Winter Face Mask: చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతోందా? ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి.. తయారీ ఇలా
18 November 2024, 20:30 IST
- Winter Face Mask: చలికాలంలో చర్మం పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ముఖంపై చర్మానికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే, చర్మం పొడిబారడాన్న తగ్గించేందుకు ఓ ఫేస్‍మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంట్లో ఎలా తయారు చేసుకొని.. వాడాలంటే..
Winter Face Mask: చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతోందా? ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి.. తయారీ ఇలా
చలికాలంలో ఎదురయ్యే ప్రధానమైన సమస్య చర్మం పొడిబారడం. చల్లటి గాలులు, వాతావరణం తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మానికి ఈ కాలంలో సమస్యలు ఎదురవుతాయి. చర్మం పొడిగా అయి నిస్సారంగా కనిపిస్తుంది. చర్మంలో తేమ సరిగా లేక మచ్చలు, దురద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ముఖపు చర్మంపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే, చర్మం పొడిబారే సమస్యను పెరుగు, అరటి పండు ఉపయోగించి చేసే ఓ ఫేస్‍మాస్క్ బాగా తగ్గించగలదు. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకొని వాడొచ్చు.
ఈ ఫేస్‍మాస్క్ చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు
- రెండు టేబుల్‍స్పూన్‍ల తాజా పెరుగు
- ఓ టీస్పూన్ తేనె
- ఓ టేబుల్‍స్పూన్ మెత్తగా చేసుకున్న అరటి పండు
- ఓ టీస్పూన్ కొబ్బరినూనె
మాస్క్ తయారీ.. అప్లై చేసుకోవడం ఇలా..
ఈ పెరుగు ఫేస్‍మాస్క్ కోసం.. ముందుగా ఓ గిన్నెలో పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముందుగా ముఖానికి పూర్తిగా రాయాలి. ముఖంతా బాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరినూనె, మెత్తగా చేసుకున్న అరటి పండును బాగా మిక్స్ చేసుకోవాలి. ఓ క్రీమ్‍లా అయ్యేంత వరకు దీన్ని వేళ్లతో వత్తాలి. ఆ తర్వాత ముఖంపై దాన్ని రాసుకోవాలి. ఇది రాసుకునే సమయంలో కళ్లు మూసే ఉంచాలి. ఆ తర్వాత కాసేపు ఆరనివ్వాలి. సుమారు 20 నిమిషాలకు ఈ ఫేస్‍మాస్క్ ఆరిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అనంతరం ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి.
ఈ మాస్క్‌తో చర్మానికి మేలు ఇలా..
ఈ కర్డ్ ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల చర్మానికి పోషకాలు అంది పొడిబారడం తగ్గుతుంది. ముఖానికి మంచి మెరుపు వస్తుంది. చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్‍లను ఈ మాస్క్ తొలగిస్తుంది. చర్మం మృధువుగా మారుతుంది.
అరటితో మరో మాస్క్
అరటి పండు, తేనెతో మాత్రమే ఓ ఫేస్ మాస్క్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓ అరటి పండు, రెండు టేబుల్ స్పూన్‍ల తేనె కావాలి. ముందుగా అరటి పండును మెత్తగా చేసుకోవాలి. దాంట్లో తేనె వేయాలి. రెండు బాగా కలిసే మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అది ఆరే వరకు అలాగే ఉండాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి.