Tiger nuts benefits: టైగర్ నట్స్ మీ ఆహారంలో చేర్చుకోండి.. బాదాం, కాజూ కన్నా వీటితో లాభాలెక్కువ
Tiger nuts benefits: టైగర్ నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వీటిగురించి తెలీక వీటిని తినరు. వీటిలో ఉండే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా తెల్సుకోండి.
ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా విత్తనాలను ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలని చెబుతుంటారు. ఇవి అవసరమైన మినరళ్లతో పాటు మంచి కొవ్వును అందిస్తాయి. ఇప్పటివరకు జీడిపప్పు, బాదాం, వాల్‌నట్స్, పిస్తా పప్పులు మాత్రమే ఆరోగ్యకరమని అక్కడికే పరిమితమై ఉంటాయి. కానీ ఈ టైగర్ నట్స్ చాలా రెట్లు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి.
ఆ పేరెందుకు?
పులులకు ఈ గింజలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ గింజల పైన పులి లాంటి చారలుంటాయి అంతే. అందుకే టైగర్ నట్స్ అంటారు వీటిని. టైగర్ నట్స్ ను ఎర్త్ ఆల్మండ్, ఎల్లో నట్స్, రష్ నట్స్ అని అనేక పేర్లతో కూడా పిలుస్తారు. నిజానికి ఇవి కాయ లేదా పండు కాదు. వేరుశనగల్లాగా భూమిలోపల పెరుగుతాయివి.
టైగర్ నట్స్ పోషకాలు
పావు కప్పు లేదా 50 గ్రాముల టైగర్ నట్స్‌లో 120 కేలరీలతో పాటు 19 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 7 గ్రాముల కొవ్వు, ఇది మంచి మోనోశాచురేటెడ్ కొవ్వు రకం. కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్‌తో పాటు 10 గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది. వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి. వీటితో పాటు విటమిన్ సి, డి, ఇ కూడా ఉంటాయి.
టైగర్ నట్స్ ప్రయోజనాలు:
జీర్ణక్రియ
ఈ గింజల్లో కరగని డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణంకాని ఆహారాన్ని కడుపులో జీర్ణం చేయడానికి సాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది.
చక్కెర స్థాయులు
వీటిలో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ పెరగకుండా చూస్తుంది. ఫైబర్ పెద్దప్రేగులో చక్కెర శోషణను నిరోధిస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. ఇందులోని అర్జినిన్ అమైనో ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడానికి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
ఎముకల ఆరోగ్యం
వీటిలో ఉండే ప్రోటీన్ 18 రకాల అమైనో యాసిడ్లను కలిగి ఉంటుంది. ఇది మంచి మొక్కల ఆధారిత ప్రోటీన్. దీంట్లో గుడ్డుతో సమానంగా ప్రోటీన్ ఉంటుంది. దీంతో ఎముకలతో పాటు కండరాలు, కణజాలాలు ఆరోగ్యంగా మారతాయి.
గుండె ఆరోగ్యం
టైగర్ నట్స్ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఆరోగ్యకరమైన కొవ్వు కొలెస్ట్రాల్‌ను ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇ విటమిన్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల కణాల ఆరోగ్యానికి సాయపడతాయి. ఆరోగ్యానికి రక్షణగా పనిచేసి క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తాయి.