Puri for Panipuri: ఈ కొలతలతో గంటలో 100 పానీపూరీలు చేసేయొచ్చు.. క్రిస్పీగా, రుచిగా వస్తాయి
13 September 2024, 15:30 IST
Puri for Panipuri: పానీపూరీ కోసం ఇంట్లోనే పూరీలు తయారు చేయొచ్చు. ఇక్కడ చెప్పిన కొలతలతో చేశారంటే ఒక గంటలో వంద పూరీలు రెడీ అవుతాయి.
పానీపూరి (pixabay)
పానీపూరి
పానీపూరీలు ఇంట్లో చేస్తే బయటి రుచి రాదు. ముఖ్యంగా పూరీలు అంత రుచిగా, క్రిస్పీగా రావు. ఈ కొలతలతో ఒక్కసారి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా మంచి కరకరలాడే పూరీలు రెడీ అవుతాయి. ఒక్కసారి 100 దాకా పానీపూరీలు చేసేయొచ్చు. మీరు మొదటిసారి ప్రయత్నించినప్పుడు సగం కొలతలతో చేసి చూడొచ్చు. అరగంటలో 50 పూరీలు రెడీ అవుతాయి. కొన్ని చిట్కాలతో సహా తయారీ చూసేయండి.
ముందుగా కొన్ని చిట్కాలు:
- పానీపూరీలు చేశాక తప్పకుండా తడి గుడ్డతో కప్పి పెట్టాలి.
- పిండి తడిపేటప్పుడు మైదా ఎక్కువగా వాడకూడదు.
- పిండి విడదీస్తే విరగిపోకుండా సాగినట్లు అయ్యేదాకా కలపాలి.
- నూనె వేడెక్కాక మాత్రమే పానీపూరీలు ఫ్రై చేయాలి. లేదంటే నూనె పీలుస్తాయి. పొంగవు.
పానీ పూరీల తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల సన్నం రవ్వ
పావు టీస్పూన్ బేకింగ్ సోడా
2 చెంచాల మైదా
పావు కప్పు నీళ్లు
సగం చెంచా ఉప్పు
2 చెంచాల నూనె (పిండి తడపడం కోసం)
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
పానీ పూరీల తయారీ విధానం:
- ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అందులో రవ్వ, చెంచా నూనె, ఉప్పు, బేకింగ్ సోడా వేసి పొడిపొడిగా కలపుకోవాలి.
- మైదా కూడా వేసి ఒకసారి కలిపాక చెంచా నూనె, నాలుగైదు చెంచాల నీళ్లు వేసుకుని పొడిగా మరోసారి కలుపుకోవాలి.
- ఇలా నీళ్లు కొద్దికొద్దిగా మాత్రమే వేసుకుంటూ పిండిని కలుపుకుంటే నీళ్లు పీల్చుకుని రవ్వ మెత్తగా మారుతుంది. పిండి మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోండి.
- ఒకవేళ పొరపాటున నీళ్లు ఎక్కువయ్యి పిండి మెత్తగా అయిపోతే మరో రెండు మూడు చెంచాల రవ్వ వేసి పిండి మళ్లీ కలుపుకోండి.
- పిండి బాగా కలిపాక సాగేటట్లు అవుతుంది. దూరంగా అంటే వెంటనే దూరం అవ్వకుండా సాగేట్లు అయిపోతుంది. ఇలా ఉంటే పిండి సరిగ్గా కలిపినట్లే.
- ఇలా కలిపాక పిండిన అరగంట పాటూ తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోండి.
- తర్వాత మరోసారి కలిపి చపాతీలు చేసే కర్ర మీద చపాతీలాగా ఒత్తుకోండి. పిండి చల్లకండి. చపాతీ అంత సన్నగానే ఉంటే సరిపోతుంది.
- ఇప్పుడు చిన్న గిన్నె తీసుకుని గుండ్రంగా పూరీలను కట్ చేసుకోండి. వీటిని ఒక ప్లేట్ లో వేసుకుని వాటిమీద కూడా ఆరిపోకుండా తడిగుడ్డ వేసుకోవడం తప్పనిసరి.
- ఇప్పుడు కడాయిలో నూనె పోసుకుని మీడియం మంట మీద పెట్టుకోవాలి. ముందు నూనె వేడెక్కాక ఒక పూరీ వేసుకోండి. అది మెల్లగా వేగి పైకి తేలుతుంది. ఇలా వస్తే పూరీలు సరిగ్గా చేశారని అర్థం. ఇప్పుడు మిగతా పూరీలను కూడా వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోండి. బంగారు వర్ణంలోకి వస్తే చాలు.
- ఈ పూరీలు చల్లారేదాకా ఆగి వెంటనే గాలి చొరని డబ్బాలో వేసి పెట్టారంటే క్రిస్పీగా ఉంటాయి.