Kajal DIY: రసాయనాలు లేని కాటుక.. పిల్లల కోసం ఇంట్లోనే తయారు చేయొచ్చు
21 October 2024, 12:30 IST
Kajal DIY: చిన్న పిల్లల కోసం రసాయనాలు లేని కాటుక ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెండు రకాల పద్ధతుల్లో కాటుకను సులభంగా ఎలా చేయొచ్చో, దానికోసం ఏమేం కావాలో తెల్సుకోండి.
కాటుక తయారీ
చిన్న పిల్లలకు ఎలాంటి ఉత్పత్తులు వాడాలన్నా ఆలోచిస్తాం. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే ఏ ఉత్పత్తి కొనాలన్నా అందులో ఏ రసాయనాలుంటాయో ఏమోననే భయమూ ఉంటోంది. ముఖ్యంగా బొట్టు పెట్టడం కోసం వాడే కాటుక అలాంటి లిస్టులోనే ఉంటుంది. ఇది వరకు పిల్లల కోసం ఇంట్లోనే కాటుక చేసేవాళ్లు. మనం ఆ పద్ధతేంటో మర్చిపోయి బయట మార్కెట్లో కాటుక కొంటున్నాం. బదులుగా పాత పద్ధతిలో కాటుక ఎలా చేసుకోవాలో చూసేయండి.
కాటుక తయారీ కోసం కావాల్సిన పదార్థాలు:
ఒక చెంచా గంధం పొడి
ఒక కాటన్ వస్త్రం
నెయ్యి
దీపం
4 లేదా 5 బాదాం
ఫోర్క్
చెంచా
కాటుక తయారీ విధానం:
1. ముందుగా గంధంలో కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లాగా కలపాలి. అందులో మజ్లిన్ లేదా కాటన్ గుడ్డ పూర్తిగా ముంచాలి.
2. అలా ముంచిన గుడ్డను ఎండలో అలాగే పెట్టేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత వత్తిలాగా పెన వేసుకుంటూ చుట్టు చుట్టాలి.
3. ఇప్పుడు ఒక దీపంలో నెయ్యి వేసి ఈ వత్తిని ఉంచాలి.
4. దీపం వెలిగించి పెట్టాలి.
5. ఒక ఫోర్క్‌కు బాదాం గుచ్చి, బాదాం మంట మీద వచ్చేలా పట్టుకోవాలి.
6. ఇప్పుడు బాదాంకు కాస్త పైన, దూరంగా చెంచాను బోర్లా పెట్టి పట్టుకోవాలి.
7. ఆ చెంచా పూర్తిగా నల్లగా అయ్యేదాకా అలాగే పట్టుకోవాలి.
8. ఇప్పుడు చెంచా మీద నల్లటి మసి లాగా తయారవుతుంది.
9. ఆ మసిని తీసి ఒక చిన్న డబ్బాలో గీకి పెట్టుకోవాలి. ఈ పొడిలో కాస్త నెయ్యి కలిపితే కాటుక లాగా వాడుకోవడమే.
మరో పద్దతి:
1. రెండు గ్లాసులు కాస్త దూరంలో బోర్లించి పెట్టి, వాటిమీద ఒక ప్లేట్ బోర్లించాలి.
2. రెండు గ్లాసుల మధ్యలో, ప్లేట్ కింద వచ్చేలాగా వెలిగించిన దీపం పెట్టాలి.
3. ఇప్పుడు ఫోర్క్‌కు బాదాం గుచ్చి దీపం మంటకు పట్టుకోవాలి. అంటే కింద దీపం, పైన ప్లేట్ కాస్త దూరంలో ఉంటుంది. మధ్యలో ఫోర్క్ గుచ్చిన బాదాం ఉంటుంది.
4. బాదాం నల్లబడేదాకా కాలిస్తే ప్లేట్‌కు నల్లటి మసి తయారవుతుంది. దీన్ని గీకేసి ఒక డబ్బాలో పెట్టుకోవాలి.
5. నెయ్యి కలిపి పెట్టుకుంటే కాటుక సిద్దం అయినట్లే.
మరో చిట్కా:
నెయ్యికి బదులుగా ఆముదం వాడొచ్చు.
టాపిక్