Ayodhya: ఈ మార్గాలలో వెళ్ళారంటే సులువుగా అయోధ్య చేరుకోవచ్చు!
12 January 2024, 7:00 IST
- Ayodhya: రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఈ రూట్ మ్యాప్ ద్వారా అయోధ్య చేరుకోండి.
అయోధ్య రామ మందిరం
Ayodhya: ప్రతి ఒక్క హిందువు కల అయోధ్య రామ మందిరం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రాబోతుంది. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనుంది. కన్నుల పండుగగా ఉండే ఈ వేడుకని కనులారా తిలకించేందుకు అయోధ్యకి వెళ్లేందుకు చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు. లక్షలాది మంది అయోధ్యకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మీరు కూడా రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్య వెళ్లాలని అనుకుంటున్నారా? రామ మందిరానికి ఎలా చేరుకోవాలి? అని ఆలోచిస్తున్న వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అయోధ్యకి ఏ విధంగా చేరుకోవచ్చో దీని ద్వారా తెలుసుకోండి.
విమాన మార్గం ద్వారా అయితే ఇలా వెళ్ళండి..
రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందే ప్రయాణీకుల సౌకర్యార్థం అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ప్రారంభించారు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రామ మందిరం చేరుకునేందుకు బస్సులు, ట్యాక్సీ సర్వీసులు ఉన్నాయి. ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, జైపూర్, ముంబై నుంచి రెగ్యులర్ గా విమాన సర్వీసులు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి అయోధ్యకి 17 కిమీ దూరం. గోరఖ్ పూర్ విమానాశ్రయం, లఖనవూ నుంచి విమానాశ్రయం నుంచి కూడా అయోధ్య రామ మందిరం చేరుకోవచ్చు. జనవరి 11 నుంచి అహ్మదాబాద్- అయోధ్య మధ్య రోజూ మూడు విమాన సర్వీసులు నడుస్తాయి. ఇప్పటికే ఢిల్లీ నుంచి అయోధ్యకి విమాన సర్వీస్ ప్రారంభమైంది.
రైలు మార్గం ద్వారా అయితే..
అన్ని ప్రధాన నగరాల నుంచి అయోధ్యకి రైలు సర్వీసులు ఉన్నాయి. అయోధ్య జంక్షన్, గోరఖ్ పూర్ జంక్షన్, లఖనవూ జంక్షన్ ద్వారా అయోధ్య చేరుకోవచ్చు. ఇటీవలే అయోధ్య రైల్వే స్టేషన్ ని ఆధునీకకరించారు. ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యకి వందేభారత్ రైలు కూడా నడవనుంది.
ఢిల్లీ ఆనంద్ విహార్ నుంచి అయోధ్యకి వందే భారత్ రైలుని ప్రారంభించారు. ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకి అయోధ్య కంటోన్మెంట్ చేరుకుంటుంది. ఈ రైలు కాన్పూర్ సెంట్రల్, లఖనవూ మీదుగా నడుస్తుంది. మరలా అయోధ్యలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 11.40 గంటలకు ఆనంద్ విహార్ చేరుకుంటుంది.
రోడ్డు మార్గం ద్వారా
అయోధ్య చేరుకునేందుకు అద్భుతమైన నేషనల్ హైవే అందుబాటులో ఉంది. దీని ద్వారా ఈజిగా అయోధ్య చేరుకోవచ్చు. వారణాని, గోరఖ్ పూర్, లఖనవూ నుంచి రెగ్యులర్ గా బస్సు సర్వీసులు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మార్గం ద్వారా భక్తులు అయోధ్య చేరుకోవచ్చు.
అయోధ్యకి వెళ్ళేవాళ్ళకి ఈ నియమాలు తప్పనిసరి
ప్రస్తుతం మళ్ళీ కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణీకులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖానికి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించే విధంగా ఉండాలి. రామ మందిరానికి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలి. సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకెళ్లడానికి ఉండదు.