Imli spoon: నోరూరించే చింతపండు చెంచాలు గుర్తున్నాయా? ఇంట్లోనే ఇలా చేయొచ్చు
07 October 2024, 15:30 IST
Imli spoon: చింతపండు చెంచాలు అప్పుడెప్పుడో ఏళ్ల క్రితం చూసుంటారు. వీటిని తినాలనిపిస్తే ఇంట్లోనే తయారు చేసేయొచ్చు. నోరూరించే ఈ రెసిపీ ఎలాగో చూసేయండి.
చింతపండు చెంచాలు
చింతపండు చెంచాలు
చిన్నప్పటి జ్ఞాపకాల్లో చింతపండు చెంచాలు తప్పకుండా ఉంటాయి. షాపుకు వెళ్లి వీటిని కొనుక్కొని తినడం గుర్తుండే ఉంటుంది. అయితే ఈ మధ్య అవి కొందామన్న తక్కువే కనిపిస్తున్నాయి. ఇంట్లోనే మీరు వీటిని చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. మీ పిల్లలకూ దీన్ని పరిచయం చేయొచ్చు.
చింతపండు చెంచాల తయారీకి కావాల్సినవి:
1 కప్పు లేదా వంద గ్రాముల చింతపండు (గింజలు లేనిది)
పావు కప్పు ఖర్జూరాలు (ఆప్షనల్)
1 కప్పు వేడి నీళ్లు
కప్పు బెల్లం
1 టీస్పూన్ జీలకర్ర
2 ఎండుమిర్చి
అర టీస్పూన్ ఉప్పు
చింతపండు చెంచాల తయారీ విధానం:
- ముందుగా ఒక ప్యాన్ లో నూనె లేకుండా జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. కాస్త రంగు మారగానే తీసి చల్లార్చుకోవాలి.
- వీటిని మిక్సీలో వేసుకుని మెత్తగా పట్టుకోవాలి.
- ఇప్పుడు పెద్ద బౌల్ లో చింతపండు తీసుకుని అందులో ఖర్జూరాలు, వేడినీళ్లు మునిగేదాకా పోసుకోవాలి.
- అరగంట నానిన తర్వాత చింతపండు, ఖర్జూరం తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఇందాక మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసుకోవాలి.
- ఇప్పుడు ప్యాన్ లో బెల్లం వేసుకుని కాస్త కరిగిపోయాక అందులో మిక్సీ పట్టుకున్న చింతపండు మిశ్రమం వేసుకోవాలి.
- మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతా కలిసి పోయి కాసేపటికే చిక్కటి చింతపండు ముద్ద తయారవుతుంది. ఈ ముద్దను కాస్త చెంచా మీద తీసుకుంటే కింద పడిపోకూడదు. అలాంటి చిక్కదనం రావాలి.
- అలా అవ్వగానే స్టవ్ కట్టేసుకోండి. ఐస్ క్రీం పుల్లలకు ఈ ముద్దను చేతిలో తీసుకుని కాస్త ఒత్తుకోండి. మీద కవర్ చుట్టేస్తే చింతపండు చెంచాలు రెడీ.
- ఈ చెంచాలు లేకపోతే చిన్న క్యాండీల్లాగా చేతితోనే గుండ్రటి బాల్స్ చేసుకుని కవర్లో చుట్టినా సరిపోతుంది.
టాపిక్