Fake Cooking Oil : కల్తీ వంట నూనెను గుర్తించేందుకు కొన్ని చిట్కాలు.. ఈజీగా తెలిసిపోతుంది
08 June 2024, 16:30 IST
- Fake Cooking Oil Identify Tips : కల్తీ వంట నూనె అనేది ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంది. దీనిద్వారా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మీరు కొన్ని సాధారణ చిట్కాలు పాటించి నకిలీ వంట నూనెను గుర్తించవచ్చు.
కల్తీ వంట నూనెను ఎలా గుర్తించాలి?
ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 18,000 లీటర్ల కంటే ఎక్కువ కల్తీ వంట నూనెను స్వాధీనం చేసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల తన అధికారిక ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. ఇది చూసినప్పుడు చాలా మంది మదిలో అనేక ప్రశ్నలు తలెత్తడం ఖాయం. వంట నూనె కల్తీదా కాదా అని ఎలా గుర్తించాలని అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు.
మనం వాడే వంటనూనె మంచి నూనె కాదా, నకిలీ వంటనూనె అంటే ఏమిటి, కల్తీ నకిలీ వంటనూనెను ఎలా గుర్తించాలి తదితర అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం మన ఆరోగ్య, ఆర్థిక కారణాల కోసం చాలా ముఖ్యమైనది.
కల్తీ వంటనూనెలతో వండేటప్పుడు అందులో హానికరమైన పదార్థాలు కలగలిసి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అలాగే ఈ రకమైన నూనెలలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఫలితంగా శరీరం వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు నకిలీ లేదా కల్తీ వంట నూనెలను ఎలా గుర్తించాలో చూద్దాం.
నకిలీ వంట నూనెలను ఎలా గుర్తించాలి?
నూనెను కొనుగోలు చేసేటప్పుడు దాని వెనుక భాగంలో ఉండే పోషకాహార సమాచారాన్ని ఎల్లప్పుడూ చూసుకోండి. ఇది సేంద్రీయ, నాన్-జిమో లేదా నిర్దిష్ట ధృవపత్రాలను చెబుతున్నారో లేదో చూడండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆయిల్ కొనుగోలు చేసేటప్పుడు దాని గడువు తేదీని చెక్ చేసుకోవాలి.
మీరు కొనుగోలు చేసే నూనె మార్కెట్ ధర కంటే తక్కువగా ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉంది. కల్తీ లేని నూనెలు ఒక నిర్దిష్టమైన సహజమైన సువాసనను కలిగి ఉంటాయి. కల్తీ లేని నూనె అయితే దానికి సువాసన ఉండదు. కల్తీ నూనె కొద్దిగా మబ్బుగా ఉంటుంది. స్వచ్ఛమైన నూనెలకు స్పష్టత ఉంటుంది. ఉదాహరణకు, ఆలివ్ నూనె బంగారు ఆకుపచ్చ, పొద్దుతిరుగుడు నూనె లేత పసుపులో ఉంటాయి. స్వచ్ఛమైన నూనెలు సహజమైన రుచిని కలిగి ఉంటాయి. కల్తీ నూనె అయితే మీరు చేదు రుచి లేదా అసహ్యకరమైన రుచిని గమనించవచ్చు. ఇలా చూస్తే కచ్చితంగా నూనె కల్తీ అని అర్థం.
ఇంట్లో నూనె నాణ్యతను ఎలా పరీక్షించాలి?
ఒక గిన్నెలో కొంచెం నూనె పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. మీరు వేసిన నూనె స్వచ్ఛమైనదైతే, అది ఘనీభవిస్తుంది. కల్తీ నూనె అయితే ద్రవ రూపంలోనే ఉంటుంది.
మీరు ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడితే, ఫ్రీజర్‌లో ఉంచిన 30 నిమిషాల్లో గట్టిపడినట్లయితే, ఆలివ్ ఆయిల్ స్వచ్ఛమైనదని అర్థం.
ఒక తెల్ల కాగితం తీసుకుని, కొద్దిగా నూనెతో ఆరబెట్టాలి. నూనె స్వచ్ఛంగా ఉంటే, అది వృత్తంలా వ్యాపిస్తుంది. ఇది నకిలీ నూనె అయితే, అది ప్రవహిస్తుంది.
వంటనూనెలో కల్తీని తెలుసుకోవాలంటే టెస్ట్ ట్యూబ్‌లో కొద్దిగా వంటనూనె పోసి అందులో 4 మి.లీ డిస్టిల్డ్ వాటర్ పోసి కొన్ని నిమిషాల పాటు బాగా షేక్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మరో టెస్ట్ ట్యూబ్ లో 2 మి.లీ తీసుకుని దానికి 2 మి.లీ సాంద్రీకృత హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. కల్తీ లేని నూనె అయితే రంగులో మార్పు ఉండదు. కల్తీ చేస్తే నూనె రంగు ఎర్రగా మారుతుంది.
మీరు వాడుతున్న కొబ్బరినూనె స్వచ్ఛమైనదో కాదో చెక్ చేసుకోవడానికి, ఒక గిన్నెలో కొంచెం కొబ్బరి నూనెను తీసుకుని 60 నుంచి 90 నిమిషాల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. మంచి స్వచ్ఛమైన నూనె అయితే చిక్కగా ఉంటుంది. కల్తీ అయితే పైభాగం మాత్రమే ఘనంగానూ కింది భాగం ద్రవంగానూ ఉంటుంది. కల్తీ నూనె వాడితే మెుత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మంచి నూనెను వాడండి.