Margin money for Home Loan | హోం లోన్ కోసం మార్జిన్ మనీ ఎలా సమకూర్చుకోవాలి?
28 February 2022, 15:16 IST
- Margin money for Home Loan | హోం లోన్ ఎలిజిబులిటీ ఉన్నా, పెద్ద మొత్తంలో తీసుకునే వెసులుబాటు ఉన్నా సరే.. హోం లోన్ మంజూరు కావాలంటే మన వాటాగా మనం బిల్డర్లకు ఫ్లాట్ బుక్ చేసే సమయంలో మార్జిన్ మనీ చెల్లించాలి. లోన్‌ను బట్టి ఒక్కోసారి 10 శాతం లేదా 20 శాతం వరకు ఈ మార్జిన్ మనీ చెల్లించాల్సి ఉంటుంది.
హోం లోన్ తీసుకోవాలంటే మార్జిన్ మనీ ఎలా సమకూర్చుకోవాలి?
ఫ్లాటు లేదా ఇండిపెండెంట్ హౌజ్ కొనుగోలు చేయడం అంటే జీవితంలో దాదాపుగా సెటిల్ అయినట్టే లెక్క అని చాలా మంది విశ్వసిస్తుంటారు. వీటి కొనుగోలు వెనక చాలా కసరత్తు చేస్తారు. అయితే చాలా మంది హోం లోన్ తీసుకునేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ మార్జిన్ మనీ లేదా డౌన్ పేమెంట్ సమకూర్చుకోలేక ఫ్లాటు కొనడంలో జాప్యం చేస్తుంటారు. ఈలోపు ఫ్లాటు ధరలు అడ్డగోలుగా పెరుగుతుంటాయి. ఎంతగా అంటే 1000 చదరపు అడుగుల ధర ఉన్న ఫ్లాటు ఇప్పుడు రూ. 50 లక్షల్లో వస్తే ఏడాది జాప్యం చేయడం వల్ల అది రూ. 60 లక్షలు అయి కూర్చుంటుంది. ఒక్క చదరపు అడుగుకు రూ. 1000 పెరిగినా.. మొత్తంగా ప్రభావం రూ. 10 లక్షలు ఉంటుంది. అందువల్ల ఫ్లాటు కొనుగోలులో జాప్యం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.
మార్జిన్ మనీ ఎంత అవసరం?
సాధారణంగా రూ. 30 లక్షల లోన్ వరకైతే బ్యాంకులు ఫ్లాటు విలువలో 90 శాతం రుణాన్ని మంజూరు చేస్తాయి. కానీ అంతకంటే ఎక్కువ రుణం అవసమైనప్పుడు ప్రాపర్టీ విలువలో కేవలం 80 శాతం మాత్రమే లోన్ ఇస్తాయి. అంటే మిగిలిన 10 శాతం లేదా 20 శాతం మార్జిన్‌ను మనం భర్తీ చేయాలి. ఫ్లాటు బుక్ చేసుకునే సమయంలో పది శాతం, అగ్రిమెంట్ నాటికి 20 శాతం నింపాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు ఎమినిటీస్‌తో కలిపి ఫ్లాటు విలువ రూ. 50 లక్షలు అయితే రూ. 10 లక్షల మేర మనం మార్జిన్ మనీ సమకూర్చుకోవాలి. దీనికి అదనంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మనమే సమకూర్చుకోవాలి. వుడ్ వర్క్ అవసరమైతే వాటికి కూడా చెల్లించాల్సి ఉంటుంది.
మార్జిన్ మనీ సేకరణకు మార్గాలు..
కేవలం మార్జిన్ మనీ లేక మీరు లోన్ తీసుకోలేకపోతున్నట్టయితే మీరు మార్జిన్ మనీ సమకూర్చుకోవడానికి ఉన్న అవకాశాలను ఇప్పుడు చూద్దాం.
- సేవింగ్స్ రూపంలో ఉన్న వాటిని లిక్విడిటీలోకి మార్చడం
- గోల్డ్ లోన్, క్రాప్ లోన్
- మార్జిన్ మనీ అవసరమైన మేరకు సేవింగ్స్ చేయడం
- పర్సనల్ లోన్ తీసుకోవడం
- బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేయడం
లిక్విడిటీ అంటే..
సేవింగ్స్ రూపంలో ఉన్న వాటిని లిక్విడిటీలోకి మార్చుకోవడం ఎలా అంటే.. ఉదాహరణకు మీరు జీవిత బీమా ప్రీమియం చెల్లించి ఉంటారు కదా. వాటిపై లోన్ తీసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో సేవ్ చేసి ఉంటే వాటిపై కూడా లోన్ తీసుకోవచ్చు. లేదా మార్కెట్ బాగుంటే వాటిని అమ్ముకోవచ్చు. అలాగే స్టాక్స్‌పై కూడా లోన్ ఇస్తారు. లోన్ తీసుకోవడం ఎందుకంటే అమ్ముకోవచ్చు. చిన్న మొత్తాల పొదుపులో భాగంగా పొదుపు పథకాల్లో చేరి ఉంటే వాటిపై కూడా లోన్ తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా లోన్ తీసుకోవచ్చు.
గోల్డ్ లోన్, క్రాప్ లోన్
ఇక జువెల్లరీ ఏదైనా ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి పేరుపై తీసుకోవడం వల్ల మీ క్రెడిట్ లిమిట్‌పై భారం పడకుండా ఉంటుంది. అలాగే వ్యవసాయ భూములు ఉంటే క్రాప్ లోన్ కూడా తీసుకోవచ్చు. వీలైతే ఇది కూడా జీవిత భాగస్వామిపై ఉంటే మీ క్రెడిట్ లిమిట్‌పై భారం పడదు.
సేవింగ్స్ చేయడం..
ఒకవేళ మీకు ఇతర ఈఎంఐలు ఏవీ లేనిపక్షంలో మీరు చిట్ ఫండ్స్ సంస్థల్లో ఒక చిట్ ప్రారంభించండి. కొద్ది కాలంలోనే చిట్ ఎత్తుకున్నట్టయితే మీరు మార్జిన్ మనీ సమకూర్చుకోవచ్చు. లేదా మార్జిన్ మనీ అవసరమైన మేరకు నెలనెలా పొదుపు చేయడం ప్రారంభించండి.
పర్సనల్ లోన్ తీసుకోవడం..
మీ ఈఎంఐలు అన్నీ కలిపి మీ నెలవారీ ఆదాయంలో 50-60 శాతానికి మించకుండా రుణాలు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్సనల్ లోన్ తీసుకున్నా.. హోం లోన్ ఈఎంఐకి ఇబ్బంది లేదనుకుంటే మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ నెలవారీ ఈఎంఐని లెక్కలోకి తీసుకుని, ఇంకా మీరు ఎంత వరకు ఈఎంఐ చెల్లించగలరో బేరీజే వేసుకుని బ్యాంకులు హోం లోన్ మంజూరు చేస్తాయి.
బంధువులు, స్నేహితుల వద్ద..
మీ నెలవారీ వేతనం బాగుండి, కేవలం మార్జిన్ మనీ లేక హోం లోన్ తీసుకోవడం ఆగిపోతే.. మీ క్రెడిట్ చరిత్ర గురించి తెలిసిన మీ స్నేహితులు, బంధువులను సంప్రదించండి. బ్యాంకు వడ్డీ రేటుకు కాస్త అటు ఇటుగా వడ్డీ చెల్లిస్తానని చెప్పి అప్పు తీసుకోండి. వీలైతే నెలవారీగా వారికి చెల్లిస్తూ ఉండండి.