Rangoli Hacks: నీటి మీద తేలే ముగ్గు, నీరు పోసినా చెదరని ముగ్గు మీరూ వేయొచ్చు, ఈ సీక్రెట్ తెల్సుకోండి చాలు
25 August 2024, 14:00 IST
Rangoli Hacks: వినాయక చవితి పండగ రోజు ఇంట్లో ప్రత్యేకంగా, వినూత్నంగా రంగవల్లులు వేయాలనుకుంటున్నారా? అయితే సింపుల్ గా అయిపోయే ఈ ఫ్లోటింగ్, అండర్ వాటర్ ముగ్గులు ట్రై చేయండి. అపార్ట్‌మెంట్లలో బయట ముగ్గులు వేయలేని వారు ఇలా మీ పండగ ప్రత్యేకతను పెంచేయొచ్చు.
రంగోలీ హ్యాక్స్
పండగ రోజు చిన్నదో పెద్దదో కాస్త ప్రత్యేకంగా ముగ్గు వేస్తారు. అందరికీ పెద్ద పెద్ద డిజైన్లు వేయడం రాకపోవచ్చు. అలాంటప్పుడు మీకు వచ్చిన సింపుల్ డిజైన్లనే ప్రత్యేకంగా మార్చేస్తాయీ అండర్ వాటర్, ఫ్లోటింగ్ రంగోలీలు. ఒకటి నీటికింద చెక్కు చెదరని రంగోలీ అయితే మరోటి నీటిలో తేలే రంగుల ముగ్గు. వీటి సింపుల్ టిప్స్ చూడండి.
అండర్ వాటర్ రంగోలీలు:
ఒక ప్లేటులో నీటి కింద వేసిన రంగుల ముగ్గు చెక్కు చెదరకుండా ఉండటం చూసే ఉంటారు. కానీ అదెలాగో ఆలోచించారా? చాలా సింపుల్ టిప్ పాటిస్తే మీరు వేసిన ముగ్గు నీళ్లు పోసినా చెదరదు. దాని కోసం కాస్త లోతు తక్కువగా ఉన్న పల్లెం లాంటిది తీసుకోండి. దానికి క్యాండిల్ వ్యాక్స్ అంతటా రుద్దండి. ఇప్పుడు మీకు నచ్చిన చిన్న ముగ్గు వేయండి. ఆ పల్లెం స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ముందుగా రాసిన క్యాండిల్ వ్యాక్స్ వేడెక్కి కరిగిపోతుంది. ఆ మైనమంతా ముగ్గులు పీల్చుకుంటాయి. ఇప్పుడు పల్లెం కాస్త చల్లారేదాకా ఆగి పల్లెం అంచుల నుంచి మెల్లగా నీళ్లు పోస్తే రంగోలీ చెక్కు చెదరదు. మీరు వేసిన ముగ్గు నీటి కింద కనిపిస్తుంది.
ఇంకాస్త సింపుల్‌గా చేయాలంటే పల్లెం మొత్తం కొబ్బరి నూనె రాయండి. ముగ్గు వేయండి. ఒక నిమిషం అలా ఆగితే ముగ్గు నూనె పీలుస్తుంది. ఇప్పుడు నీళ్లు పోస్తే చాలు. అండర్ వాటర్ రంగోలీ రెడీ అయినట్లే.
ఫ్లోటింగ్ వాటర్ రంగోలీ:
నీటికింద ముగ్గు ఎలా ఆగుతుందో తెల్సుకున్నారుగా. ఇప్పుడు నీటి మీద ముగ్గు తేలాలంటే ఏం చేయాలో చూడండి. మీరు నీళ్ల మీద మామూలుగా ముగ్గు వేస్తే అది అడుగుకు చేరుకుంటుంది. అందుకే ఒక పల్లెం తీసుకుని అంచుల దాకా నీళ్లు పోయాలి. ఇప్పుడు మీద ఫేస్ పౌడర్ లేదా టాల్కం పౌడర్ మెల్లగా టీ జాలి సాయంతో అంతటా చల్లాలి. పౌడర్ నీటిలో అంత సులువుగా మునగదు. కొందరు ఈ పౌడర్ బదులు డిస్టెంపర్ పొడినీ చల్లుతారు. ఇక మీద మీకిష్టమైన రంగోలీ వేస్తే అది మునగకుండా నీటిలో తేలుతుంది. ఈ పౌడర్ మీ ముగ్గుకు, నీటికి మధ్య అడ్డు పొర లాగా పనిచేస్తుందన్నమాట.
నీటిమీద రంగోలీ వేయడం కాస్త కష్టం కాబట్టి వెడ్డింగ్ కార్డు మీద వినాయకుని బొమ్మ అచ్చు లాగా ఉంటుంది. అది వాడేయండి. దాన్ని పెట్టి రంగును జల్లెడతో చల్లితే వినాయకుని ముగ్గు రెడీ అవుతుంది.
ఫ్లోటింగ్ ఫ్లవర్ రంగోలీ:
తాంబాలంలో నీల్లు పోసి మీద పూరేకులతో అలంకరిస్తే పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే పూరేకులు, పూలు మునిగిపోతూ ఉంటాయి. అలా జరక్కుండా ఒక చిన్న ప్లేటు, దాని వెడల్పుకు సరిపోయే కొన్ని బాంబూ స్టిక్స్, ఐస్ క్రీం స్టిక్స్ లేదా ఇంకేవైనా పుల్లలు కొన్ని తీసుకోండి. తాంబాలంలో నీళ్లు నింపి ఉపరితలం మీద అటూ ఇటూ పుల్లలు అడ్డుగా నిలువుగా పేర్చండి. అలా చేస్తే చిన్న చిన్న గడులు రెడీ అవుతాయి. వాటి మధ్యలో పూలు పెట్టారంటే రోజు మొత్తం చెక్కరకుండా పూల రంగోలీ ఉంటుంది. నీటిలో తేలినట్లే కనిపిస్తుంది. పూలు బరువుగా ఉంటాయి కాబట్టి ఈ ఏర్పాటుతో తొందరగా మునిగిపోవు. పూరేకులయితే నేరుగా నీటిమీద చల్లితే సరిపోతుంది.