Bihari Sattu paratha: పుట్నాల పప్పుతో చేసే సత్తు పరాటా.. చాలా సింపుల్‌గా చేయొచ్చు..
26 June 2024, 6:30 IST
Bihari Sattu paratha: బీహారీ స్టైల్ సత్తు పరాటా చేయడం చాలా సులువు. ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే పదార్థాలతోనే రెడీ అయిపోతాయి. అదెలాగో చూడండి.
సత్తు పరాటా రెసిపీ (pexels)
సత్తు పరాటా రెసిపీ
పరాటాలు ఎక్కువగా ఏదైనా కూరగాయల స్టఫ్ఫింగ్ తోనే చేసుకుంటాం. కానీ ఈ బీహారీ స్టైల్ సత్తు పరాటాకు ఏ కూరగాయలు అవసరం లేదు. పుట్నాలను పొడిచేసి కొన్ని సాదాసీదా మసాలాలు కలిపి వీటిని చేసుకోవచ్చు. రుచిలో ఏమాత్రం తీసిపోవు. ఇంట్లో కొద్దిగా పుట్నాల పప్పు ఉంటే వెంటనే వీటిని ప్రయత్నించి చూడండి.
బీహారీ సత్తు పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పుట్నాలు
1 ఉల్లిపాయ, సన్నం ముక్కలు
3 వెల్లుల్లి రెబ్బలు
సగం చెంచా పచ్చిమిర్చి ముద్ద
1 చెంచా కారం
తగినంత ఉప్పు
సగం చెంచా కలోంజీ
1 చెంచా వాము
1 చెంచా ఊరగాయ నూనె
2 చెంచాల ఆవనూనె
సగం చెంచా అల్లం ముద్ద
1 కప్పు గోధుమపిండి
బీహారీ సత్తు పరాటా తయారీ విధానం:
- ముందుగా పరాటా స్టఫ్ఫింగ్ కోసం ఒక వెడల్పాటి గిన్నెలో పుట్నాల పొడి వేసుకోవాలి. పుట్నాలను వేయించాల్సిన అవసరం లేదు. మిక్సీలో వేసుకుని నేరుగా మెత్తగా పొడి చేసుకుంటే చాలు.
- ఈ పుట్నాల పొడిలోనే కారం, వాము, పసుపు, కలోంజీ, అల్లం ముద్ద, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసుకోవాలి. అవన్నీ ఒకసారి బాగా కలపాలి.
- తర్వాత ఆవనూనె, కాస్త రుచికోసం ఏదైనా మీకిష్టమైన ఊరగాయ మీద తేలే నూనె, కలోంజీ కూడా వేసుకోవాలి.
- ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అలాగనీ ఈ స్టఫ్ఫింగ్ ముద్దలా కలుపుకోకూడదు. రెండు చెంచాల నీళ్లు చాలు. పొడిగా కాకుండా కాస్త పిడికిలితో గట్టిగా పిండిని ఒత్తితే రాలిపోకుండా ముద్దలా ఆగాలంతే. పరాటాల్లో పెట్టుకునే స్టఫ్ఫింగ్ రెడీ అయినట్లే.
- ఇప్పుడు గోధుమపిండిలో ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకుంటూ చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి.
- గోదుమ పిండి చిన్న ఉండ తీసుకుని కొద్దిగా గుండ్రంగా ఒత్తుకోవాలి. మధ్యలో పరాటా స్టఫ్ఫింగ్ రెండు చెంచాలు పెట్టుకుంటే చాలు. పరాటాలు మరీ పెద్దగా కాకుండా పూరీ కన్నా కాస్త పెద్ద సైజులో ఉండాలి. లేదంటే పొడి పరాటా అంతటా రాదు.
- గోధుమపిండిని చుట్టూ చుట్టేసి ఉండలాగా చేసుకోవాలి. అంచులు బాగా అతికించి పరాటాల్లాగా ఒత్తుకోవాలి. చపాతీ కన్నా కాస్త మందంగా ఉండాలి. అవసరమైతే కాస్త పొడి గోధుమపిండి చల్లుకుంటూ పరాటాలు ఒత్తుకోవాలి.
- పెనం వేడి చేసుకుని ఈ పరాటాలను కాల్చుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకుంటూ కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యేదాకా ఆగాలి. అంతే.. సత్తు పరాటా రెడీ అయినట్లే.
- ఈ పరాటాలను పెరుగుతో లేదా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి.