World mosquito day: ఈ స్టిక్కర్లు, డ్రెస్సులు మీ దగ్గరుంటే దోమలు మీ దగ్గరికే రావు
20 August 2024, 19:00 IST
World mosquito day: దోమలు కుట్టకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకలా కుట్టేస్తాయి. వాటిని దూరంగా ఉంచే మార్గాలు కొన్నున్నాయి. కొన్ని సహజ చిట్కాలు, మరికొన్ని క్లాతింగ్ ఆప్షన్ల వల్ల దోమలు కుట్టకుండా కాపాడుకోవచ్చు.
దోమలు కుట్టకుండా రక్షించే మార్గాలు
పాములకు భయపడని వాళ్లు కూడా దోమలకు భయపడాల్సిందే. అవి కుట్టాయంటే ఏ రోగం వస్తుందోనని భయం మొదలైపోతుంది. ఈ కాలంలో దోమల వల్ల వ్యాపించే వ్యాధులు మరింత ఎక్కువ. దోమల నుంచి మనల్ని రక్షించే మార్గాల కోసం వెతుక్కోవాల్సిందే. పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నా సరే కూడా దోమలు వస్తాయి. అప్పుడు వాటినుంచి రక్షించుకునే మార్గాలు చూడండి.
మస్కిటో రిపెల్లెంట్ స్టిక్కర్లు
ఇది వరకు ఈ రిపెల్లెంట్ స్టిక్కర్లు ప్యాచెస్ లాగా.. చెప్పాలంటే చూడ్డానికి బ్యాండ్ ఎయిడ్ లాగా ఉండేవి. వాటిని డ్రెస్సులకు అతికిస్తే దోమలు కుట్టకుండా ఉంటాయి. చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లినప్పుడు, బయట ఆడుకోడానికి వెళ్లినప్పుడు వీటిని అతికిస్తే దోమలు, కీటకాలు వాళ్లకు కుట్టకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు పిల్లలకు నచ్చేలా ఇవి ఆకర్షణీయమైన రంగుల్లో, కార్టూన్ల ప్రింట్లలోనూ దొరుకుతున్నాయి. మీరు మర్చిపోయినా పిల్లలే వీటిని పెట్టమని గుర్తు చేస్తారు. అంతగా నచ్చేస్తాయి.
మస్కిటో రిపెల్లెంట్ క్లాతింగ్
మస్కిటో లేదా బగ్ రిపెల్లెంట్ క్లాతింగ్ కూడా మార్కెట్లోకి వచ్చేసింది. వీటిని ఫ్యాక్టరీల్లోనే దోమలు, కీటకాలు కుట్టకుండా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ట్రీట్ చేస్తారు. వీటిని వేసుకున్నప్పుడు దోమలు కుట్టవు. పాశ్చాత్య దేశాల్లో అయితే మస్కిటో రిపెల్లెంట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మనం బట్టలు పంపిస్తే వాటిని ట్రీట్ చేసి దోమలు కుట్టకుండా చేసిస్తారు. వీటి ధర మామూలు బట్టలకన్నా వంద రెండొందలు ఎక్కువగా ఉండొచ్చంతే.
స్లీపింగ్ బ్యాగ్
నెలల వయసున్న పిల్లలకు స్టిక్లర్లు, లోషన్లు వాడాలంటే కాస్త భయంగా ఉంటుంది. అందుకే బేబీ ఫ్రెండ్లీ ఉండేలా మస్కిటో రిపెల్లెంట్ స్లీపింగ్ బ్యాగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. రాత్రి పిల్లల్ని ఈ డ్రెస్సులాగా ఉండే బ్యాగులో పడుకోబెట్టేస్తే దోమలు కుట్టకుండా ఉంటాయి. కాాకపోతే ఇవింకా మనదగ్గర అంతగా అందుబాటులోకి రాలేదు. కొన్ని రకాల కంపెనీలు మాత్రమే వీటిని అమ్ముతున్నాయి.
సహజ పద్ధతులు:
1. వేపనూనె:
50 నుంచి 100 మి.లీ వేప నూనెను నీళ్లు లేదా కొబ్బరి నూనెలో కలిపి కలిపి కాళ్లు చేతులకు రాసుకోవాలి. దీంతో దోమలు కుట్టవు. స్వచ్ఛమైన నిమ్మనూనె ఎంచుకోవడం ముఖ్యం.
2. టీ ట్రీ ఆయిల్:
టీట్రీ ఆయిల్ ఒక ఎసెన్షియల్ నూనె. దీనికి యాంటి సెప్టిక్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది దోమల రిపెల్లెంట్‌గా కూడా పనిచేస్తుంది. దానికోసం ఆలివ్ లేదా కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీట్రీ నూనె కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది.
3. దాల్చిన చెక్క నూనె:
పావు టీస్పూన్ దాల్చిన చెక్క నూనెను కొద్దిగా నీళ్లలో కలపాలి. దీన్ని బట్టలకు చర్మానికి స్ప్రే చేసుకోవచ్చు. ఇంటి చుట్టు పరిసరాల్లో స్ప్రే చేసినా దొమలు తగ్గుతాయి. ఈ నూనె గాఢత ఎక్కువ కాబట్టి ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి వాడితే మంచిది.
4. లెమన్ యూకలిప్టస్:
మస్కిటో రిపెల్లెంట్లలో లెమన్ యూకలిప్టస్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక భాగం లెమన్ యూకలిప్టస్ నూనెను 10 భాగాల సన్ ఫ్లవర్ నూనెలో కలిపి వాడాలి.
ఇవన్నీ చిన్న పిల్లలకు వాడకపోవడం మంచిది. వయసు మరీ తక్కువున్న పిల్లలకు ఏం వాడినా వైద్యుల సలహా తీసుకోవాలి. వీటితో పాటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి కిటికీలకు, గుమ్మాలకు మస్కిటో నెట్స్ వేసుకోవడం వల్ల దోమల నుంచి రక్షణ పొందొచ్చు.