Homemade moisturizer: రసాయనాలు లేని మాయిశ్చరైజర్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
05 June 2023, 17:38 IST
Homemade moisturizer: ఎలాంటి రసాయనాలు లేని మాయిశ్చరైజర్ ఇంట్లోనే తయారుచేసుకునే విధానం ఎలాగో తెలుసుకోండి. నాలుగు రకాల పద్ధతులు వివరంగా చూడండి.
ఇంట్లో తయారు చేసిన మాయిశ్చరైజర్
కాలంతో సంబంధం లేకుండా ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి. పొడి చర్మం ఉన్నా, జిడ్డు చర్మం ఉన్నా మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం తాజాగా, తేమగా ఉంటుంది. అయితే బయట దొరకే మాయిశ్చరైజర్లలో ఏది బాగుందో అనే సందేహంతో పాటూ, రసాయనాలు లేని ఉత్పత్తులు వాడటం ముఖ్యమే. అందుకే ఇంట్లోనే మాయిశ్చరైజర్ ఎలా తయారు చేసుకోవచ్చో విభిన్న పద్ధతులు తెలుసుకోండి. వాటిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం పొడితత్వం పోతుంది. తేమగా, మృదువుగా మారుతుంది.
1. బాదాం నూనెతో మాయిశ్చరైజర్:
3 చెంచాల బాదాం నూనె
1 చెంచా అవకాడో నూనె
3 చెంచాల బీస్ వ్యాక్స్ ( షాపుల్లో సులభంగా దొరుకుతుంది)
2 చుక్కల ల్యావెండర్ నూనె
1 చుక్క పెప్పర్ మింట్ నూనె
ముందుగా బీస్ వ్యాక్స్ కరిగించుకోవాలి. అది వేడి తగ్గాక దాంట్లో అన్ని ఎసెన్షియల్ నూనెలు కలుపుకోవాలి. ఇది గడ్డ కట్టాక తీసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. అంతే మాయిశ్చరైజర్ సిద్ధం. ఈ నూనెలు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి.
2. తేనె గ్లిజరిన్ మాయిశ్చరైజర్:
ఒక చెంచా తేనె
2 చెంచాల గ్లిజరిన్
1 చెంచా నిమ్మరసం
2 చెంచాల గ్రీన్ టీ
వీటన్నింటినీ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. రాత్రంతా ముఖానికి అలాగే వదిలేసి తరువాతి రోజు ఉదయం కడిగేసుకుంటే చాలు. గ్లిజరిన్, తేనె వల్ల చర్మం తేమగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు రావు. నిమ్మరసం మీకు పడకపోతే అది కలపకండి.
3. మందారంతో మాయిశ్చరైజర్:
మందార టీ పొడి రెండు చెంచాలు
1 కప్పు కొబ్బరి నూనె
తయారీ విధానం:
ముందుగా మందార టీ పొడిని లేదా మందార పువ్వుల సన్నని పొడిని తీసుకోవాలి. దాన్ని కొబ్బరి నూనెలో కలిపి నేరుగా కాకుండా వేడి నీళ్లలో పెట్టి వేడిచేయాలి. ఇప్పుడు ఒక సన్నని వస్త్రం సాయంతో నూనెను వడకట్టాలి. ఇది చల్లారాక మిక్సీలో వేసుకుని ఒక రెండు నిమిషాలు తిప్పుకోవాలి. ఇపుడు గులాబీ రంగు క్రీం సిద్ధమవుతుంది.
4. పొడిచర్మానికి మాయిశ్చరైజర్:
సగం కప్పు ఆర్గాన్ ఆయిల్ లేదా జొజోబా నూనె
సగం టీస్పూన్ ఈము నూనె
4 చుక్కల ఎసెన్షియల్ నూనె (నిమ్మగడ్డి నూనె లేదా చేమంతి లేదా గులాబీ నూనె)
పైన చెప్పిన నూనెలన్నీ ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. వాటిని బాగా కలిపి భద్రపరుచుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో ఒకసారి మర్దనా చేసి పావుగంటయ్యాక కడిగేసుకుంటే చాలు. ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవాళ్లకి ఇది మంచి మాయిశ్చరైజర్.
టాపిక్