తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Phool Makhana Uthappam: ఫూల్ మఖానా మిక్సీ పట్టి ఇలా మినీ ఊతప్పం చేసేయండి, ఎన్నయినా లాగించేస్తారు

Phool Makhana Uthappam: ఫూల్ మఖానా మిక్సీ పట్టి ఇలా మినీ ఊతప్పం చేసేయండి, ఎన్నయినా లాగించేస్తారు

11 September 2024, 6:30 IST

google News
  • Phool Makhana Uthappam: ఫూల్ మఖానాతో ఊతప్పం ప్రయత్నించండి చూడండి. కూరగాయ ముక్కలు జోడించి ఇలా సింపుల్ రెసిపీ ప్రయత్నించండి. సాయంత్రం పూట స్నాక్ కోసం, అల్పాహారానికి కూడా ఇది బెస్ట్ రెసిపీ.

ఫూల్ మఖానా ఊతప్పం
ఫూల్ మఖానా ఊతప్పం (pinterest)

ఫూల్ మఖానా ఊతప్పం

ఫూల్ మఖానా ఊతప్పం ఆరోగ్యకరమైన స్నాక్ లేదా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. సాయంత్రం పూట ఆకలి తీరాలంటే ఇలాంటి స్నాక్స్ చేయొచ్చు. లేదా ఉదయాన్నే కేలరీలు తక్కువుంటే అల్పాహారంగా వీటిని తినొచ్చు. చాలా సింపుల్ గానూ రెడీ అవుతాయి. పిండి పులియాల్సిన అవసరం లేకుండా ఇన్స్టంట్ గా చేసుకునే ఈ ఫూల్ మఖానా ఊతప్పం రెసిపీ ఒకసారి చూసి చేసేయండి.

ఫూల్ మఖానా ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు ఫూల్ మఖానా

సగం కప్పు పోహా (సన్నంవి)

సగం కప్పు సన్నం రవ్వ

ఒక కప్పు పెరుగు

సగం కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు

సగం కప్పు తరిగిన క్యాప్సికమ్ ముక్కలు

రెండు చెంచాల ఉడికించిన మొక్కజొన్న గింజలు

గుప్పెడు కొత్తిమీర తరుగు

సగం కప్పు టమాలా ముక్కలు

2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు

అల్లం అంగుళం ముక్క

ఉప్పు రుచి ప్రకారం

ఫూల్ మఖానా ఊత్తపం తయారీ విధానం:

  1. ఒక పాత్రలో సన్నం రవ్వ, పోహా, ఫూల్ మఖానా వేసుకోవాలి. దాంట్లో ఒక కప్పు పెరుగు పోసి కలుపుకుని మూత పెట్టుకోవాలి.
  2. పావు గంటసేపు వదిలేస్తే అన్నీ మెత్తగా అయిపోతాయి.
  3. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని అంగుళం అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  4. మరోవైపు బాణలిలో తరిగిన క్యాప్సికమ్, ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర , ఉడికించిన మొక్కజొన్న వేసి 2 నుండి 3 నిమిషాలు అన్నీ ఉడికించాలి.
  5. ఇప్పుడు పెనం పెట్టుకుని వేడెక్కాక గరిటెడు పిండిని వేసుకోండి. ఊతప్పం మందంగానే ఉండాలి. ఒకసారి గరిటె మెల్లగా తిప్పండి చాలు.
  6. తర్వాత మీద తరిగిన కూరగాయల మిశ్రమం వేయండి. కావాలంటే కాస్త పన్నీర్ కూడా వేసుకోవచ్చు.
  7. అంచుల వెంబడి బటర్ లేదా నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. రంగు మారితే ఊతప్పం తీసేసుకోవాలి.
  8. చిన్న చిన్న సైజులో ఈ ఊతప్పం వేసుకుంటే సాయంత్రం పూట స్నాక్ లోకి చాలా బాగుంటాయి. తినడానికీ కొత్తగా అనిపిస్తుంది.
  9. వీటిని ఏ చట్నీ లేకుండా అలాగే తినేయొచ్చు. అవసరం అనుకుంటే గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.

తదుపరి వ్యాసం