Quick Sandwich Recipe | నైట్ టైంలో లైట్‌గా ఆకలేస్తే, సింపుల్‌గా శాండ్ విచ్ చేసేయండిలా!
13 December 2022, 22:15 IST
- ఆకలి కొద్దిగా ఉన్నప్పుడు త్వరగా ఏదైనా స్నాక్స్ చేసుకొని తినాలనిపిస్తుందా? Quick Vegetable Sandwich Recipe ఇక్కడ ఉంది, ఇది ట్రై చేయండి.
Quick Vegetable Sandwich Recipe
రాత్రి భోజనం చేసినపుడు కూడా కొన్నిసార్లు అర్ధరాత్రి వేళ ఆకలి వేస్తుంది. ఆ ఆకలి మీద ధ్యాసతో నిద్రను కోల్పోతాము. ఇలాంటి సమయంలో మరీ కడుపు టైట్ అయ్యేలా కాకుండా, లైట్‌గా ఏదైనా తినేస్తే కడుపులో ఆత్మరాముడు శాంతిస్తాడు. మరి అప్పటికప్పుడు ఏం తినాలి అని ఆలోచిస్తున్నారా? ముర్కులు, చిప్స్ లాంటివి ఏవైనా తింటే అవి ఆయిల్ ఫుడ్ కాబట్టి వాటితో కొలెస్ట్రాల్ పెరిగే సమస్యలు ఉంటాయి. రెండు నిమిషాల్లో మ్యాగీ చేయాలనుకున్నా ఆ టైంలో పొయ్యి వెలిగించి నూడుల్స్ చేసుకునేంత ఓపిక, ఆసక్తి ఉండవు. సింపుల్ ఐడియా ఒకటి చెప్పాలంటే, మీ ఫ్రిజ్‌లో నుంచి రెండు బ్రెడ్ ముక్కలు, కొన్ని కూరగాయలను తీసుకొని ఫటాఫట్ శాండ్‌విచ్ చేసుకొని, ధనాధన్ తినేసి చుప్‌చాప్‌గా పడుకోవచ్చు. మళ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయానికే నిద్రలేవవచ్చు.
అంతా ఓకే గానీ శాండ్‌విచ్ ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా? శాండ్‌విచ్ చేయటానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక సులభమైన వెజిటెబుల్ శాండ్‌విచ్ రెసిపీని అందిస్తున్నాం. ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ సూచనలు ఇచ్చాం. జస్ట్ వీటిని ఫాలో అయితే చాలు.
Quick Vegetable Sandwich Recipe కోసం కావలసినవి
- రెండు బ్రెడ్ ముక్కలు
- దోసకాయ ముక్కలు
- వెజ్ మయోన్నైస్
- టొమాటో సాస్
- వెన్న
- మిరియాల పొడి
- ఉప్పు
వెజిటెబుల్ శాండ్‌విచ్ తయారు చేసే విధానం
- ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటికి వెన్న రాయండి.
- ఆపై అవే ముక్కలను కొద్దిగా టొమాటో సాస్, ఒక టీస్పూన్ వెజ్ మయోనైస్ అప్లై చేయాలి.
- ఒక దోసకాయను వృతాకారంలో ముక్కలుగా కట్ చేసుకొని ఒక బ్రెడ్ మీద పెట్టుకోవాలి.
- ఆపై రుచికోసం వాటిపైన మిరియాల పొడి, ఉప్పు చల్లుకోవాలి.
- చివరగా మరో బ్రెడ్ ముక్కతో కప్పేస్తే, శాండ్‌విచ్ రెడీ.
ఇంకేంటి తినేసి, పడుకోండి. అంతే!