తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mixed Sprouts For Breakfast | మొలకలతో ఆరోగ్యకరమైన అల్పాహారం.. రెసిపీ ఇదిగో!

Mixed Sprouts for Breakfast | మొలకలతో ఆరోగ్యకరమైన అల్పాహారం.. రెసిపీ ఇదిగో!

HT Telugu Desk HT Telugu

23 June 2023, 6:30 IST

google News
    • Mixed Sprouts Recipe: వివిధ రకాల మొలకెత్తిన ధాన్యాలను అల్పాహారంగా తీసుకుంటే మీ కడుపును నిండుగా ఉంచడమే కాకుండా, అధిక బరువును తగ్గించుకోవచ్చు.
Mixed Sprouts Recipe for Breakfast
Mixed Sprouts Recipe for Breakfast (slurrp )

Mixed Sprouts Recipe for Breakfast

Healthy Breakfast Recipes: ఉదయం అల్పాహారంగా చాలా మంది మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటారు. అయితే ఒకేరకమైన మొలకలు కాకుండా వివిధ రకాల ధాన్యాలు, చిక్కుళ్ల మొలకలను కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా తినడం ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని అల్పాహారంగా తీసుకుంటే మీ కడుపును నిండుగా ఉంచడమే కాకుండా, అధిక బరువును తగ్గించుకోవచ్చు.

మొలకెత్తిన ధాన్యాలు అత్యధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే మొలకలలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. మొలకలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి కాబట్టి గుండె ఆరోగ్యానికి మంచిది. ఇంకా, అధిక మొత్తంలో జీవ ఎంజైమ్‌లతో నిండి ఉంటాయి కాబట్టి మెరుగైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి.

అంతా బాగానే ఉంది కానీ.. వర్షాకాలంలో పచ్చి ఆహారాలు తినడం, వండని ఆహారాలు తినడం అనారోగ్యకరం. పచ్చివాటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఉడికించి, వండుకొని తినడం, గ్రేవీలా చేసుకొని తినడం మేలని నిపుణుల సలహా. ఇక్కడ మీకు వివిధ రకాల మొలకెత్తిన ధాన్యాలతో చేసే అద్భుతమైన అల్పాహారం రెసిపీని అందిస్తున్నాం.

Mixed Sprouts Recipe కోసం కావలసినవి

  • 2 కప్పులు మిశ్రమ మొలకలు (పెసర్లు, శనగలు, చిక్కుళ్లు)
  • 1 ఉల్లిపాయ
  • 1 టొమాటో
  • 2 పచ్చిమిర్చి
  • 1 కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్)
  • 2 టీస్పూన్లు నూనె
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • 1/2 టీస్పూన్ ఇంగువ
  • 1 ఎండు మిర్చి
  • 1/2 టీస్పూన్ నల్ల మిరియాల పొడి
  • 1 టీస్పూన్ నిమ్మరసం
  • ఉప్పు - రుచికి తగినంత
  • కొద్దిగా తాజా కొత్తిమీర ఆకులు

మిశ్రమ మొలకల రెసిపీ తయారీ విధానం

  1. ముందుగా మొలకెత్తిన ధాన్యాలను అన్నీ కలిపి ఆవిరి మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి.
  3. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  4. ఆపైన సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఇతర కూరగాయల ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద వేయించాలి.
  5. ఇప్పుడు మంట తగ్గించి, ఉడికించిన మొలకలు, ఉప్పు, నల్ల మిరియాల పొడి ఆపైన నిమ్మరసం వేసి అన్నింటిని బాగా కలిపండి
  6. అంతే, మిశ్రమ మొలకల అల్పాహారం రెడీ. తాజా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.

వేడి వేడిగా వడ్డించుకొని తినండి. దీనిని నేరుగా తినవచ్చు లేదా రోటీతో అద్దుకొని తినవచ్చు. లేదా బ్రెడ్ ముక్కల నడుమ స్టఫ్ చేసి శాండ్‌విచ్ చేసుకొని కూడా తినవచ్చు.

తదుపరి వ్యాసం