ శాతం మంది వేలేరు మండలంలోనే తమ గ్రామాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేలేరు మండల కేంద్రం పక్కనే ఉండటంతో తొందరగా అక్కడికి చేరుకోగలుగుతున్నామని, పనులు కూడా తొందరగా అవుతున్నాయన్నారు. అక్కన్నపేట మండలానికి మార్చితే దూరభారం అవుతుందని, గ్రామాన్ని ఆ మండలంలో కలపడానికి వీలు లేదంటూ పట్టుబట్టారు. దీంతో గతంలో కేటీఆర్ కు విన్నవించిన సర్పంచ్ వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు వారించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని కన్నారం గ్రామాన్ని వేరే మండలంలో కలిపితే తాను ఆత్మహత్యకు పాల్పడతానంటూ నిరసనకు దిగాడు. గ్రామాన్ని వేలేరు మండలంలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులు ఆ వృద్ధుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అధికారుల ముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైటింగ్
అధికారుల ముందే పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, మరికొందరు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మండల మార్పుపై ఇరువర్గాలు తీవ్ర మాటల యుద్ధం జరగగా.. అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో అధికారుల ముందే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పర దాడులకు దిగారు. దీంతో ఈ నెల 30న మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని ఎమ్మార్వో గ్రామస్థులకు చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా పరస్పర దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఇరువర్గాల వ్యక్తులు ఒకరిపై ఒకరు వేలేరు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారు.
వేలేరులోనే కొనసాగించాలని డిమాండ్
కన్నారం గ్రామాన్ని వేలేరు మండలంలోనే కొనసాగించాలని పలువురు గ్రామస్థులు డిమాండ్ చేశారు. హనుమకొండ ఆర్డీవో గుట్టుచప్పుడు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారని, కేవలం సర్పంచ్ వర్గానికి మాత్రమే సమాచారం అందించి, గ్రామస్థులకు మాత్రం విషయం తెలియకుండానే సమావేశం నిర్వహించారని ఆరోపించారు. కాగా కన్నారం గ్రామాన్ని వేలేరు మండలంలో కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తుండగా.. అక్కన్నపేట మండలంలోకి మార్చాలని బీఆర్ఎస్ పట్టుబడుతుండటం గందరగోళానికి దారి తీసింది. ఇప్పటికే గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)